వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఉల్లి కిలో రూ. 150

December 4, 2019

తగ్గిన సరఫరా..
నగరానికి ఈజిప్టు ఉల్లిగడ్డ
కిలో 60 లోపే అమ్మేందుకు చర్యలు
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఉల్లి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 100పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు అమాంతం రూ. 150 దాటిపోయాయి. తాజాగా బుధవారం హోల్‌సేల్‌ ‌మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లిధర గరిష్టంగా 15వేల రూపాయలు పలికింది. ధరలు పెరిగి పోతున్న నేపధ్యంలో హైదరాబాద్‌లోని ప్రధానహోల్సేల్‌ ‌మార్కెట్‌లకు ఉల్లిసరఫరా బాగా తగ్గిపోయింది. మహారాష్ట్రలోని నాసిక్‌ ‌మార్కెట్‌ ‌నుంచే ఉల్లిగడ్డ వివిధ రాష్టాల్రకు తరలిపోతోంది. హైదరాబాద్‌ ‌నగరానికి సాధారణ రోజుల్లో అయితే రోజుకు 150 నుంచి 170లారీల ఉల్లిగడ్డ దిగుమతి అయ్యేది. కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో కొరత కారణంగా నగరానికి 30లారీల ఉల్లికూడా రావడం లేదని హోల్‌సేల్‌ ‌వ్యాపారులు తెలిపారు. నగరానికి మహారాష్ట్ర నుంచే అత్యధికంగా ఉల్లిసరఫరా అవుతుంది. తెలంగాణ, ఆంధ్ర నుంచి ఉల్లిధర పూర్తిగా తగ్గిపోయింది. కర్నాటక నుంచి కొద్దిమొత్తంలో వస్తున్నా అది కూడా నగర అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారు. రిటైల్‌ ‌మార్కెట్‌లో ఉల్లిధర ఇప్పటికే కిలోకు 150 నుంచి 200 రూపాయలకు చేరింది. దీంతో సాధారణ ప్రజలు ఉల్లికొనాలంటేనే భయపడుతున్నారు. హైదరాబాద్‌ ‌నగరానికి సరఫరా అవుతున్న ఉల్లిగడ్డలో అధికశాతం మురిగిపోయినదే వస్తోందని వ్యాపారులు తెలిపారు. మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఉల్లిపంట పూర్తిగా దెబ్బతినిపోయింది. దెబ్బతిన్నఉల్లినే ఆయా రాష్టాల్రకు సరఫరా చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ ‌మార్కెట్‌కూ మురిగిపోయిన ఉల్లిగడ్డనే సరఫరా అవుతోంది.
నగరానికి ఈజిప్టు ఉల్లిగడ్డ
కిలో 60 లోపే అమ్మేందుకు చర్యలు
ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపధ్యంలో ధరల నియంత్రణకు ప్రభుత్వం ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి చేసుకోడానికి సన్నాహాలుచేస్తోంది. రిటైల్‌ ‌మార్కెట్‌లో ఇప్పటికే 100 నుంచి 150 రూపాయలకు ఉల్లి అమ్మకాలు జరుగుతున్నాయి. ఈనేపధ్యంలో మార్కెటింగ్‌శాఖ ఈజిప్టు నుంచి 500 మెట్రిక్‌టన్నుల ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముందుగా 100 మెట్రిక్‌టన్నుల ఉల్లి 7వ తేదీన నగరానికి రానున్నట్టు అధికారులు తెలిపారు. సరూర్‌నగర్‌, ‌మెహదీపట్నం రైతు బజార్లలో వీటిని అమ్మనున్నట్టు సమాచారం. ప్రతి రోజూ సాయంత్ర 4గంటల నుంచి 7గంటల వరకు ఉల్లిని విక్రయిస్తారు. ఈజిప్టు నుంచి సేకరించిన ఉల్లిగడ్డను కిలోకు 60 రూపాయలలోపే విక్రయించనున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిగడ్డకు ఎక్సైజ్‌ ‌డ్యూటీ మినహాయింపు కోరినట్టు అధికారులు తెలిపారు. తద్వారా వినియోగ దారులకు చాలా తక్కువ ధరకే ఉల్లిగడ్డను అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. అమ్మకాల సందర్భంగా వినియోగ దారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరింతగా దిగుమతి చేసుకుంటామన్నారు. ఈజిప్టు ఉల్లి రంగులోనూ, రుచిలోనూ మన లోకల్‌ ఉల్లిగడ్డతో పోలిస్తే కొంత తేడా ఉంటుంది. ఉల్లిగడ్డ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మహారాష్ట్రపైనే ఆధారపడి వుంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఉల్లి కొరత ఎక్కువగా వుంది. కానీ ఉన్నకొద్దిపాటి ఉల్లి మార్కెట్‌కు తరలించాలంటే రవాణా ఛార్జీలు పెరిగిపోవడంతో ధరలు అధికం అవుతున్నట్టు అధికారులు తెలిపారు.