వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీపై జోక్యం చేసుకోండి

November 28, 2019

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది
సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకోవటం లేదు
ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే కేసీఆర్‌ ‌కుట్ర
ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ ఎం‌పీల లేఖ

టీఎస్‌ ఆర్టీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, అనంతర పరిణామాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎం‌పీలు గురువారం ప్రధాని మోడీని కోరారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుందని, ప్రభుత్వ వైఫల్యంతో కార్మికులను బలి చేస్తున్నారని ఎంపీలు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, రేవంత్‌ ‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎం.ఏ ఖాన్‌ ‌లు ప్రధాని కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. దేశంలో అతిపెద్ద, సురక్షితమైన ప్రజారవాణా సంస్థగా ఆర్టీసీ కి పేరుంది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్బంగా ఆర్టీసీ కూడా విభజన జరిగిందని, గతంలో 57 వేల మంది ఉండే ఆర్టీసీ ఇప్పుడు 49వేల మంది ఉద్యోగులతో నడుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు, భూములు ఉన్నాయని, ఆర్టీసీ సంస్థను టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ ని ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేస్తుందని, ప్రభుత్వ నుంచి ఆర్టీసీ కి ఇవ్వాల్సిన రాయితీ, వివిధ రకాల బస్‌ ‌పాస్‌ ‌ల డబ్బులు ఇవ్వకుండా నిలిపివేసిందన్నారు. అలాగే ఆర్టీసీ వాడుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌పైన దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ పన్నులు వేయడం వల్ల కూడా ఆర్టీసీ పైన భారం పడుతుందని, ఆర్టీసీ ని కాపాడుకుందుకు 49 వేల మంది 50కి పైగా రోజుల నుంచి సమ్మె చేశారని, దాదాపు 30 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోట్లు వల్ల మృత్యువాత పడ్డారని ఎంపీలో లేఖలో పేర్కొన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా 5100 రూట్లు ను ప్రైవేట్‌ ‌పరం చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిందన్నారు. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ 52 రోజుల తర్వాత సమ్మె విరమించి ఉద్యోగాలలో చేరుతామని ప్రకటించిందని, కానీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చేర్చుకోకుండా పోలీసుల చేత వారిని అరెస్టులు చేయిస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ లో 33శాతం వాటా కలిగి ఉందని, అందువల్ల ఈ విషయాలపై రు (ప్రధాని మోడీ) కలుగజేసుకొని 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసినట్లు ఎంపీలు తెలిపారు.