వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కేసీఆర్‌- ‌జగన్‌ల మధ్య పెరుగుతున్న దూరం

November 22, 2019

ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుల మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కొద్ది నెలల క్రితం ఉన్న సదవగాహన, సామరస్యం కొరవడుతున్నట్టు తెలుస్తోంది. జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ ‌హాజరయ్యారు. ఇప్పుడు ఇద్దరి మధ్య మేలి ముసుగు తొలిగి పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ ‌ను ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించడమే ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణ ప్రాంతాన్ని సుసంపన్నం చేసే ఈ ప్రాజెక్టును కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కొద్ది నెలల క్రితం జగన్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య గోదావరిలో కలిసిపోయింది. కేసీఆర్‌ను, జగన్‌ను కలిపింది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో వారిద్దరికీ ఉన్న శత్రుత్వం. మే నెలలో జగన్‌ ‌కేసీఆర్‌ ‌తో సోదర సంబంధాలను కలిగి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత వారిద్దరూ ఆనందోత్సాహాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. జగన్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి కేసీఆర్‌ ‌హాజరయ్యారు. జగన్‌ ‌రాజకీయ పరిణతితో వ్యవహరించగలరనీ, ఆయన హయాంలో తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సంబంధాలు మెరుగుగా ఉండగవని కేసీఆర్‌ ‌బహిరంగంగానే ప్రకటించారు. అందుకు బదులుగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాత సచివాలయ భవనాలను తెలంగాణకు జగన్‌ ‌కానుకగా ఇచ్చారు. కేసీఆర్‌, ‌జగన్‌ల మధ్య క్విడ్‌ ‌ప్రోకో ఉందనీ, జగన్‌ ‌పార్టీ ఎన్నికల ఖర్చుకు కేసీఆర్‌ ‌విరాళం ఇచ్చారని తెలుగుదేశం ఆరోపించింది. కేసీఆర్‌, ‌జగన్‌ల మధ్య సంబంధాలు దూరం కావడానికి ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులే. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన ఒప్పందం కింద ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలవరానికి కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. అదే రీతిలో కాళేశ్వరానికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా కోరుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రూ।। 80వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టులో నాలుగు బరాజ్‌లు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి. కింద 38 లక్షల ఎకరాలకు 180 -టిఎంసీ•ల నీరు లభిస్తుంది. ఇది కేసీఆర్‌ ‌మానస పుత్రిక. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని అందుకోసమే జాతీయహోదా ఇవ్వాలని కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేస్తున్నారు. పోలవరానికి ఇదివరకే జాతీయ హోదా లభించింది. గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతంలో నిర్మించే ఏ ప్రాజెక్టు వల్లనైనా దిగువ ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతాయి. కాళేశ్వరం వల్ల పోలవరానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్‌కోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. గోదావరి నుంచి 450 టిఎంసీల నీటిని వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ అఫిడవిట్‌లో పేర్కొంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌ ‌తీర్పునకు వ్యతిరేకంగా తెలంగాణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందనీ, ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టానికి కూడా ఇది వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ అఫిడవిట్‌లో పేర్కొంది.

కేసీఆర్‌,‌జగన్‌ ‌ముఖాముఖీ చర్చల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కి తీసుకుని వెళ్ళేందుకు ఈ ఇరువురు ముఖ్యమంత్రులు ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. రోజూ నాలుగు టిఎంసీల నీటిని శ్రీశైలం, నాగార్జున సాగరక్‌ ‌కి తీసుకుని వెళ్ళేందుకు వీలుగా ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే, ఈ ప్రాజెక్టుకు వేలాది కోట్ల రూపాయిలు వ్యయం కావడమే కాకుండా, సాధ్యాసాధ్యాల పై అంచనాలు వేసిన నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.

జగన్‌ ‌యూ టర్న్ ‌తీసుకోవడానికి కారణం నదీజలాల సమస్యే. ఇది ఒక సెంటిమెంట్‌. ‌దీనికి వ్యతిరేకంగా జగన్‌ ఎదురీదలేరు. ఆయన కేసీఆర్‌ ‌ప్రతిపాదనలకు అంగీకరిస్తే రాజకీయంగా జగన్‌ను తెలుగుదేశం ఇరుకున పెట్టి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవచ్చు. గతంలో చంద్రబాబునాయుడు రాష్ట్రానికి రావల్సిన వాటాలపై లాలూచీ పడ్డారన్న ఆరోపణ చేయడమే కాకుండా ఎన్నికల్లో జగన్‌ ‌విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో ఆయన చంద్రబాబుపై పైచేయి సాధించేందుకు అవకాశం కలిగింది. ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్‌పై చంద్రబాబునాయుడు ప్రయోగించవచ్చు. కేసీఆర్‌ ఒత్తిళ్ళకు జగన్‌ ‌లొంగి పోతున్నారని చంద్రబాబు మనుషులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు ప్రధాన కారణం. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ముఖ్యంగా ఎత్తు విషయంలో అభ్యంతరాలను కేసీఆర్‌ ‌లేవనెత్తారు. కోర్టులో పిటిషన్లు వేయించారు. నీటి వనరుల విషయంలో అధికారంలో ఉన్న ఏ నాయకుడూ రాజీ పడలేరు. జగన్‌ ‌యూ టర్న్‌కు ఇదీ కారణం.

సుప్రీమ్‌కోర్టులో కాళేశ్వరానికి వ్యతిరేకంగా కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేయడం వల్లనే కాదు, జగన్‌పై కేసీఆర్‌ ఆ‌గ్రహానికి మరో కారణం ఉంది. జగన్‌ ఏపిఎస్‌ఆర్టిసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. అది కేసీఆర్‌ను ఇరుకున పెట్టింది. తెలంగాణలో సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు ఆంధ్రలో విలీనం చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు చేయరంటూ కెసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ‌ప్రతిష్ఠకు దీంతో దెబ్బతగిలింది. జగన్‌పై తన అసంతృప్తిని కేసీఆర్‌ ‌మీడీయా సమావేశాల్లోనే వ్యక్తం చేశారు. విలీనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఎలా అమలు జేస్తుందో చూద్దాం. కొద్ది నెలలు ఆగండి అని ఆయన ఆర్టీసీ ఉద్యోగులతో అన్నారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్