వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కిం… కర్తవ్యం

November 19, 2019

నలభై అయిదు రోజులుగా ఆర్టీసి కార్మిక సంఘాలు ఏకధాటిగా జరుపుతూ వస్తున్న సమ్మె ఒక్కసారే నీరుకారి పోయినట్లైంది. సమ్మెపై హైకోర్టులో దాఖలైన కేసు విచారణ సందర్భంగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులను కోర్టు హెచ్చరించడంతో ప్రభుత్వ మెడలు వంచేవిధమైన తీర్పు వస్తుందని కార్మికులు, వారి కుంటుంబాలు ఇంతకాలంగా ఆశగా ఎదురుచూశారు. కాని, ఇకముందు కేసును కార్మిక న్యాయస్థానంలో తేల్చుకోవాలంటూ దానిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కార్మికశాఖ కమిషనర్‌కు సూచిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈకేసుకు సంబంధించి తమవద్ద దాఖలైన కేసుల విచారణ ముగిసినట్లేనని కూడా ప్రకటించడంతో కార్మికసంఘాలిప్పుడు అయోమయంలో పడ్డాయి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కార్మిక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు సంబంధించి రెండు వారా) గడువు ఇవ్వడంతో, ఈ రెండు వారాల్లో తామేమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో కార్మికులున్నారు. కార్మిక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ ప్రారంభమవుతే ఎంతకాలంపాటు కొనసాగుతుందో తెలియదు. కేసు విచారణ పూర్తి అయ్యేవరకు సమ్మెను కొనసాగించాలా, విరమించాలా అన్న మీమాంసలో కార్మికులు, సంఘాల నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవేళ సమ్మెను కొనసాగించితే ఫలితం ఎలా ఉంటుంది. లాభమా? నష్టమా? ఏదీ నిర్ణయించుకోలేక పోతున్నారు. దీనిపైన మంగళవారం కార్మిక జెఏసి, ఇరత రాజకీయ పక్షాలు సుదీర్ఘంగా చర్చలు జరుపుతుండడం ఒకఎత్తు అయితే, ఇంకా సమ్మె కొనసాగించే ఓపిక తమకులేదంటున్నారు కొందరు కార్మికులు. ఇంతదాకా వచ్చిన తర్వాత విరమిస్తే కార్మి•• కుటుంబాలు, ప్రజలు తమనే తప్పుపట్టే ప్రమాదం లేకపోలేదని మరికొందరు వాదిస్తున్నారు. హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వంగాని, ఆర్టీసీ యాజమాన్యంగాని ఏమాత్రం పట్టువిడుపు లేకుండా దృఢంగా కోర్టు ముందు తమవాదనలు వినిపించిన పరిస్థితిలో ఇప్పుడు కార్మికులు సమ్మె మానేసి, విధుల్లో చేరుతామంటే అంగీరించే అవకాశం ఉందా అన్న ప్రశ్న వారిని వేధిస్తున్నది. ఐఏఎస్‌ అధికారుల త్రిసభ్యకమిటీతో చర్చలు జరిపే క్రమంలో ఆనాటి చర్చలు అసంపూర్ణంగా ముగియడానికి ఎవరికి వారు ఎదుటివారే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ చర్చల అనంతరం కార్మికులను ఆర్టీసీ సిబ్బందిగా గుర్తించమని ప్రభుత్వం కరాఖండీగా చెప్పింది. అదే విషయాన్ని అఫిడవిట్‌ ‌ద్వారా కోర్టు ముందుంచింది కూడా. ఈ విషయంలో కోర్టు కూడా జోక్యం చేసుకోలేకపోయింది. సమ్మె విరమించి విధుల్లో చేరుతామనే కార్మికులను చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వలేమని, కేవలం సూచన మాత్రమే చేయగలుతామని ధర్మాసనం స్పష్టం చేయడంతో సమ్మె విరమించినా తమను విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్న ఆయోమయంలో కార్మికులున్నారు. దీనికితోడు కార్మిక సంఘాలు సమ్మెకు పోయిన మొదటి రోజు నుండి దాన్ని చట్టవ్యతిరేక సమ్మెగా ప్రభుత్వం చెబుతూవస్తున్నది. హైకోర్టు ఈ విషయాన్ని కూడా కార్మిక న్యాయస్థానమే చూసుకుంటుందని చెప్పడంతో కార్మికులు తమ సమ్మెకాలంలో సాధించిందని చెప్పుకునేందుకు ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు సమ్మెను కొనసాగిస్తూ కార్మిక న్యాయస్థానంలో కొట్లాడటమా లేక సమ్మె విరమించి ప్రభుత్వం పెట్టే షరతులకు తలొగ్గి విధుల్లో చేరడమా అన్నది కార్మికుల చేతుల్లో ఉందంటున్నారు మేధావివర్గం. అయితే ప్రభుత్వం ప్రకటించినంత మాత్రాన కార్మికుల ఉద్యోగాలకేమీ ధోకా ఉండంటున్నారు. కార్మికులు సమ్మెకు దిగడమంటే తమ ఉద్యోగాలను విడిచిపెట్టినట్లు కాదంటూ సుప్రీమ్‌ ‌కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని తుది తీర్పు వెల్లడించే క్రమంలో హైకోర్టు గుర్తు చేసిన విషయాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. అంతేగాక ప్రభుత్వం కాని, ఆర్టీసీ యాజమాన్యంగాని 48వేల మంది కార్మికులను, వారి కుటుంబాలను రోడ్డున పడవేయటం న్యాయమా అన్న విషయాన్ని మరోసారి ఆలోచించాలని కూడా ఈ సందర్బంగా కోర్టు సూచించడాన్ని బట్టి ప్రభుత్వం అంత నిర్ధయగా వ్యవహరించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వయస్సు మీరినవారు, మధ్య వయస్సులో ఉన్నవారికి ఇప్పుడు ఉపాధి కరువేర్పడుతుందని అందుకు యాజమాన్యాలు కార్మికుల పట్ల ఔదార్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం సూచించింది. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం చూపించేందుకు సుప్రీమ్‌కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీని వేయాలనుకున్న తమ ప్రయత్నం కూడా వృధా అయిందని, తమకున్న విస్తృత అధికారాలతో ఒకవేళ కమిటీవేసినా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చన్న ధర్మాసనం, కార్మికులు కావాలంటే వెంటనే విధుల్లో చేరవచ్చని, అయితే చర్చలు జరుపాలని తాము ఆదేశాలివ్వలేమని పేర్కొనడంతో కార్మికులిప్పుడు ముందుకు పోలేక, వెనక్కు వెళ్ళలేక నడిబజారులో నిలబడినట్లైంది. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను పక్కకుపెట్టి, మిగతా డిమాండ్లపై చర్చించే పక్షంలో సమ్మె విరమిస్తామంటూ ఇప్పటికే అనేకసార్లు ప్రకటించినా, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిం.. కర్తవ్యమంటున్న కార్మికుల ఆవేదన ఎటుదారితీస్తుందో వేచిచూడాల్సిందే.