వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఓదార్పులు గాయాలను మాన్పలేవు

December 2, 2019

తన కుమార్తె నిర్భయకు జరిగినట్టుగా దిశకు జరగకూడదని నిర్భయ తల్లి ఆశాదేవి స్పష్టం చేశారంటే ఇప్పటికీ తన కుటుంబానికి న్యాయం జరగలేదని ఆమె ఎంత కుమిలి పోతున్నారో స్పష్టం అవుతోంది. మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. నిర్భయ వంటి ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు వాటికి మరిన్ని బిగిస్తున్నారు. అయినప్పటికీ నేరం చేసిన వారు ఏదో ఒక లొసుగును ఆధారం చేసుకుని తప్పించుకుంటున్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి ఏడేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ నిందితులకు శిక్ష పడకపోవడంతో ఆమెలో నైరాశ్యం పెరిగింది. దిశ విషయంలోనూ అలాగే జరుగుతుందేమోనని ఆమె హెచ్చరిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ నేర పరిశోధనా వ్యవస్థలో ఎన్ని మార్పులు వొచ్చినా నేరస్తులపై విచారణ విషయంలో జాప్యం కొనసాగుతోందనడానికి దిశ మొబైల్‌ ‌ఫోన్‌ను పోలీసులు ఇప్పటికీ సంపాదించలేకపోవడమే ఉధాహరణ. నేరం జరగడానికి ముందు ఆమె ఎవరెవరికి ఫోన్‌ ‌చేశారో, ఆమె ఫోన్‌ ‌నుంచి నిందితులు ఎవరికి ఫోన్‌ ‌చేశారో తెలుసుకోవడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసేందుకు ఆమె తల్లితండ్రులను పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారన్న ఆరోపణలపై పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. నిర్భయపై హత్యాచారం జరిగినప్పుడు పార్లమెంటు ఏ రీతిలో స్పందించిందో ఇప్పుడూ అలాగే స్పందిస్తోంది. అయితే, సభ్యుల ఆగ్రహావేశాల వల్ల, ఓదార్పు మాటల వల్ల దిశ తల్లితండ్రుల ఆవేదన చల్లారదు. నిందితులపై వేగంగా విచారణ పూర్తయి వారికి తగిన శిక్ష పడినప్పుడు మాత్రమే వారి ఆవేదన చల్లారుతుంది. పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన వైసీపీ ఎంపీ వంగా గీత మహిళలను పూజించనక్కరలేదు, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడండి చాలు అంటూ చేసిన వ్యాఖ్య ఎంతో విలువైనది. తమ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తోందనీ, ఎన్నో కార్యక్రమాలను అమలు జేస్తోందని తరచూ గొప్పలు చెప్పుకునే పాలకులను దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో నేరాల సంఖ్య బాగా పెరిగి పోతోంది. తెలంగాణ కూడా అందులో తక్కువేం లేదు. ఆడపిల్లలను చూడగానే అసభ్యంగా ప్రవర్తించడం, చొరవ తీసుకోవడం, ఒంటరిగా ఉంటే మరింత చనువును ప్రదర్శించడం వంటివి అన్ని చోట్లా ఉన్న మాట వాస్తవమే కానీ, ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ జరుగుతున్నందుకు తెలుగువారంతా సిగ్గుతో తల దించుకోవాలి. లింగ, కులపరమైన వివక్షలు అన్ని రంగాల్లో కొనసాగడం, మగపిల్లలకు డబ్బుకు లోటు లేకపోవడం వల్ల ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో నేరస్థులపై సత్వర విచారణ జరిపేందుకు ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులు బాగా పని చేస్తాయనడానికి హనుమకొండలో జరిగిన నేరంపై విచారణ 48 రోజుల్లో పూర్తి కావడమే నిదర్శనం. దిశ కేసుపై కూడా సత్వర విచారణ జరిపించేందుకు ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఆయనకు కేంద్ర నాయకులు మరిన్ని సూచనలు చేయవచ్చు. అన్ని నగరాల్లో, పట్టణాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రజా చైతన్యానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా టీవీల ముందుకు వచ్చి విద్యార్థినులు తమ ఆవేశాన్నీ, ఆక్రోశాన్నీ ప్రదర్శిస్తుండటం ఈ చైతన్యానికి ప్రత్యక్ష నిదర్శనం. దర్యాప్తు పక్కదారి పట్టించకుండా, నీరు గార్చకుండా ఉండేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేయవచ్చు. దిశ తల్లితండ్రులను పరామర్శించడానికి రాజకీయ నాయకుల వెల్లువలా వొచ్చారు. వొస్తున్నారు. కేవలం ఓదార్పు మాటలే కాకుండా అధికారంలో ఉన్న పెద్దలు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అంతేకాకుండా, మహిళలకు రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఎంపీలు సానుకూలంగా స్పందించేందుకు ఇదే సమయం. ఇంతవరకూ ఏవేవో కారణాలు జరుపుతూ గడిపేసిన ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునైనా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఏకతాటిపైకి రావాలి. మహిళల చేతికి అధికారం ఇస్తే ఇలాంటి ఘరాలు జరగకుండా వారు ప్రత్యేక మైన శాసనాలు తెస్తారేమో. ఇప్పుడున్న చట్టాల్లో ఎటువంటి లోపం లేదన్న మాట వాస్తవం. అమలులోనే లోపం అంతా. రాజకీయ పరమైన వొత్తిళ్ళు, ఆశ్రిత, బంధుమిత్ర పక్షపాతాల కారణంగా కేసులన్నీ నీరు గారిపోతున్నాయి. ఈ కేసు విషయంలో అలా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకు కేంద్రం సహకరించాలి. క్షమాభిక్షలు ఇటువంటి ఘోరాలకు పాల్పడిన వారికి ప్రసాదించకుండా ఉంటేనే భవిష్యత్‌లో ఇలాంటి ఘోరాలకు అడ్డుకట్ట పడుతుంది.