వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భారత రత్నం లాల్‌ ‌బహదూర్‌

October 1, 2019

భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, మృదుభాషి, భారత దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచినవాడు లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి. మొదటి రైల్వేశాఖ మంత్రిగా, రెండవ ప్రధాన మంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించిన లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి 1904 అక్టోబర్‌ 2‌న శారదా ప్రసాద్‌, ‌రామదులారీ దేవి దంపతులకు ఉత్తరప్రదేశ్‌ ‌లోని ముఘల్‌ ‌సరాయి గ్రామంలో జన్మించాడు. లాల్‌ ‌బహదూర్‌ ‌తండ్రి మొదట బడిపంతులుగా తర్వాత రెవెన్యూశాఖలో గుమస్తాగా పనిచేశాడు. వారిది చాల పేద కుటుంబం. లాల్‌ ‌బహదూర్‌కి ఏడాది వయసులోనే తండ్రి చనిపోవడంతో వారి కుటుంబానికి తాత హాజరీలాల్‌ ఆ‌శ్రయం కల్పించాడు. బాల్యం నుండే లాల్‌ ‌బహదూర్‌ ‌ధైర్యం, సాహస కార్యాల పట్ల ఆసక్తి కలిగివుండేవాడు. చిన్నపుడు పాఠశాలకు వెళ్లాలంటే నది దాటి వెళ్ళవలసి వచ్చేది. పడవలో వెళ్లి చదువుకోవడానికి అతని దగ్గర సరిపడే డబ్బులు ఉండేవి కావు. పడవవాడు ఉచితంగా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఆత్మాభిమానం కలవాడు కాబట్టి ఉచితంగా ప్రయాణం చేయడం ఇష్టం లేక నదిలో ఈదుకుంటూ వెళ్లి తన చదువును కొనసాగించాడు లాల్‌ ‌బహదూర్‌. ‌పుస్తక పఠనం పట్ల మంచి ఆసక్తిని కనబరిచేవాడు. నాటకాల్లో నటించడమంటే అతనికి ఎంతో ఇష్టముండేది. బాలగంగాధర తిలక్‌ ‌యొక్క ఉపన్యాసాలు లాల్‌ ‌బహదూర్‌ ‌జీవితానికి మార్గదర్శకంగా నిలిచాయి. పదవ తరగతి చదువుతున్నపుడే గాంధీజీ ప్రేరణతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1926లో కాశీ విద్యాపీఠం నుండి వెలువడిన మొదటి బ్యాచ్‌ ‌లో తత్వశాస్త్రం, నీతిశాస్త్రం విషయాలతో ప్రథమ శ్రేణిలో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడు కాశీ విద్యాపీఠం వారు లాల్‌ ‌బహదూర్‌ ‌కు శాస్త్రి (పండితుడు) అనే బిరుదునిచ్చారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా 1930లో మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఈ విధంగా వివిధ సందర్భాలలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకుగాను తన జీవితంలో తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ కాలం జైలులోనే గడుపవలసి వచ్చింది. జైలు జీవితంలో కూడా క్రమశిక్షణ విషయంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేవాడు. ఆ సమయాన్ని వృధా చేయకుండా అనేక పుస్తకాలను చదివారు. దేశ స్వాతంత్య్రం కొరకు 1940లో వ్యక్తిగత సత్యాగ్రహం కూడా చేశారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో గోవింద వల్లభ పంత్‌ ‌నాయకత్వంలో పోలీసు, రవాణా శాఖల మంత్రి అయినాడు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మొదటి సారి మహిళా కండక్టర్లను నియమించారు. ఆతర్వాత జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ మొదటి ప్రధాన మంత్రిగా, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి మొదటి రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత హోం శాఖ మంత్రిగా కూడా పని చేశారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారీ రైలు ప్రమాదం జరగడంతో నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేసి పదవీ వ్యామోహం ఏమాత్రం లేదని నిరూపించాడు.
నెహ్రూ మరణం తర్వాత 1964లో లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి ప్రధాన మంత్రి పదవీని చేపట్టారు. అతను ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం ఉంది. దీంతో విదేశాల నుండి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడమే కాకుండా మన దేశంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికాడు. పాల ఉత్పత్తులు పెంచడాన్ని ప్రోత్సహించారు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో భారత ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తేవడంలో లాల్‌ ‌బహదూర్‌ ‌సఫలీకృతుడైనాడు. చైనా దురాక్రమణ సమయంలో, మనదేశంపై చైనా చేసిన ఆరోపణల విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ధీశాలి లాల్‌ ‌బహదూర్‌. ఇదే సమయంలో లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి ఇచ్చిన ‘‘జై జవాన్‌, ‌జై కిసాన్‌’’ ‌నినాదం ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. దేశానికి సైనికుల, రైతుల అవసరాన్ని ఈ నినాదం తెలియజేసింది.
పధాన మంత్రిగా ఉండి కూడా సొంత ఇల్లు లేకుండానే జీవించిన అసలు సిసలైన నిజాయితీ పరుడతడు. ప్రజాప్రతినిధులు ప్రజల ముందు నిజాయితీగా నిలబడాలని భావించిన లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రిని నేటి తరం నాయకులందరు ఆదర్శంగా తీసుకోని ఆయన ఆశయాలను కొనసాగించడమే అతనికిచ్చే ఘనమైన నివాళి.
– కందుకూరి భాస్కర్‌
9441557188