పవార్ ప్రకటనతో మరింత గందరగోళం
మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధ్దంగా బిజెపినేతలు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. శిసేనకు అదికారం దక్కినట్లే దక్కి దూరం అవుతోంది. కాంగ్రెస్-ఎన్సీపిల మద్దతుతో అధికారంలోకి వస్తుందనుకుంటున్న తరుణంలో ఎన్సీపి అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు గందరగోళంలోకి నెట్టాయి. పట్టుదలకు పోవడం వల్లనే అధికారం పంచుకోలేక పోతున్నట్లుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా అభిప్రాయపడ్డారు. మొత్తంగా శివసేన,బిజెపి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి అథవాలే చేసిన వ్యాఖ్యలు కూడా మళ్లీ కొత్త పొత్తులు పొడుస్తాయా అన్న భావన కలిగిస్తున్నారు. అటు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ మాత్రం రోజుకో ప్రకటన చేస్తున్నారు. అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. తాజాగా ప్రధానిని కలిశారు. కేవలం మహారాష్ట్రలో రైతులకు సాయం కోసంమాత్రమే కలిశామని అంటున్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని రౌత్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా శివసేన ముందుకువస్తే.. ఆ పార్టీతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునన్న ఊహాగానాల నేపథ్యంలో శరద్ పవార్ సోనియాతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో వీరి భేటి జరిగింది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనంటూ ఎన్సీపీ ఇప్పటికే సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. శివసేన హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ అధినాయకత్వం ఎలాంటి అడుగు వేయలేదు. సీఎం పదవి పంచే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక, మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ వందకుపైగా స్థానాలు సాధించి సింగిల్ లాస్టింగ్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఆ పార్టీ మెజారిటీ మార్కుకు చాలా దూరం నిలిచిపోయింది. మరోవైపు 56 స్థానాలు గెలిచిన రియల్ కింగ్‌మేకర్‌గా అవతరించిన శివసేన సీఎం పీఠాన్ని సగకాలం తమకు పంచాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం పదవిని పంచేందుకు బీజేపీ ఏమాత్రం సిద్ధపడటం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని చెప్తున్నా.. అదీ ఎంతవరకు సాధ్యమనేది తేలడం లేదు.