వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి

November 27, 2019

ఫోటో :బుధవారం హిమాయత్‌నగర్‌ ఎఐటియుసీ కార్యాలయంలో ఆర్టీసీ సమస్యలపై కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ।। కోదండరామ్‌.
ఫోటో :బుధవారం హిమాయత్‌నగర్‌ ఎఐటియుసీ కార్యాలయంలో ఆర్టీసీ సమస్యలపై కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ।। కోదండరామ్‌.

బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి
అఖిలపక్ష సమావేశంలో నేతల డిమాండ్‌
‌రాష్ట్రంలో నియంత పాలనకు తావులేదు:
టీజేఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।। కోదండరామ్‌

‌ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన నియతృంత్వాన్ని గుర్తుకు తెస్తుందని, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి పాలకులు మాట్లాడిన భాషకు నేడు కేసీఆర్‌ ‌మాట్లాడుతున్న ఏలాంటి తేడా లేదని టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ సమాజంలో నియంత పరిపాలనకు తావులేదని అలాంటి వారికి బుద్ధి చెప్పటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఆయన తెలిపారు. బుధవారం హిమాయత్‌నగర్‌ ఎఐటియుసీ కార్యాలయంలో ఆర్టీసీ సమస్యలపై కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలోఆయన మాట్లాడుతూ సమ్మె విరమించి విధులో చేరుతున్న ఆర్టీసీ కార్మికులను అడ్డుకోవటం నియంతృత్వమని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల బాధలు చూసి వివిధ వర్గాల ప్రజలు సానుభూతి తెలియజేస్తున్నప్పటికీ కేసీఆర్‌ ఏలాంటి సానుభూతి లేకుండా ప్రవర్తించటం రాష్రానికే అవమానమని ఆయన అన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌ ‌రమణ మాట్లాడుతూ కేసీఆర్‌ ‌గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేసి నాటి ఆర్టీసీ లాభాల్లో నడిపించానని చెపుతూ నేడు ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోను ప్రభుత్వం భరించలేదని చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. బేషజాలకు పోకుండా కార్మికులందర్నీ విధుల్లోకి తీసుకొని ఆర్టీసీలో సామరస్య వాతావరణం కలుగజేయాలని రమణ కోరారు. సిపియం కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నరసింహరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేయటం లాంటిదని, ఎట్టిపరిస్థితుల్లోను ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగానే కోనసాగించాలని, దాని కావాల్సిన కార్యాచరణ ప్రభుత్వమే నిర్ణయించాలని కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే ఆర్టీసీని ప్రైవేటుపరం చేయటం, ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులపై కక్షగట్టి వారి ఉద్యోగాలు తొలగించటం కాదని అన్నారు. వెంటనే ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్‌ ఎత్తివేసి ప్రశాంత వాతావరణం కలుగజేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్‌ ‌చేశారు. నవంబర్‌ 28, 29 ‌తేదీలలో జరిగే రాష్ట్ర మంత్రివర్గం ఆర్టీసీ సమ్మెను కార్మికుల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని చర్చించాలని, ఆ వైపుగా బాధ్యతాహితంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.నరసింహన్‌, ‌సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఐఎన్‌టియుసి నాయకులు విజయ్‌కుమార్‌ ‌యాదవ్‌, ‌టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.కె.బోస్‌, ‌కేంద్ర ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వి.నాగేశ్వర్‌రావు, ఇన్సూరెన్స్ ‌నాయకులు గంగారాజులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండించారు. 4కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తులను కొంతమంది స్వార్థపరులకు అమ్మటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో న్యాయానికి స్థానం లేదని, కార్మికుల పోరాటాలను అనిచివేయాలనే కుట్రపన్నుతున్నారని దానికి తెలంగాణ రాష్ట్ర కార్మికవర్గం అంతా ఏకమై కేసీఆర్‌ ‌కుట్రలను భగ్నం చేయాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధులలోకి తీసుకోవాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను కేసీఆర్‌ ‌ప్రభుత్వం విరమించుకోవాలని, ఆర్టీసీ కార్మికుల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ స్థలాలలో నిర్మించిన పెట్రోల్‌బంక్‌ల నియామకాల లీజులను రద్దు చేయాలని, ఆర్టీసీ ఆస్తుల అమ్మకాలపై సిబిఐచేత విచారణ చేయించి దోషులను శిక్షించాలని, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించాంది. తక్షణ కార్యాచరణలో భాగంగా ఈ విషయంపై రాష్ట్ర మంత్రులను కలిసి తీర్మానం కాపీనీ అందజేస్తామని నాయకులు తెలిపారు.