వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తుగ్లక్‌ ‌పాలనను గుర్తు చేస్తున్నారు

December 2, 2019

కేసీఆర్‌పై పొన్నాల మండిపాటుమాట మార్చే, మానవత్వం లేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆరు వందల యాభై సంవత్సరాల కింది తుగ్లక్‌ ‌పాలనను ఈ తరానికి గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ చార్జీలు కిలోమీటర్‌కు ఇరవై పైసలు పెంపును వ్యతిరేకిస్తూ జనగామలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు పొన్నాల మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించడం వెనక దోపిడీ కోణం, రాజకీయ కోణం ఉందని ఘాటుగా విమర్శించారు. మీరిచ్చే పద్దెనమిది రకాల రాయితీలు, డీజిల్‌ ‌మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు తీసేస్తే చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. రెండు నెలల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో కోటి మంది ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు మీకు వినిపించలేదా అని ఘాటుగా స్పందించారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన తెలంగాణకు సంబంధం లేని తెలంగాణేతరుడివి నీవు అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చిన మీరు ముఖ్యమంత్రిగా సంస్థను ఎందుకు కాపాడలేక పోయారు ? మీకు ఎవరు అడ్డుపడ్డారని నిలదీశారు. డిపోకు ఐదుగురిని పిలచి చర్చించావా లేక నిర్ణయాలు తీసుకున్న తరువాత పిలిచావా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను అసెంబ్లీ సాక్షిగా అభినందించింది రికార్డులలో ఉన్నదనీ, కేవలం మున్సిపల్‌ ఎన్నికల కోసమే మాట మార్చి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కిలోమీటరుకు ఇరవై పైసలు పెంచడం వెనక కుట్ర లేని ప్రజలు అనుకుంటారా అని వ్యాఖ్యానించారు. మున్సిపల్‌ ఎన్నికల తరువాత మళ్లీ మాట మార్చి ప్రైవేటుపరం చేసిన రూట్లలో పెంచిన చార్జీలతో తమ వారికి లాభం చేయరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు.