వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జిల్లా వ్యాప్తంగా డెంగ్యూతో 20 మంది మృతి

September 13, 2019

ఏజన్సీలో డెంగ్యూ, మలేరియా విజృంభణ
కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
ఏజన్సీ ప్రాంతంలో డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 20 మందికి పైగా మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలం కావడంతో ఈ విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ఏజన్సీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మురికినీరు చేరటంతో విషజ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల ప్రాంతాల్లో విషజ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఏజన్సీ ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయం లేక మృత్యువాత పడుతున్నారు. డెంగ్యూ జ్వరం ఎక్కువ కావడంతో సమీపంలో ఉన్న పిహెచ్‌సీలలో డాక్టర్లు అందుబాటులో లేక పట్టణ ప్రాంతాలకు తీసుకువచ్చే సమయంలోనే చనిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 20 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా
వీటిని మాత్రం ప్రభత్వ అధికారులు ధృ•వీకరించటం లేదు. ప్రభుత్వం ఆర్భాటంగా డెంగ్యూ జ్వరాలు లేవని ప్రచారం చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఇదే అదునుగా చూసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వేలాది రూపాయలు దండుకోవడమే కాకుండా చివరకు హైద్రాబాద్‌, ‌విజయవాడ ప్రాంతాలకు తీసుకువెళ్ళాలని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సరైన సమయంలో సరైన వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఏజన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు దోమతెరలు ఇచ్చిన దాకళాలు కనబడటం లేదు.సీజనల్‌ ‌వ్యాధులు వచ్చే సమయంలో గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాల్సిన భాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. ఆ దిశగా అధికారులు పనిచేయటం లేదు. ఎక్కడపడితే అక్కడ మురికినీరు ఉన్నప్పటికి గ్రామపంచాయితీ బ్లీచింగ్‌ ‌చల్లే పరిస్థితి కూడ కనపడటం లేదు. గత మూడు సంవత్సరాల నుండి గ్రామ పంచాయితీ గ్రామాల్లో కాని పట్టణ ప్రాంతాల్లో కానీ దోమల నివారణకు చేపట్టే ఫాగింగ్‌ ‌చేయటంలో కూడ అధికారులు వైపల్యం చెందారు. దోమల నివారణకు చర్యలు చేపట్టకపొవడంతో దోమలు ఎక్కువగా తయారై విషజ్వరాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేక త్రాగునీరుకు కూడ ఇబ్బందులు పడి కాలువలు నీరు త్రాగటంతో డెంగ్యూ , మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు.