వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పరీక్షలో ఫెయిల్‌ అయిన సుప్రీంకోర్టు

May 9, 2019

తమ సంస్థ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై వచ్చిన లైంగిక ఆరోపణల విచారణలో కనీసం ప్రమాణాలను సర్వోన్నత న్యాయస్థానం నెలకొల్పకపోతే ఇక సామాన్యులకు అటువంటి అవకాశం ఏముంటుంది?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌రంజిత్‌ ‌గొగొయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై సుప్రీంకోర్టు పారదర్శకమైన రీతిలో విచారణ జరిపించి ఉండాల్సింది. గొగొయ్‌పై కోర్టు మాజీ ఉద్యోగిని ఈ ఆరోపణలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దేశంలో కోట్లాది మంది మహిళలు చేసే ఈ మాదిరి ఫిర్యాదులను పారదర్శకంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకు, బాధితులకు న్యాయం జరిగేట్టు చూసేందుకు ప్రమాణాలను నెలకొల్పేందుకు వచ్చిన అవకాశం ఇది. ఇలాంటి కేసుల్లో విచారణకు తగిన మార్గ దర్శకసూత్రాలను రూపొందించి పరిష్కారానికి మార్గదర్శిగా వాటిని సూచించాల్సి ఉంది. దేశంలో పలు ప్రాంతాలలో పని చేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులు రోజూ కుప్పతెప్పలుగా వస్తున్నాయి. తమ సంస్థ అధిపతిపై వచ్చిన ఆరోపణల విషయంలో ఈ ప్రమాణాలను సర్వోన్నత న్యాయస్థానం పాటించలేదు.
తన మీద వచ్చిన ఆరోపణలను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించడం సముచితంగా లేదని ఇప్పటికే చాలా మంది అన్నారు. ఇదో కొత్త సంప్రదాయానికి తెరదీసింది. జస్టిస్‌ ‌గొగొయ్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారణకు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కోర్టులో ఉన్న వారికే ఇందులో ప్రమేయం కల్పించడం, బయటి వారికి అవకాశం కల్పించకపోవడం శోచనీయం. కోర్టులో సీనియర్‌ ‌మహిళా న్యాయమూర్తిని ఈ కమిటీకి నేతృత్వం వహించమని కోరినా, లేక ఆమెను కూడా ఈ కమిటీలో భాగస్వామిని చేసినా బాగుండేది.
ఫిర్యాదుపై విచారణ విధానాన్ని నోటిఫై చేయకుండా ముగ్గురు సభ్యుల కమిటీ ఒకసారి కాదు, మూడు సార్లు మామూలు విచారణకు ఫిర్యాదీ దారును పిలిపించడం, తనకు సాయంగా తెచ్చుకోవడానికి ఎవరినైనా అనుమతించమని పదే పదే ఆమె కోరినప్పటికీ పట్టించుకోకపోవడం చూస్తే, ఆమె అన్నట్టు తీరైన విచారణ పట్ల కమిటీ విముఖంగా ఉన్నట్టు కనిపించింది. విచారణ మధ్యలో ఆమె ఉపసంహరించుకుంది. ఇందుకు బదులు ఈ కమిటీని విశాల ప్రాతిపదికపై ఏర్పాటు చేసి ఉంటే నమ్మకం ఏర్పడి ఉండేది. ఈ అంశం సున్నితత్వాన్ని కూడా ఆ కమిటీ గుర్తించినట్టు లేదు. ఆమె వెళ్ళి పోవడంతో ఈ కమిటీ తన తీర్పు ఇచ్చింది. ఆ మహిళ ఆరోపణలు నిరాధారమని కమిటీ తేల్చినట్టు సుప్రీంకోర్టు సోమవారంనాడు ఎక్స్ ‌పార్టీ తీర్పు ఇచ్చింది. ఆ నివేదికను సంబంధిత న్యాయమూర్తితో పంచుకున్నామని కూడా కమిటీ పేర్కొంది. ఆ మహిళతో సహ మరి ఎవరితోనూ పంచుకోలేదు. తన ఆరోపణలపై న్యాయమూర్తుల కమిటీ జరిపిన విచారణ నివేదికను పిర్యాదీదారునకు తెలియజేయకపోవడంతో న్యాయ మీమాంస ప్రామాణిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆ కమిటీ ఏ విధంగా ఆ నిర్ణయానికి వచ్చిందో ఫిర్యాదీదారునకు తెలియజేయకపోవడంతో ప్రజల విశ్వసనీయతకు అది దూరం అయింది.
‘లైంగిక వేధింపులు నాలుగు గోడల మధ్య జరిగితే వాటిని రుజువు చేయడం కష్టమే కావచ్చు. అయితే అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత అసాధారణ రీతిలో ఆమెను బర్తరఫ్‌ ‌చేయడం, తదితర పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే లైంగిక వేధింపులపై ఆధారాల విషయంలో ఒక నిర్ధారణకు రావడానికి కష్టం ఏమీ కాదు. క్రమ శిక్షణ ఉల్లంఘనకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు కోర్టు రికార్డులు తెలుపుతున్నాయి. ఆమెను బర్తరఫ్‌ ‌చేసిన తీరు, ఆ తర్వాత ఆమె భర్తనూ, కుటుంబ సభ్యులనూ కేసులతో వేధించిన తీరును పరిశీలిస్తే ఆమె చేసిన ప్రాథ•మిక ఫిర్యాదు పైన అనుమానం కలుగుతుంది. మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణ నిరాధారం. తనపై కక్ష సాధించారన్నది కూడా ఊహాగానమే’నని జస్టిస్‌ ‌బాబ్డే కమిటీ నిర్ధారించింది. అయితే, ఆ కమిటీ తీర్పు ఎవరికీ సాయపడదు. చివరికి ఆరోపణలకు గురైన జస్టిస్‌ ‌రంజన్‌ ‌ప్రతిష్ఠకు, అన్నింటికీ మించి సుప్రీంకోర్టు ప్రతిష్ఠకూ ఉపయోగపడదు. ఈ కేసు విషయంలో కోర్టు వ్యవహరణ తీరును హేతుబద్ధంగా ఆలోచించే వారెవరూ సమర్ధించరు. సుప్రీంకోర్టు సిఈడి ఎ డబ్లు చాప్టర్‌ ‌లోని వెర్స్‌ను ప్రస్తావించింది. విశాఖ తీర్పును ప్రస్తావించింది. ఆ తీర్పు న్యాయమూర్తులు ప్రత్యేక తరగతికి చెందిన వారని ఎక్కడా పేర్కొనలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వారికి వర్తించవని పేర్కొనలేదు.