వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఖండనలోనూ వివక్ష..!

December 1, 2019

ఇటీవల కాలంలో సమాజంలో అన్ని వర్గాలను ఇటువంటి కదిలించిన సంఘటన మరేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే, ఇదే సందర్భంలో వరంగల్‌ ‌లో ఇంతకుముందు ఒక దళిత బాలిక ఇదే మాదిరిగా హత్యాచారానికి గురైంది. కానీ, ఆ సంఘటనపై ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం కాలేదు. ప్రియాంక అగ్రవర్ణానికి చెందినది కనుక అన్ని వర్గాల వారూ ఆమె హత్యాచారాన్ని ఖండిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇవి పూర్తిగా నిరాధారం కాదు. దళిత బాలికలు, మహిళలపై జీవితం ప్రారంభ దశనుంచి ఇలాంటి అకృత్యాలు జరగడం మన సమాజంలో సర్వసాధారణం అయింది.

అత్యాచారం అత్యాచారమే… ఎవరిపైన జరిగినా, దానికి పాల్పడింది ఎవరైనా ఖండించాల్సిందే. బాధితురాలికి న్యాయం కోసం పోరాడవల్సిందే.అత్యాచారం అత్యంత కిరాతకమైనది. హీనమైనది
కానీ, మన దేశంలో ముఖ్యంగా మన సమాజంలో ఇది ఒక రాజకీయ అంశం అయింది. కుల,మత, ప్రాంతాల వివక్షతో దీనిని చూస్తున్నారు. ఇలాంటి దారుణమైన సంఘటనలను ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అలాగే, అత్యాచారాలపై గోష్టుల్లో వక్తలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు అత్యంత హేయంగా ఉంటున్నాయి.
హైదరాబాద్‌ ‌సమీపంలోని ప్రియాంకరెడ్డి అనే వెటర్నరి వైద్యురాలుపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్య, ఆమె భౌతిక కాయాన్ని తగుల బెట్టడం యావత్‌ ‌ప్రజానీకానికి ఒళ్ళు గగుర్పొడిచింది. సమాజంలో ఇలాంటి కీచకులు, కిరాతకులు ఇంకా ఉన్నారా అని పించి ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకున్నారు., ఆమెపై జరిగిన అత్యాచార యత్నం వివరాలు మరింత క్లేశాన్ని కలిగిస్తున్నాయి. నిరంతరం వాహనాలు తిరిగే ప్రదేశానికి అతి చేరువలో ఇంతటి దుర్మార్గం చోటు చేసుకుంది. ఆనవాలు కట్టేందుకు వీలు లేకుండా ఆమె భౌతిక కాయం దగ్ధం అయింది. ఈ సంఘటన సామాజిక, ఎలక్ట్రానిక్‌ ‌మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అవుతోంది. ఏ టీవీలో చూసినా ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలే. ప్రియాంక పై జరిగిన అత్యాచారాన్నీ, ఆమె హత్యనూ లోకం అంతా ఖండిస్తోంది. జాతీయ స్థాయిలో మహిళా కమిషన్‌ ‌వెంటనే స్పందించి ఒక బృందాన్ని పంపింది. అన్ని వర్గాల వారూ ఆమె పై జరిగిన హత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. షాద్‌ ‌నగర్‌ ‌లో శనివారం నాడు స్వచ్చందంగా ఆడ,మగ తేడా లేకుండా వేలాది మంది తరలి వచ్చి నినాదాలు చేశారు. నిందితులను నడి వీధిలో ఉరి తీయాలని బిగ్గరగా అరిచారు. ఇటీవల కాలంలో సమాజంలో అన్ని వర్గాలను ఇటువంటి కదిలించిన సంఘటన మరేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే, ఇదే సందర్భంలో వరంగల్‌ ‌లో ఇంతకుముందు ఒక దళిత బాలిక ఇదే మాదిరిగా హత్యాచారానికి గురైంది. కానీ, ఆ సంఘటనపై ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం కాలేదు. ప్రియాంక అగ్రవర్ణానికి చెందినది కనుక అన్ని వర్గాల వారూ ఆమె హత్యాచారాన్ని ఖండిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇవి పూర్తిగా నిరాధారం కాదు. దళిత బాలికలు, మహిళలపై జీవితం ప్రారంభ దశనుంచి ఇలాంటి అకృత్యాలు జరగడం మన సమాజంలో సర్వసాధారణం అయింది. అంతేకాదు, వారి పట్ల అత్యంత అమానుషంగా, అవమానకరంగా వ్యవహరించడం కూడా సర్వసాధారణమే. పేద కుటుంబంలో తక్కువ కులంలో పుట్టడం ఆమె చేసుకున్న పాపమా అని ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి. అత్యాచారం ఎవరి పైన జరిగినా అత్యాచారమే, దానికి కులం, మతం తేడా లేదు. కానీ, మన సమాజంలో ఈ తేడాలు చూపడం గుండెకోత గా ఉంది. ఇలాంటి విషయాలు రాయడానికి వేళ్ళు వంకర్లు పోతున్నాయి. 2012లో నిర్భయ కేసులో కూడా ఇప్పుడు ప్రియాంక కేసులో మాదిరిగా దేశ వ్యాప్తంగా అలజడి, ఆందోళన చెలరేగింది.నిర్భయ కేసు అనంతరం ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. నిబంధనలు ప్రవేశపెట్టింది. అయితే ఆ చట్టం వచ్చిన తర్వాత పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, మేధావి వర్గాలు ఇలాంటి సంఘటనలపై ఆచి తూచి ప్రకటనలు చేయడం, సంఘటనలను ఖండించడంలో కూడా వివక్ష చూపడం హృదయాన్ని కలచివేసే అంశం. ప్రియాంపై హత్యాచారాన్ని ఖండించాల్సిందే. ఆమెపైనే కాదు, ఎవరిపైన జరిగినా ఖండించాల్సిందే. కానీ,ఇలాంటి ఖండనల వల్ల పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తోందా?