వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఈతకు వెళ్ళి ముగ్గురు యువకుల దుర్మరణం

November 12, 2019

ఫోటో: బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌
ఫోటో: బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌

కార్తీక పౌర్ణమి రోజున వరికోలు గ్రామంలో విషాదం
కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు
బాధిత కుటుంబాలను పరామర్శించిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో ముగ్గురు యువకులు ఈతకు వెళ్ళి మంగళవారం మృత్యువాత పడ్డారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి… మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్నానాల కోసం దగ్గరలోని వాగుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి మృతి చెందారు. మృతులు వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్‌, ‌కూన ప్రశాంత్‌, ‌పెందోట వరప్రసాద్‌లుగా గుర్తించారు. ఇటీవల కురిసన వర్గాలకు వాగులో ఉదృతంగా నీరు ఉంది. వాగులో కొంతమంది ఇసుక కోసం గుంతలు తవ్వడంతో ఆ గుంతలో చిక్కుకున్న ఒకరిని కాపాడటానికి ఒకరు అందులోకి వెళ్ళి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ విషాదచాయలు అలుముకున్నాయి. హుటాహుటిన కోహెడ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. పండుగవేళ ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడడంతో వరికోలు గ్రామంతో పాటు కోహెడ మండలంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంది.
మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పరమార్శ
మృతుల కుటుంబాలను స్థానిక హుస్నాబాద్‌ ‌శాసన సభ్యులు ఒడితల సతీష్‌కుమార్‌ ‌పరామర్శించారు. సంఘటన జరిగిన తెలియగానే హుటాహుటిన వరికోలు గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని, వీరి ఆవేదన అంతు లేనిది, చేతికి అందొచ్చి అండగా ఉంటారనుకున్న కుమారులు మృతి చెందడం అత్యంత బాధాకరం, బాధిత కుటుంబాల బాధ వర్ణించలేనిది, ఇటీవలి వర్షాలకు అన్ని గ్రామాల్లోని చెరువుల్లో, చెక్‌ ‌డ్యాముల్లో, వాగుల్లో, కుంటల్లో, కాలువల్లోకి నీళ్లు వచ్చాయన్నారు.ఎవరూ నీటిలోకి వెళ్లొద్దని, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దన్నారు. నీళ్ల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులను ఈ విషయమై అప్రమత్తం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్త పడాలి. ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుంబాలు జీవితాంతం ఆ బాధను అనుభవించాల్సి వస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అదుకునే విధంగా చేస్తానని ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు ఉన్నారు.