వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అర్ధ శతాబ్ది క్రితం – పత్రికా విలేఖరిగా రాఘవాచారి

November 2, 2019

రాఘవాచారిగారు, సభలో జరిగింది జరిగినట్లు, ఏ విషయం వదిలి పెట్టకుండా, రిపోర్టు డిక్టేట్‌ ‌చేసేవారు. ధారాళంగా, సునాయాసంగా, ఆయన రిపోర్టు చెపుతూవుంటే, శాసనసభ కార్యాలయంలోనే, టైపురైటర్‌పై, నాలుగు కార్బన్‌ ‌కాపీలు పెట్టి టైపు చేసుకుని, అందరూ తలొక కాపీ తీసుకుని, ఎవరికి కావలసిన రీతిలో వారు రిపోర్టు తయారు చేసుకునేవారు.

మేధావి, అపారమైన జ్ఞాపకశక్తి గలవారు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విశాల హృదయుడు, అయినా నిరాడంబరుడు, నిగర్వి, పరోపకారి, తన విద్వత్తును తొలివారితో పంచుకోవడంలో అనందించే వ్యక్తి – ఇవీ కే।।శే।। చక్రవర్తుల రాఘవాచారి గురించి, వారితో నాకు గల అయిదు దశాబ్దాల అనుభంతో, చెప్పగల విషయాలు. రాఘవాచారి గారితో నా పరిచయం 1969 ప్రారంభం నుండి నేను దక్కన్‌ ‌క్రానికల్‌ ‌పత్రికలకు శాసనసభ, మండలి రిపోర్టింగు మొదలు పెట్టినప్పటి నుండి ప్రారంభమయింది. అంతకుముందే, కీ।।శే।। బి. నాగేశ్వర రావు, టి.వి. కృష్ణగారితో, అప్పుడప్పుడు రాఘవాచారి గారిని జర్నలిస్టుల యూనియన్‌లో కలుసుకోవడం తటస్థించినా, అది పరిచయంతో లెక్క కాదు.

రాఘవాచారి గారు అప్పట్లో (1969) విశాలంధ్ర, పెట్రియాట్‌ ‌విలేఖరిగా శాసనసభ, మండలి సమావేశాలు రిపోర్టు చేస్తుండేవారు. ఆ రోజుల్లో కొన్ని వార్తా పత్రికలకు, వార్తా సంస్థలకు తెలుగు రాని కొందరు విలేఖరులుండేవారు. వారికే నాలాంటి కొత్తగా శాసనసభ రిపోర్టింగు మొదలు పెట్టిన వారికీ, రాఘవాచారిగారు ఒక గురువులాగా ఎంతో అండగా ఉండేవారు. ఏదైనా ముఖ్యమైన అంశాలపై సభలో సుదీర్ఘ చర్చ జరిగి, దానికి ముఖ్యమంత్రో, వేరే మంత్రో సమాధానం ఇవ్వడం జరిగితే, తెలుగురాని విలేఖరులకు రిపోర్టు ఇవ్వడం సమస్యగా మారేది. వాళ్ళు రాఘవాచారి గారి సహాయం కోరేవారు. రాఘవాచారిగారు, సభలో జరిగింది జరిగినట్లు, ఏ విషయం వదిలిపెట్టకుండా, రిపోర్టు డిక్టేట్‌ ‌చేసేవారు. ధారాళంగా, సునాయాసంగా, ఆయన రిపోర్టు చెపుతూవుంటే, శాసనసభ కార్యాలయంలోనే, టైపురైటర్‌పై, నాలుగు కార్బన్‌ ‌కాపీలు పెట్టి టైపు చేసుకుని, అందరూ తలొక కాపీ తీసుకుని, ఎవరికి కావలసిన రీతిలో వారు రిపోర్టు తయారు చేసుకునేవారు. ఏ రిపోర్టరైనా, చాలా నెమ్మదిగా టైపు చేస్తుంటే, ‘‘రామారావ్‌, ‌నువ్వు టైపు చెయ్యి’’ అని రాఘవాచారిగారు అనడం, నేను టైపు చేయడం అనేక సందర్భాలలో జరిగింది. ఇది వారి విశాలహృదయానికి, అవసరమైన వారికి సహాయం చెయ్యడం అనే వాటికి నిదర్శనం.

నా మటుకు నేను, ముఖ్యమైన అంశాలపై రిపోర్టు ఇవ్వవలసినప్పుడు, రాఘవాచారి గారిని, ఏ పాయింటులతో ప్రారంభించాలి (లీడ్‌) అనే విషయంపై సలహా తీసుకుంటూ ఉండేవాడిని. కొన్నిసార్లు నేను వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించి, రాఘవాచారిగారు బాగా ప్రొత్సాహించేవారు. మరికొన్ని సందర్భాలలో, ఆ విషయం కాదు. ఈ విషయం హైలైట్‌ ‌చేయాలనీ, దానికి గల కారణాలను విడమర్చి చెప్పేవారు. రాఘవాచారి గార్కి, తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు ఉర్దూ కూడా బాగా వచ్చు. ఉర్దూ పత్రికల విలేఖరులు కూడా రాఘవాచారి గారితో చర్చించి, ఆయన సలహాలను తీసుకున్న సందర్భాలు చాలా చుశాను నేను.

రాఘవాచారి గారు విజయవాడ వెళ్ళాక గూడా, నేను ఎప్పుడెక్కడికి వెళ్ళినా, ఆయనను కలుసుకుంటూ ఉండేవాడిని. యూనియన్‌ ‌విషయాల్లో, కీ।।శే।।కె. పూర్ణచంద్రరావు, నేను అనేక సార్లు రాఘవాచారిగారిని కలవడం జరిగింది. పూర్ణచంద్రరావు, రాఘవాచారితో మాట్లాడడమే ఒక ఎడ్యూకేషన్‌ అనేవారు. అది నిజమేనని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది.

ఆయన చాలా సౌమ్యుడు. ఆయనకు కోపం రావడం కాని, ఎవరినైనా పరుషంగా మాట్లాడడం కాని, నేను చూడలేదు. ఇది ఆయన ఔన్నత్యాన్ని, సౌశీల్యాన్ని చాటుతుందనడంలో సందేహం లేదు. రాఘవాచారి గారు, బి. నాగేశ్వరరావు, టి.వి.కృష్ణ, డి.నరసింహా రావు(సింహం) వంటివారితో రాజకీయ, సాంఘిక విషయాలు చర్చించుకునేటప్పుడు వినడం ఒక విధమైన ఆసక్తి కరంగా ఉండేది. ఎన్నో కొత్త విషయాలు, కొత్త కారణాలు తెలిసేవి. ఆయన రాసిన సంపాదకీయాలు నేను చద•వలేదనేది యాదార్థం. ఆయినా ఆయన తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేసిన సంపాదకులులో ఒకరని అందరికీ తెలిసిందే. రాఘవచారిగారి మరణం పత్రికారంగానికి తీరనిలోటనేది నిర్వివాదాంశం.

– పి.ఎ. రామారావు,
సీనియర్‌ ‌జర్నలిస్టు.