వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీ డిపోల వద్ద..ఉద్రిక్తత

November 26, 2019

విధుల్లో చేరేందుకు కార్మికుల యత్నం.. నిరాకరించిన అధికారులు
తాత్కాలిక సిబ్బందిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు విధులలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో విధులలో చేరాలని జేఏసీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉదయమే తాము పనిచేస్తున్న డిపోల వద్దకు చేరుకున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులను విధులలో చేర్చుకునేది లేదని సంస్థ ఎండి సునీల్‌ ‌శర్మ సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. కార్మికులు డిపోలలోనికి ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు, అధికారులు కూడా కార్మికులను విధులలో చేర్చుకోవాలని ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆదేశాలు అందలేదని తిప్పి పంపించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు కొందరు తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు.వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలోని కూకట్‌పల్లి, బర్కత్‌పుర, మియాపూర్‌, ‌రాణిగంజ్‌, ‌హకీంపేట, ఉప్పల్‌, ‌హయత్‌నగర్‌తో పాటు శివార్లలోని ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు తాత్కాలిక సిబ్బందిని బస్సులు బయటికి తీసుకు రాకుండా అడ్డుకున్నారు. అలాగే, వరంగల్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ‌మెదక్‌, ‌రంగారెడ్డి జిల్లా)లోని అన్ని డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నె)కొన్నాయి. కాగా, తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించనప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా సమ్మె విరమించి విధులలో చేరేందుకు వచ్చిన తమను అధికారులు అడ్డుకోవడం అమానుషమని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని డిపోల వద్ద విధులలో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. విధులు నిర్వర్తించడానికి వచ్చిన తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సూర్యాపేట డిపో వద్ద విధుల్లో చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారన్న ఆవేదనతో ఓ కార్మికుడు పెట్రోల్‌ ‌పోసుకుని ఆత్మ హత్మాయ త్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది : రాజకీయ పార్టీల విమర్శ
ఇదిలా ఉండగా, విధులలో చేరడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం అనుమతిం చకపోవడం పట్ల రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించారు. స్వచ్చందంగా సమ్మె విరమించి విధులలో చేరడానికి వస్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈమేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ‌తన తప్పుడు ఆలోచనల మేరకు ఐఏఎస్‌లను వాడుకుంటున్నారని విమర్శించారు. అధికారులు పరిధి దాటి వ్యవహరించవద్దని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను విధులలో చేర్చుకోబోమని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.‌రమణ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధులలోకి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ‌మాట్లాడిన మాటలను కేసీఆర్‌ ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసుల ప్రవర్తన దుర్మార్గంగా ఉందని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ ‌గవర్నర్‌ను సైతం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణలో ఆందోళనలను అణచివేయాలని ప్రయత్నించడం సీఎం కేసీఆర్‌ ‌మూర్ఖత్వమని విమర్శించారు. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులతో అరెస్టు చేయించడం దుర్మార్గమని విమర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు చెప్పలేదన్నారు. విధులలో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోబోమంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై సంస్థ ఎండి సునీల్‌ ‌శర్మ తెలుగులో సంతకం పెట్టడం అనుమానంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను విధులలో చేరవద్దని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎం‌సి భరించేలా సీఎం కేసీఆర్‌ ‌చట్టం తెస్తే కొడుకు కేటీఆర్‌ ‌దానిని తొలగించాడని విమర్శించారు. కాగా, ఆర్టీసీ సమ్మె విఫలం కావడానికి జేఏసీయే ప్రధాన కారణమని ఎన్‌ఎం‌యూ మాజీ నేత మహమూద్‌ అలీ అన్నారు. ప్రభుత్వంతో కార్మికుల సమస్యలను పరిష్కరింపజేసేలా పోరాడటం జేఏసీ నేతలకు చేతకాలేదని విమర్వించారు. గతంలో రవాణా శాఖా మంత్రిగా సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. సమ్మె చేస్తూ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడటంతో కార్మికులకు చేటు జరిగిందన్నారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనీ, సాధ్యమో, కాదో ప్రభుత్వం తేలుస్తుందని పేర్కొన్నారు.