రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన అనేక హామీలను కేంద్రం నెరవేర్చలేకపోయింది. రాష్ట్రం కూడా కేంద్ర హామీలను రాబట్టుకోవడంలో ఒక విధంగా విఫలమైందనే అనుకోవాల్సి ఉంది. ప్రధానంగా పరిశ్రమల విషయంలో జరుగుతున్న జాప్యం కారణంగా వేలాదిమంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పదేపదే వాటికోసం డిమాండ్ చేస్తూన్నా కేంద్రంనుండి సాధ్యపడదన్న ఒకే ఒక సమాధానం వస్తోంది. ఫలితంగా ఈ ఆరేళ్ళకాలంలో కేంద్ర సహాయంతో ఏఒక్క పరిశ్రమ శ్రీకారం చుట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో నైతేనేమి, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయమైతేనేమి ఏండ్లు గడుస్తున్నా కేంద్రప్రభుత్వం తన హామీని నెరవేర్చడం లేదు. పైగా వాటి ఏర్పాటు విషయంలో అనేక సమస్యలను ఎత్తిచూపుతూ కాలయాపనచేస్తున్నది. హైదరాబాద్ తర్వాత రాజకీయంగా, విద్య, వైద్యపరంగా అంతే పేరున్న వరంగల్‌లో చెప్పుకోదగిన ఫ్యాక్టరీలేవీ ఇప్పుడు లేవు. వేలాది మందికి ఉపాధినందించిన నిజాం కాలంనాటి ఆజంజాహి మిల్లును నడువదని ముద్రవేసి, అటు యంత్రాలను, ఇటు రెండువందల ఎకరాల మిల్లు స్థలాన్ని గజాల లెక్కన అమ్ముకుని సొమ్ముచేసు కున్నారేగాని ఆ తరహా ఫ్యాక్టరీని ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ నెలకొల్పలేకపోయాయి. దాన్ని మరిపించే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామన్న టెక్స్టైల్ పార్క్ అదిగో ఇదిగో అన్నట్లుగానే ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలోనే ముందుకువచ్చి, అ తర్వాత మరుగై పోతున్నాయి. వేలాది మంది ఉపాధిని కలిగిస్తుందని ఆశించిన ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆజంజాహి పునరుద్ధరణ అన్నవి చాలాకాలంగా రాజకీయ పార్టీలకు ఎన్నికల నినాదంగానే పనికి వచ్చాయి. దశాబ్దాలు గడుస్తున్న ఏ ప్రభుత్వమూ వాటిని తీర్చిదిద్దలేకపోయింది. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఆజంజాహి అడుగంటి పోయింది. కాని రాష్ట్ర విభజన హామీల్లో భాగమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకోసం గడచిన ఆరేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతూనేఉంది, కేంద్రప్రభుత్వం దాన్ని దాటవేస్తూనేఉంది. తాజాగా ఇదే విషయమై ఓ ఆంగ్ల దినపత్రిక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ఇచ్చిన సమాధానంతో ఇక ఎన్నటికీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పబడదన్న విషయం స్పష్టమైంది. ఇది వరంగల్ ప్రజలెవరికీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించేదేమీకాదు. ఎందుకంటే నేటికి యాభై ఏళ్ళుగా ఇదే ప్రశ్న, అదే జవాబు అన్నట్లుగా వినివిని వరంగల్ ప్రజలు వేసారిపోయారు గనుక. ప్రత్యక్షంగా 20వేల మందికి, పరోక్షంగా దాదాపు అరవై నుండి ఎనభై వేల ఉపాధి ఆవకాశాన్ని కలిగిస్తుందని ఆశించి ఇక్కడి నాయకులు, ప్రజలు ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీకోసం అనేక ఉద్యమాలు చేశారు. దీక్షలు చేపట్టారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రకాలంలో వరంగల్ ప్రజలు అయిదు దశాబ్దాలుగా వీటికోసమే పోరాటాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అయినా నేటికీ ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు. ఈ వైఖరి మన ప్రజాస్వామ్య పాలనకు అద్దంపడుతున్నట్లుగా ఉంది. ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే వారధిగా ఖాజీపేట జంక్షన్‌కు పేరుంది. అనేక పోరాటాల ఫలితంగా ఇక్కడ ఏర్పడిన డీజిల్, ఎలక్ట్రికల్ లోకో షడ్, మరికొన్ని విభాగా)ను ఒక్కొక్కటిగా ఇతర ప్రాంతాలకు తరలించి ఖాజీపేట జంక్షన్ ప్రాధాన్యాన్ని తక్కువచేసే కార్యక్రమాలే జరుగుతున్నాయిగాని, అభివృద్ధి గురించి కేంద్రం పెద్దగా పట్టించుకున్న పాపానపోలేదు. విచిత్రమేమంటే 1982లోనే ఖాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లో ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ ఆ ఫ్యాక్టరీకి కావల్సిన వసతులు కల్పించినా ఏదో లోపం చూపించారానాడు. ఆ తర్వాత 2011లో మరోసారి ఏర్పాటు చేస్తామన్నారు. అదీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్ర విభజన ఒప్పందాల నేపథ్యంలో మరోసారి ఈ విషయం వెలుగుచూసింది. దాంతో ఇక్కడ వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ షెడ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. 2018 బడ్జెట్లో ఇందుకోసం 199 కోట్ల రూపాయలను కేటాయించింది కూడా. విచిత్రమేమంటే ఇంతవరకు ఇందుకు సంబంధించిన భూ సేకరణ జరుగలేదు. ఈ జాప్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందారోపణ చేసుకునే పనిలోనే పడ్డారు. చివరకు ఇది కూడా కోచ్ ఫ్యాక్టరీ ఖాతాలో కలిసేట్లుగానే కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే పెద్దగా ఉపాధిని ఇవ్వలేని వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ షెడ్కన్నా ముందుగా హామీ ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీలనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు టిఆర్ఎస్ ఎంపిలు విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. వాటితోపాటు సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ అలాగే సికింద్రాబాద్- జహీరాబాద్ ట్రాక్ డబులింగ్, కాజీపేట- హుజూరాబాద్- కరీంనగర్ కొత్త లైన్ల ఏర్పాటు తదితర అంశాలను నాలుగురోజుల క్రితం ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. కాని, తాజాగా ఆంగ్ల దినపత్రిక కరస్పాండెంట్ ఇదే విషయాన్ని అడిగినప్పుడు ఖాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాదని రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేసిన విషయాన్ని ఆ పత్రిక ప్రచురించింది. రాష్ట్ర విభజన బిల్లులో ఈ అంశం ఉన్నప్పటికీ రైల్వేకు ఇక్కడ ప్రస్తుతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవసరం లేదంటూ దీనీపై ఏర్పాటుచేసిన సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికపై తామీ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గోయల్ చెప్పడంతో దశాబ్దాలుగా కోచ్ ఫ్యాక్టరీపై పెట్టుకున్న ఆశ అడియాశే అన్నది స్పష్టవైంది.