వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమిశోభ భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు

November 12, 2019

తెలుగు రాష్టాల్ల్రో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పలు ఆలయాల్లో అధికారులు అభిషేకాలు రద్దుచేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. వలందర్‌ ‌ఘాట్‌, అమరేశ్వర ఘాట్‌ ‌లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నరసాపురం మండలం లక్ష్మణెళిశ్వరం దుర్గా లక్ష్మణెళిశ్వరస్వామికి పంచామృతభిషేకం నిర్వహిస్తున్నారు. నరసాపురం కపిలమల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని గోదావరి నది దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.వేకువజామునే గోదావరిలో కార్తీక దీపాలు వదిలారు. పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వరాలయం, పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయం, ద్వారకాతిరుమల మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టిసీమ, కొవ్వూరు, నరసాపురంలో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి శివాలయం, మేళ్లచెర్వు స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయం, బూరుగడ్డ శివాలయం, పిల్లలమర్రి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.యాదాద్రిలో..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు పోటెత్తారు. ఈమాసం ఎంతో విశేషం కావడంతో ఇక్కడ నిత్యం వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి నరసింహుడి జన్మనక్షత్రం స్వాతిరోజు నుంచే కార్తీకమాసం వేడుకలు మొదలయ్యాయి. పౌర్ణమి కావడంతో వేదమంత్ర పఠనాల మధ్య ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించే పూజారులు గర్భాలయంలోని స్వయంభువులకు కూడా అభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు అధికంగా కొనసాగాయి. శ్రీ నారసింహుడిని దర్శించిన భక్తులకు శివాలయ
సందర్శన కలగడం మరో విశేషం. అన్నవరం ఆలయం తరువాత ఇక్కడే వ్రతాలు అధిక సంఖ్యలో కొనసాగుతాయి. ఆ విశిష్టతగల యాదాద్రిలో రోజూ నాలుగుమార్లు కొనసాగుతున్న ఆ పూజల సదుపాయాన్ని కార్తీకమాసంలో ఆరుదఫాలుగా నిర్వహించేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయించింది. ఆలయ సందర్శన, వ్రతాల నిర్వహణ కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కార్తీక మాసంలో ఆలయాలను సందర్శించి వ్రతాలు నిర్వహించడం శుభదాయకమని పండితులు, పూజారులు చెబుతున్నారు. ఆలయ విస్తరణ పర్వంలోనూ గతంలో కొనసాగిన మండపాలలోనే వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు.