వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అత్యాచార ఘటనలపై.. కఠిన శిక్షలకు సిద్ధమే

December 2, 2019

ఫోటో: పార్లమెంటు ముందు నిరసన తెలుపుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ ఎం‌పీలు
ఫోటో: పార్లమెంటు ముందు నిరసన తెలుపుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ ఎం‌పీలు

పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వెల్లడి
కఠిన చట్టాలు తేవాలని పార్లమెంటు ఉభయసభల్లో నినదించిన సభ్యులు
మహిళలపై దాడులకు స్వస్తి పలకాలి
చట్టాల్లో మార్పులతో పాటు ప్రజల్లో కూడా మార్పురావాలి
: రాజ్యసభలో చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు
నియంత్రణలేని మద్యం అమ్మకాలూ ఘటనకు దారితీశాయి
లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి

మహిళలపై అత్యాచారం వంటి ఘటనలపై నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌సోమవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. సభ్యుల ఆందోళనతో ప్రభుత్వం ఏకీభవిస్తున్నది పేర్కొన్నారు. వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం ఘటనను ఖండించారు. ఈ ఘటన దేశాన్ని తలదించుకునేల చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆఘాయిత్యాలను, అకృత్యాలను అడ్డుకునేందుకు కఠినాతికఠిన శిక్షలు రూపొందించేందుకు సిద్ధమేనని కేంద్ర వైఖరిని వెల్లడించారు. సభ్యుల ఆమోదం తెలియజేస్తే చట్టం రూపకల్పనకు ప్రభుత్వం ప్రయత్నాలుచేస్తుందని సభకు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ’దిశ’ హత్యాచార ఘటనపై సోమవారం ఉభయసభల్లో చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్‌ ‌పార్టీ తరుఫున మల్కాజ్‌ ‌గిరి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి లోక్‌ ‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అదేవిధంగా ‘దిశ’ హత్య ఘటనపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంపీ ప్రభాత్‌ ‌ఝూ రాజ్యసభలో జీరో అవర్‌ ‌నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన సభ్యులు దిశ ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టుల ద్వారా కఠిన శిక్షలు విధించాలని కోరారు.
లోక్‌సభలో సుదీర్ఘచర్చ.. మరోవైపు లోక్‌సభలోను దిశ హత్యపై చర్చకు సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశంపై జీరో అవర్‌లో చర్చించాలని కోరుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ మల్కాజ్‌ ‌గిరి ఎంపీ అనుమల రేవంత్‌ ‌రెడ్డి లోక్‌భలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌ ‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు దిశ ఘటనపై చర్చజరిగింది. కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. భద్రత ఉండే హైదరాబాద్‌ ‌నగరంలో ఈ ఘటన జరగడం శోచనీయం అన్నారు. నియంత్రణ లేకుండా మద్యం అమ్మడం కూడా ఈ ఘటనకు దారితీసిందన్నారు. ఘటనను ఖండిస్తున్నామని, నిందితులను ఉరితీయాలన్నారు. కాకినాడ గీతా విశ్వనాథ్‌ ‌మాట్లాడుతూ ఎంపీలు అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. మోదీ, షాలు.. 370 బిల్లుతో భారత మాత తల ఎత్తుకునేలా చేశారు, అలాగే కఠినమైన బిల్లుతో నిందితులను శిక్షించాలన్నారు. మద్యం, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నారు. బెంగాల్‌ ఎం‌పీ లాకెట్‌ ‌ఛటర్జీ మాట్లాడుతూ హైదరాబాద్‌ ‌దిషా ఘటనను ఖండించారు. దేశంలో ప్రతి స్త్రీ భయపడుతోందని, అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ ‌నాయుడు డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ఎం‌పీ మాలోత్‌ ‌కవిత మాట్లాడుతూ..
నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్రతి ఏడాది 33వేల అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయన్నా రు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా కఠిన చట్టం తేవాలన్నారు. పార్టీలకు అతీతంగా చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. దిషా హత్య ఘటన దేశమంతా కలిచివేసిందన్నారు. ఎంపీ అనుప్రియా పటేల్‌ ‌మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు సహించకూడదన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దిశ అత్యాచార నిందితులకు 30రోజుల్లోగా కఠిన శిక్షను అమలు చేయాలని అన్నారు. ఘటన జరిగిన వెంటనే పది బృందాలుగా మారి పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు ఎంపీ నామా తెలిపారు. హైదరాబాద్‌ ‌దిశ ఘటన ఇప్పుడు దేశ సమస్యగా మారిందన్నారు. రాజస్థాన్‌, ‌తమిళనాడు, యూపీల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టుతో 30రోజుల్లోనే నిందితులను శిక్షించాలని నామ కోరారు.
మహిళలపై దాడులు పునరావృతం కావొద్దు – చైర్మన్‌ ‌వెంకయ్య
మహిళలపై దాడులకు స్వస్తి పలకాలని రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు అన్నారు. దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది ఈ చర్చను రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్య కేసు మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానం అన్నారు. ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో, వీటి పరిష్కార చర్యల కోసం మనం ఏదో ఒకటి చేయాలని, దిశ హత్య ఘటనపై ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను వెంకయ్య నాయుడు కోరారు.ఈ సందర్భంగా సభలో సభ్యులు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అనంతరం మళ్లీ వెంకయ్య మాట్లాడుతూ.. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చట్టాల వల్ల బాధితులకు న్యాయం జరగదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసింది. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌ ‌మాట్లాడుతూ.. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఎన్నిచట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. నిందితులకు కఠినశిక్షలు పడేలా చేయాలన్నారు. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని చెప్పారు. అనంతరం అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్‌ ‌మాట్లాడుతూ.. దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.