వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జేఏసీ బహుముఖ వ్యూహం

November 25, 2019

ప్రభుత్వంతో సానుకూల ధోరణిప్రజాతంత్ర, హైదరాబాద్‌ :ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు యోచిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంతో సానుకూల ధోరణితో వ్యవహరిస్తూనే…పరిస్థితిని బట్టి భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అఖిల పక్ష నేతల సూచనతో మంగళవారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో విధులకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, ఆర్టీసీకి ప్రభుత్వం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలనీ, ఆర్టీసీపై ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌ ‌శాతాన్ని తగ్గించాలన్న ప్రధాన డిమాండ్లతో గత 52 రోజులుగా దాదాపు 48 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకూ వెళ్లింది. సమ్మెపై దాఖలైన పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం కుటుంబానికి తండ్రి మాదిరిగా వ్యవహరించి కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. అలాగే, ఆర్టీసీ కార్మికులు సైతం ప్రజల పక్షాన ఆలోచించాలనీ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని పేర్కొంది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అయినప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు పట్టు వదలక పోవడంతో సమస్య యధాతథంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు ఏదో రకంగా పుల్‌స్టాప్‌ ‌పెట్టాలనే ఆలోచనతో హైకోర్టు సమస్యను లేబర్‌ ‌కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించింది. ఈ నేపథ్యంలో బేషరతుగా సమ్మె విరమిస్తున్నామనీ, తమతో చర్చలు జరిపి అయినా ఆర్టీసీ కార్మికులు విధులలో చేరాలని ప్రకటన రూపంలో అయినా ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని జేఏసీ నేతలు కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సోమవారం ఆర్టీసీ జేఏసీ నేతలు రాజకయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ నేత వివేక్‌, ‌టీడీపీ నేతలు ఎల్‌.‌రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపిఐ నేత చాడ వెంకటరెడ్డితో ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వథ్థామరెడ్డి, రాజిరెడ్డి తదితర ప్రధాన నేతలు ఆర్టీసీ సమ్మె ప్రారంభం, ప్రభుత్వం కార్మికులతో అవలంభించిన విధానంతో పాటు పలుమార్లు హైకోర్టులో జరిగిన విచారణ తదనంత పరిణామాలపై అఖిలపక్ష నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. 52 రోజులుగా సాగుతున్న సమ్మెను లేబర్‌ ‌కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలన్న హైకోర్టు సూచనపై ప్రధానంగా చర్చించిన జేఏసీ నేతలు అఖిలపక్ష నేతల సూచనతో సమ్మెకు పుల్‌స్టాప్‌ ‌పెట్టాలని నిర్ణయించారు. లేబర్‌ ‌కోర్టు పరిధిలో ఉన్న సమయంలో సమ్మెను కొనసాగించడం సమంజనం కాదన్న అఖిలపక్ష నేతల అభిప్రాయంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఏకీభవించారు. దీనికి తోడు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్న జేఏసీ నేతలు ప్రస్తుతానికి మంగళవారం నుంచి సమ్మెను పూర్తి స్థాయిలో విరమించి ఉదయం నుంచే విధులకు హాజరు కావాలని కార్మికులకు సూచించారు. ఈమేరకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వథ్థామరెడ్డి మంగళవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 52 రోజుల కొనసాగించిన సమ్మె స్ఫూర్తితోనే అఈ అనివార్య నిర్ణయం తీసుకున్నామనీ, కార్మిక లోకం వెంట జేఏసీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడానికి అంగీకరించని పక్షంలో తిరిగి సమ్మె కొనసాగింపుపై ఆలోచన చేయాలని నిర్ణయించారు. అదే పరిస్థితి కొనసాగిన పక్షంలో కేంద్ర మంత్రులను కలవాలనీ, అప్పటి పరిస్థితిని బట్టి భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే, మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.