వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ తప్పెలా అవుతుంది?

November 19, 2019

చట్ట విరుద్ధ్దమని ముందే ఎలా చెబుతాం
కేబినేట్‌ ‌నిర్ణయాన్ని తప్పు పట్టలేమన్న హైకోర్టు
విచారణ నేటికి వాయిదా
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను హైకోర్టు సమర్థించింది. దీనిని తప్పుపట్టేలమని తెలిపింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. కేబినెట్‌ ‌నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 67 ‌ప్రకారం రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అయితే సెక్షన్‌ 102 ‌ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ‌కోర్టుకు వివరించారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని గతంలో సీఎం అన్న వ్యాఖ్యలను కోర్టుకు ఉదహరించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. సీఎం ఏమి అన్నారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేబినెట్‌ ‌నిర్ణయం చట్ట బద్ధమా? చట్ట విరుద్ధమా? అనేది కోర్టు ముందున్న అంశం అని ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారం ప్రతిపాదిత మార్పులను గెజిట్‌లో ప్రచురించాలని, ప్రతిపాదిత మార్పులు స్థానిక దిన పత్రికల్లో ప్రచురించాలని, అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. అయితే చట్ట పరమైన పక్రియ అనుసరిస్తారా? లేదా? తెలియకుండా ఇప్పుడే రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా అంటామని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని హైకోర్టు ప్రశ్నించింది. వాదనల అనంతరం కేసు విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి కౌంటర్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ ‌పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్‌ ‌నిర్ణయ పక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్‌ ‌నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్‌ ‌నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. క్యాబినెట్‌ ‌తీర్మానం నోట్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్‌ ‌నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్‌ ‌వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్‌ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్‌ ‌చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్‌ ‌చేయాలని ఆయన హైకోర్టును కోరారు. మరోవైపు హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఆర్టీసీ సమ్మెపై వేచి చూసే దోరణిలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్మిక సంఘాల
స్పందనను బట్టే ప్రతిస్పందించాలని సర్కార్‌ ‌నిర్ణయించినట్లు తెలియ వచ్చింది. కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని, విధుల్లో చేరుతున్నట్లు అన్ని డిపోల్లో వ్యక్తిగతంగా లేఖలు అందచేయాలని, భవిష్యత్తుల్లో సమ్మె చేయమని లిఖిల పూర్వక ప్రమాణ పత్రం ఇవ్వాలని నిబంధనలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ షరతులను అంగీకరించిన కార్మికులనే విధుల్లో తీసుకోవాలనే ఆలోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ షరతులకు కార్మికులు అంగీకరించని పక్షంలో లేబర్‌ ‌కోర్టు తీర్పు వరకు వేచి చూడాలనే భావనలో సర్కార్‌ ఉన్నట్లు సమాచారం. లేబర్‌ ‌కోర్టులో సమ్మె చట్టవిరుద్ధమని తేలితే కార్మికులందరికి వీఆర్‌ఎస్‌ ‌ప్రకటించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా మంగళవారం ఎల్బీనగర్‌లో టీఎంయూ కార్మిక సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ఆర్టీసీ కార్మికులు వేలాదిగా హాజరయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి.. కో కన్వీనర్‌ ‌థామస్‌ ‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.