వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కట్టలు తెంచుకున్న ఆగ్రహం

November 23, 2019

రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ర్యాలీలు
ఖమ్మం డిపోలోకి చొచ్చుకెళ్ళిన కార్మికులు
సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీని రక్షించాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి షరతుల్లేకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని వరంగల్‌ 1‌డిపో నుంచి ఏక్‌శిలా పార్కు వరకు ’సేవ్‌ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై మహిళా కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. సంగారెడ్డి జిల్లాలోనూ నిరసనలు కొనసాగాయి. ఆర్టీసీని కాపాడాలంటూ జహీరాబాద్‌లో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ‘ఆర్టీసీ బచావో’ అంటూ నగర ప్రధాన ద్వారం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వికారాబాద్‌ ‌జిల్లా పరిగి డిపో డ్రైవర్‌ ‌వీరభద్రయ్య మృతికి నిరసనగా ఆర్టీసీ ఐకాస జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా ఆర్టీసీ ఐకాస, కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి
ఆధ్వర్యంలో డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.
ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్టాండ్‌ ‌వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.బస్‌డిపోలోకి కార్మికులు, అఖిలపక్ష నాయకులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. డిపోకి వస్తున్న బస్సులను మహిళా కండక్టర్లు ఆపేసి వాటి టైర్లలోని గాలి తీసేసారు. కొత్తగూడెం పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం నాయకులు విరాళాలు సేకరించారు. నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని ధర్నాచౌక్‌ ‌నుంచి ప్రారంభించగా బస్టాండ్‌, ‌గాంధీ చౌక్‌, ‌నెహ్రూ పార్క్, ‌రైల్వే స్టేషన్‌ ‌దుగా ఎన్టీఆర్‌ ‌చౌరస్తా వరకు నిర్వహించారు. బోధన్‌లో అంబేద్కర్‌ ‌చౌరస్తా నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్‌ ‌జిల్లాలో ప్రైవేటీకరణకు నిరసనగా బస్టాండ్‌ ‌నుంచి రాందాస్‌ ‌చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో బస్టాండ్‌ ‌ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్‌ ‌నుంచి ఐబీ వరకు దాదాపు 200 మంది కార్మికులు ర్యాలీ తీశారు. కరీంనగర్‌ ‌జిల్లాలో బస్టాండ్‌ ‌నుంచి తెలంగాణ చౌక్‌ ‌వరకు ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖనిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా తెలంగాణ చౌరస్తాలో కార్మికులు మానవ హారం నిర్మించారు.
నేడు డిపోల ఎదుట మానవహారం ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూల స్పందన వొచ్చేవరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ జారీచేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని, సక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఆదివారం ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిన పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు.