వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అం‌తుబట్టని కెసిఆర్‌ ‌వ్యూహం

May 10, 2019

జాతీయ రాజకీయాలపై కెసిఆర్‌ ‌వ్యూహమేంటో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. తలలు పండిన రాజకీయవేత్తలకు కూడా ఆయన వేయబోతున్న అడుగులేంటో అర్థంకావు. ఎవరిని ఎప్పుడు మిత్రులుగా చేసుకుంటాడో, ఎవరిని శత్రువుగా చూస్తాడో తెలియదు. రాష్ట్రంలో నిన్నటి వరకు కెసిఆర్‌ను తిట్టినవారే, ఆయన్ను పొగుడుతూ సరదాగా ఆయనతో కారు శికార్లు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో ప్రధాన వ్యక్తులుగా ఉన్నవారిలో చాలామంది ఆయన్ను దూషించినవారె. కెసిఆర్‌కు మాయలమరాఠీ అన్న పేరుంది. పద్నాలుగేళ్ళ ఉద్యమ కాలంలో ఆయనచేసిన ప్రసంగాలు ప్రజలపైన సమ్మోహనాస్త్రాలుగా పనిచేశాయి. ప్రతిపక్షాలు కూడా ఆయన వాగ్ధాటికి ఫిదా అయ్యాయంటే ఆయన ఎంత మాటకారో అర్థమవుతుంది. వ్రాయడానికి సభ్యత అడ్డువచ్చే పదజాలంతో ఆయన్ను దూషించిన అనేకులు ఆ పార్టీనుండి మంత్రులుగా, ఎంఎల్‌ఏలుగా చెలామణి అవుతున్నారు. అంతెందుకు తాజాగా రాష్ట్రంలో క్రమేణ ప్రతిపక్షపార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నదంటే ఆయనలో ఉన్న ఆకర్షణశక్తి ఏమిటో అర్థంకాక మేటి రాజకీయవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు. నిన్నగాక మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బంపర్‌ ‌మెజార్టీతో, అవసరానికి మించిన మెజార్టీ స్థానాలను గెలుచుకున్న టిఆర్‌ఎస్‌లోకి ఇతరపార్టీల వారు వలస బాట పట్టడం వెనుక ఆయనకున్న ఆకర్షణేమిటో అంతుబట్టకుండా ఉంది. ఇదే మాయలమరాఠీ ఇప్పుడు దేశరాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ కేంద్రంపై దృష్టిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో ఆయన ప్రభుత్వాన్ని ఏ పార్టీలైతే విమర్శిస్తూ వచ్చాయో, ఆపార్టీలే ఆయనకు సన్నిహితమయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో కెసిఆర్‌ ‌మేథాశక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కెసిఆర్‌తో సమాంతరంగా కేంద్ర రాజకీయాలపై దృష్టిపెట్టిన ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బిజెపియేతర పార్టీలన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకురావడంలో కెసిఆర్‌కన్నా ఒక అడుగు ముందు ఉన్నాడనుకుంటున్న తరుణంలో, కెసిఆర్‌ ‌మరోసారి రంగప్రవేశం చేయడం ద్వారా దేశభవిష్యత్‌ ‌రాజకీయలపై ప్రజలకిప్పుడు క్వశ్చన్‌మార్క్‌ను మిగిల్చారు. బిజెపి, కాంగ్రెస్‌యేతర ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌పేర ఏకం చేయాలనుకున్న కెసిఆర్‌ ‌మొదటి ప్రయత్నాలు అంత విజయవంతంగా సాగలేదన్న వార్తలు విస్తృత ప్రచారమయ్యాయి. అయితే ఈవిషయంలో కెసిఆర్‌ ‌నోరు విప్పకుండానే తనపని తాను కానిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు రాష్ట్రంలో ముగిసిన తర్వాత మరోమారు ఆయన వివిధ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఈ పర్యటన చాలామందికి ఆశ్చర్యకరంగాను, అనేక ప్రశ్నలను మిగులుస్తున్నది. రాష్ట్రంలో కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కమ్యూనిష్టు పార్టీలకు చెందిన ఇతర రాష్ట్ర నేతలను తన ప్రయత్నంలో భాగస్వాములను చేయగలగడం అందులో భాగమే. కేరళలో అధికార సిపిఎంపార్టీకి చెందిన ముఖ్యమంత్రి పినరన్‌ ‌విజయన్‌తో సానుకూల చర్చలు జరిగినట్లు వస్తున్న వార్తలు దేశ రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఒకింత ఆశ్చర్యకరంగానే కనిపిస్తున్నది. అలాగే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి చేసిన కామెంట్‌ ‌కూడా మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. కేంద్రంలో రాబోయేది యుపిఏ ప్రభుత్వమేనని, అందుకు ఏర్పడే ఫ్రంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, ‌చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనడం వెనుక ఉన్న రహస్యమేంటన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఎన్‌డిఏ నుండి బయటికివచ్చిన తర్వాత తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు ఇప్పటికే చేతులు కలిపిన విషయం తెలియందికాదు. చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న కూటమిలో ఎవరు ప్రధాని అన్నవిషయంలో ఇంతవరకు ఏకాభిప్రాయం లేకపోయినా, బిజెపిని పడగొట్టేందుకు ఇప్పటికే 21 పార్టీలు ఏకమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే జగ్గారెడ్డి మాటలతో ఆ కూటమిలో కెసిఆర్‌ ‌కూడా భాగస్వామి కాబోతున్నాడా అన్న అనుమానానికి తావేర్పడుతున్నది. కెసిఆర్‌ ‌మళ్ళీ కాంగ్రెస్‌వైపు తన స్నేహ హస్తాన్ని చాపనున్నాడా? యుపిఏ కూటమి దగ్గరయ్యేందుకే కుమారస్వామితో దగ్గరయ్యాడా? బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న సంకేతాలేమైనా కెసిఆర్‌కు అందాయా లాంటి ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. ఇంత వరకు కెసిఆర్‌ ‌చర్చలు జరిపినవారిలో కుమార స్వామితో పాటు పశ్చిమ బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ, యుపి మాజీ సిఎం అఖిలేష్‌యాదవ్‌, ‌జార్ఖండ్‌ ‌మాజీ సిఎం హేమంత్‌ ‌సోరెన్‌లంతా కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపుతుండడంతో భాజప, కాంగ్రేసేతర కూటమి అన్న నినాదంపై కెసిఆర్‌ ‌పునరాలోచిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకుల భావన. దీనికి తగినట్లు ఆ పార్టీకిచెందిన ఓ ఏంపి మాటలు తోడవుతున్నాయి. ఈసారి కేంద్రంలో యూనైటెడ్‌ ‌తరహా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని. గతంలో యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ‌బయటి నుండి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నాడు. అలాగే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కూడా 1996లో యూనైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌తరహా ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడే అవకాశం ఉందనడం చూస్తుంటే కెసిఆర్‌ ‌తన నినాదాన్ని సవరించుకుని అదే దిశలో పయనించే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.