వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు ప్రపంచ బాలల దినోత్సవం బాల్యాన్ని బతకనిద్దాం..వారి హక్కులను పరిరక్షిద్దాం

November 19, 2019

ముద్దులొలికే చిన్నారి. అప్పటి వరకు ఆనందంగా ఆడుకొని అలసిన చిన్నారి, కొద్దిసేపటికే అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రలోకి వెళ్లింది. కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షస ప్రబుద్ధుడు ఆ పసికూనపై కన్నేశాడు. తల్లిపొత్తిళ్ల నుంచి వేరుచేసి మరీ చిదిమేశాడు. ఆ తల్లికి శాశ్వతంగా కడుపుకోత మిగిల్చాడు. సభ్య సమాజంలో తలదించుకునే ఘటనతో రాష్ట్రం అట్టుడికి పోయింది.ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. సభ్యసమాజం తలదించుకొనే పరిస్థితి దాపురించింది. చిన్నారులపై లైంగిక దాడుల సంఘటనలు, పిల్లల శరీర భాగాలతో వికృత చేష్టలతో సమాజంలోని చీడ పురుగుల సంఘటనలు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులలో మనం ఉన్నాం. బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ఎవరిది?ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం(యూనివర్సల్‌ ‌చిల్డ్రన్‌ ‌డే) నవంబర్‌ 20‌వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన నవంబర్‌ 20‌వ తేదిన స్వీకరించడం జరిగింది. బాలల హక్కులు, బాలల మనుగడ, గుర్తింపు, ఆహారం, పోషకాహారం మరియు ఆరోగ్యం, అభివృద్ధి, విద్య మరియు వినోదం, కుటుంబం మరియు సుపరిచితమైన పర్యావరణం, బాలల పట్ల నిర్లక్ష్యం, బాలల రక్షణ, బాలల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటి పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని బాలల హక్కుల ప్రకటన చేయడం జరిగింది.
శారీరక శిక్షలతో పిల్లల మనసులపై ప్రతికూల ప్రభావం శారీరక శిక్షలు పిల్లల మనస్సులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వారిలో కసి, భయాందోళనలకు దారితీస్తాయి. శారీరక శిక్షలకు గురికావడం వల్ల వారిలో ఆగ్రహం, కోపం, ఆత్మన్యూనతా భావం వస్తుంది. తత్ఫలితంగా నిస్సహాయతను చూపుతూ అవమానంతో కుంగిపోయి పిల్లలు ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఇది పిల్లల సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వకపోగా, వారిలో పగ, ప్రతీకారం వంటి వాటిని పెరిగేలా చేస్తుంది. పిల్లలు పెద్దలు చేసేదాన్ని అనుకరిస్తారు. శారీరక శిక్షల వల్ల హింసే మంచిదన్న భావన వారిలో కలుగవచ్చు. ఫలితంగా పెద్దలపైనే పిల్లలు దాడికి దిగవచ్చు. చిన్నతనంలో ఇలా హింసలకు గురయిన వారు ఎదిగాక అలాంటి హింసలనే వారి తోటివారిపైనా, కుటుంబీకులపైనా ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరిక శిక్షలనేవి క్రమశిక్షణ నేర్పడానికి వాడే మార్గం కానే కాదు. ఇది చాలా అరుదుగా మాత్రమే క్రమశిక్షణలోకి తేవడానికి పనికొస్తుంది. పిల్లల విషయంలో ఇది మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుంది. పిల్లలను దండిస్తే, వారు ఆ తప్పును మళ్లీ చేయరనడంలో కొంత నిజం ఉన్నా, శిక్షించడం వల్ల వారికి ఆ విషయాన్ని పూర్తిగా అర్థచేసుకొనే అవకాశాన్ని మాత్రం ఇవ్వదు. బడిని మధ్యలో మానేసిన పిల్లలు, రోడ్లపై తిరుగుతున్న చాలామంది వీధి బాలురు, హోటళ్లలో పనిచేసే పిల్లలు ఇంటి నుంచి, కుటుంబాల నుంచి పారిపోవడానికి శారీరక హింసలే కారణం అని సర్వేలు చెపుతున్నాయి. పిల్లలలో క్రమశిక్షణ ఎవరో చెబితే రాదు, దాన్ని నేర్చుకోవాల్సిందే. పిల్లలు పెద్దలను అనుకరించడం ద్వారా మాత్రమే క్రమశిక్షణ అలవరచుకుంటారు.
బాలల చేతులలోనే దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు బలంగా తయారు కావడమనేది బాలల నైపుణ్యాల వృద్ధి పైన ఆధార పడి ఉంటుందనడంలో సందేహం లేదు. బాలల్లో మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన ఆవశ్యకతపై చైతన్యం కలిగించడం, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరం. తద్వారా బాల్య దశ నుండే జీవిత విలువను గుర్తింప చేయవచ్చు. మానసిక వికాసం, విద్యా వికాసం, విలువలను పెంపొందించే దిశలో కృషి చేయాలి. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తుకు కృషిచేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. బాల కార్మికులను గుర్తించి వారికి జీవనోపాధికి మార్గం చూపించాలి.
– ‌డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్,
‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321