
విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శన
అర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు
విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..విద్యార్థుల ఆలోచనలకు రూపునిచ్చేందుకు వైజ్శానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలు ఇలాంటి ప్రదర్శనలు చూసి సైంటిస్టుగా, పరిశోదకులుగా రూపాంతరం చెందుతారని చెప్పారు. పాఠాలు వినడం కన్నా విద్యార్థులు చూసి నెర్చుకుని చక్కటి విషయ పరిజ్ఞానం పొందుతారన్నారు. పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల ర్యాంకులు, మార్కుల పైనే దృష్టి పెట్టడం సబబు కాదన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే మంచి వేదిక అన్నారు. సీఎం కేసీఆర్ విద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. విద్యార్థుల జిజ్ఞాసను తెలుసుకుని వారిని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ఏదైనా మనము నేర్చుకొనేది పాఠశాల స్థాయి నుండే నని ప్లాస్టిక్ నిషేధం, మొక్కలు నాటాలి అనే ఆలోచన తరగతి గదిలోనే అంకురార్పన జరగాలన్నారు. బడిలో నీళ్ల గంట మొగాలన్నారు. పిల్లలు రోజుకు కనీసం 2నుంచి 3లీటర్ల నీరు తాగాలన్నారు. రేపటి తరం తరగతి గదుల్లో తయారవుతుందన్న విషయం ఉపాద్యాయులు గుర్తించాలన్నారు. విద్యార్థులను విద్యతో పాటు గుణవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు సామాజిక బాధ్యతను నేర్పాలని మంత్రి హరీష్‌రావు ఉపాధ్యాయులకు సూచించారు.
పది ఫలితాలల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలి
పదవ తరగతి ఫలితాలల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 19 వ తేదీ నుంచి జరగనున్నాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందుకు సిద్దమవ్వాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సిద్దిపేట ఈ దఫా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. వంద శాతం ఫలితాలు సాధించాలని, వంద మంది విద్యార్థులు పదికి పది మార్కులు సాధించాలన్నారు. ఈ దిశగా విద్యార్థులు, ఉపాద్యాయులు, జిల్లా విద్యా శాఖ అధికారులు పని చేయాలని ఆదేశించారు. పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది 99.3 శాతం సాధిస్తే ఇంటర్మీడియట్ లో కేవలం 43శాతం మాత్రమే ఉతీర్ణులవుతున్నారని చెప్పారు. దీనిపై ఇప్పటికే జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష జరిపానన్న మంత్రి హరీష్ రావు, కళాశాల లెక్చరర్లతోను సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కొండపాక జూనియర్ కళాశాలలో మద్యాహ్న భోజనం పెట్టించాలని మంత్రి హరీష్‌రావు స్థానిక నేతలకు సూచించగా అందుకు అంగీకరించారు. ఈకార్యక్రమంలో జెడ్పిచైర్మన్ రోజాశర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.