వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పెళ్ళిళ్లలో పరిహాసాలు

May 25, 2019

సరదాగా కవుల చమత్కార ధోరణిలో నడచిన సాహితీ ప్రతిభ నిదర్శనంగా ఈ రచనను విని ఆస్వాదించండి. మన ఇళ్లలో పెళ్ళిళ్లు జరిగినప్పుడు పెళ్లికి వచ్చినవారు ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకోవడం పరిపాటి. ఎన్నెన్ని వినోదాలో మరి. అయితే – అలాంటి సందర్భాల్లో ఒకవేళ జగత్పాలకులైన త్రిమూర్తులే అలాంటి వ్యవహారం నడిపితే ఎలా వుంటుందో ఊహించుకుంటూ ఒక ప్రముఖ రచయిత్రి విరచించిన ఒక కావ్యం నుండి మీకు ఒక ఘట్టాన్ని వినిపిస్తాను వినండి. గిరిజా కల్యాణం సమయంలో, విష్ణుమూర్తి సకుటుంబంగా విచ్చేశాడు. వివాహం జరిగాక భోజనాలు జరుగుతున్న సందర్భం. శివుడు విస్తరిలో ఉన్న పదార్థాలను అటూ ఇటూ కదుపుతూ వున్నాడట. విష్ణువు ఇది చూశాడు. ఇప్పుడిక వారిద్దరూ ఒకరినొకరు ఏ విధంగా వేళాకోలాలాడుకున్నారో వినండి.
విష్ణువు శివునితో ఇలా అన్నాడు.
విసము తిన్న నోట కసవయ్యె కాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ
అట్టి దివ్యమైన ఆహారములు లే
వటంచు పల్కె విష్ణుడభవుతోడ.
ఏమయ్యా ఈ గారెలూ ఈ బూరెలూ అవీ ఇవీ నచ్చినట్లు లేదే? కాలకూటం తిన్న నోటికి ఈ భక్షాలన్నీ గడ్డిలాగ రుచిలేనట్లే కనబడుచున్నదేమో? ఏం చేస్తాం? అన్నాడు విష్ణువు శివునితో. దానికి సమాధానంగా శివుడిలా తిరిగి చెప్పుకొచ్చాడు.
నిక్కము నీవు పల్కునది నీరజనాభ,
ఇంటెందు మ్రుచ్చిలన్‌ ‌చిక్కదు వెన్న!
తెత్తు మన చిక్కవు ఎంగిలి కాయలెందు, నీ
కెక్కడ తెత్తుమయ్యా, అవి : ఇప్పుడటంచు శివుండు
నవ్వగా నక్కడ పంక్తి భోజనమునందు ఫకాలున నవ్విరందరున్‌!
ఇలా శివుడూ విష్ణువూ పరిహాసాలాడుకున్నారు. నిజమేనయ్యా విష్ణువూ నువ్వు చెప్పింది. ఇక్కడెక్కడా దొంగతనం చేద్దామన్నా వెన్న దొరకదు.వెన్న దొరకదు తెద్దామన్నా! ఎంగిలి కాయలూ దొరకనే దొరకవు. ఎక్కడినుండి తేగలము మరి, అని శివుడనగానే అక్కడున్న బ్రహ్మ, ఇంద్రాది దేవతలు ఫకాలున నవ్వారట.
మన దృష్టిలో నిజానికి ఇది పరిహాసంలాగానే కనిపించినా, కవి దృష్టిలో ఇదొక నిందాస్తుతి లాంటిదే. ఇందులో అంతరార్థం మనం గ్రహించాలి. లోకాలను నాశనం చేసే కాలకూటాన్ని కంఠాన ధరించి అందరినీ కాపాడిన వాడు శివుడు అని విష్ణువు ప్రస్తుతించితే, వెన్న దొంగిలి నెపంతో గోపికలనుద్ధరించిన వాడనీ, శబరి ఎంగిలి పండ్లను తిని భక్త పరాధీనుడైన వాడు విష్ణువనీ శివుడు విష్ణువును ప్రశంసించాడు.

– డా।।పులివర్తి కృష్ణమూర్తి