వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పెద్దల సభ చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం

November 18, 2019

250వ సెషన్‌ ‌కేవలం సంఖ్యేకాదు.. ఇదో అందమైన ప్రయాణం
రాజ్యసభ శాశ్వత సభ.. ఇది ఎప్పటికీ రద్దుకాదు దేశ సమాఖ్య విధానానికి ఈ సభ ఆత్మవంటిది రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ
పెద్దల సభ చారిత్రక ఘట్టాలకు సాక్ష్యమని, భారత సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మవంటిదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. భారత రాజకీయాల్లో పెద్దలసభ పాత్రపై రాజ్యసభలో ప్రసంగించారు. 250వ సెషన్‌ అం‌టే కేవలం సంఖ్య మాత్రమే కాదని, ఇదో అందమైన ప్రయాణం అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మ•న్నత ఘట్టంలో పాలుపంచుకునే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు. ఈ సభ చరిత్ర సృష్టించిందని, చరిత్రను చూసిందని, చరిత్రను మార్చడంలోనూ కృషి చేసిందని అన్నారు. రాజ్యసభ శాశ్వత సభ అని, ఇది ఎప్పటికీ రద్దు కాదన్నారు. ఇక్కడకు సభ్యులు వస్తుంటారు వెళ్తుంటారని, లోక్‌సభ సభ్యులు క్షేత్రస్థాయి అంశాలను చూస్తే రాజ్యసభ దూరతీరాలు దూరదృష్టితో చూస్తుందన్నారు. మన దేశ సమాఖ్య విధానానికి ఈ సభ ఆత్మవంటిదని మోదీ కొనియాడారు. విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారి అనుభవాలు దేశానికి ఉపయోగడపడేలా రాజ్యసభ సహకరిస్తుందని, అందుకు అంబేడ్కరే ఉదాహరణ అని మోదీ అన్నారు. ఆలోచనలు, తీరు, విధానాలే ఉభయ సభల ఔన్నత్యాన్ని చాటిచెబుతాయని డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌తెలిపారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో అనేక కీలక ఘట్టాలకు రాజ్యసభ వేదికైందని, ముమ్మారు తలాక్‌, ‌జీఎస్‌టీ వంటి బిల్లులు ఆమోదం పొందాయని అన్నారు. ఆర్టికల్‌ 370, 35ఏ ‌బిల్లులకు సంబంధించిన విషయాల్లో రాజ్యసభ పాత్ర మరవలేనిదని ప్రశంసించారు. రాజ్యసభ రెండో సభఅని 2003లో అటల్‌బిహారీ వాజ్‌పేయీ చెప్పారని, అయితే ఇది ద్వితీయశ్రేణి సభ కాదని మోదీ అన్నారు. ఈ సందర్భంగా నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ, బిజు జనతాదళ్‌ ‌పార్టీలను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంట్‌ ‌నిబంధనలను ఈ పార్టీలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయన్నారు. తనతో సహా అన్ని పార్టీల నేతలు వారిని చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు.
ఆత్మపరిశీలనకు ఇదే సమయం: వెంకయ్య
రాజ్యసభ 250వ సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయమని, స్వాతంత్య్ర వచ్చిన సమయంలో భారత్‌ అనేక సమస్యలు ఎదుర్కొందని గుర్తుచేశారు. మనం చేసిన పనులను గుర్తుచేసుకుని వెన్న తట్టుకునే సమయమిదని,1952లో రాజ్యసభ సమావేశమైన నాటి నుంచి ఎన్నో చట్టాలు చేసిందని అన్నారు. లోక్‌ ‌సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ అడ్డంకిగా నిలవకూడదని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మరింత మెరుగ్గా పని చేసేందుకు ఆయన సూచనలు చేశారు. కాగా, 1952 మే 13న రాజ్యసభ తొలి సమావేశం జరిగింది. రాజ్యసభ ఇప్పటి వరకు 5,466 పనిదినాలు పూర్తి చేసుకోగా, 3,817 బిల్లులను ఆమోదించింది. 1981 అక్టోబర్‌ 17‌న రాజ్యసభ సుదీర్ఘ సమావేశం జరిగింది.
రాజ్యసభలో ఉండడం అదృష్టం: మన్మోహన్‌
‌రాజ్యసభలో 1991 నుంచి సభ్యుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‌తెలిపారు. ఈ సభలో విపక్ష నాయకుడిగా..సభా నాయకుడిగా ఉండే అదృష్టం తనకు దక్కిందన్నారు. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌ ఎగువసభలో ఆయన మాట్లాడారు. సభలో ఏం చేయాలన్న విషయాలను అప్పటి ఛైర్మన్‌ ‌రాధాకృష్ణన్‌ ‌తొలి సమావేశంలోనే చెప్పారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో రెండో సభ ఎందుకు ఉండాలో రాజ్యాంగసభ సభ్యుడు గోపాలస్వామి అయ్యర్‌ ‌స్పష్టంగా తెలియజేశారన్నారు.
ఉభయసభలూ ఒక వ్యవస్థలోని రెండు భాగాలని నెహ్రూ చెప్పిన విషయాన్ని మన్మోహన్‌ ‌గుర్తు చేశారు. చెక్స్ అం‌డ్‌ ‌బ్యాలెన్స్ ‌విషయంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. లోక్‌సభతో పోల్చితే లోతైన చర్చ జరిపేందుకు రాజ్యసభలో అవకాశం ఉంటుందని చెప్పారు. గత ఛైర్మన్‌ ‌హద్‌ అన్సారీ శూన్య గంట, ప్రశ్నోత్తరాలను మార్చారని మన్మోహన్‌ ‌సింగ్‌ అన్నారు.