వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మహారాష్ట్రలో మహామలుపు

November 23, 2019

ఫోటో: శనివారం రాజ్‌భవన్‌లో సిఎంగా ఫడ్నవీస్‌, అజిత్‌ ‌పవార్‌లతో ప్రమాణం చేయించిన గవర్నర్‌
ఫోటో: శనివారం రాజ్‌భవన్‌లో సిఎంగా ఫడ్నవీస్‌, అజిత్‌ ‌పవార్‌లతో ప్రమాణం చేయించిన గవర్నర్‌

అనూహ్య రీతిలో సీఎంగా ఫడ్నవీస్‌ ‌ప్రమాణం
డిప్యూటీ సీఎంగా అజిత్‌ ‌పవార్‌ ..
ఎన్సీపీ అజిత్‌ ‌వర్గం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు
రాత్రికి రాత్రే మారిన రాజకీయం
బిత్తరపోయిన సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ‌కూటమి
ఫలించిన బీజేపీ తంత్రం.. ఎన్సీపీలో చీలిక?
బలనిరూపణకు 30వరకు గడువిచ్చిన గవర్నర్‌

మహారాష్ట్ర రాజకీయాలు శనివారం నాటకీయ మలుపులు తిరిగాయి. కాంగ్రెస్‌, ‌శివసేన, ఎస్పీలకు బీజేపీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. తెల్లారితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమైన ఆ మూడు పార్టీలకు మోదీ, అమిత్‌షా ద్వయం ఊహించని దెబ్బకొట్టింది. ఎన్సీపీలో చీలిక తేవడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనుకున్నదే తడవుగా ఉదయం 8గంటలకు సీఎంగా ఫడ్నవీస్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ ‌పవార్‌ ‌ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ ‌భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ ఉదయం ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాలన్నీ థ్రిల్లర్‌ ‌సినిమాను తలపించాయి. ఊహించని రీతిలో ఎన్‌సీపీలో చీలిక తీసుకొచ్చి అజిత్‌ ‌పవార్‌ 35 ‌మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు సంతకాలు చేయించి గవర్నర్‌కు ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్‌ ‌వారంరోజులు గడువు ఇచ్చారు. నవంబరు 30లోగా బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ఇక, ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీ, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లు గవర్నర్‌కు అజిత్‌ ‌పవార్‌ ‌లేఖ ఇచ్చారని బీజేపీ వెల్లడించింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌, ‌శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ‌ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఎవరూ ఊహించని విధంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్‌ ‌భేటీ అయిన సంగతి తెలిసిందే. అక్కడే తాజా భాజపా-ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు ముంబయి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారం అనంతరం మోదీ, అమిత్‌ ‌షాకు ఫడ్నవీస్‌ ‌ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు
కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
రెండుగా చీలిపోయిన ఎన్సీపీ బీజేపీ వ్యూహంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అజిత్‌ ‌పవార్‌ ‌వర్గం బీజేపీకి సపోర్టు చేసింది. ఫడ్నవీస్‌కు అనుకూలంగా 30మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి ఫడ్నవీస్‌, అజిత్‌ ‌పవార్‌లు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. రాత్రికి రాత్రే వేగంగా పరిణామాలు మారిపోయాయి. శనివారం ఉదయం కేంద్రానికి గవర్నర్‌కు నివేదిక పంపించడం..ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. అనంతరం ఫడ్నవీస్‌, అజిత్‌ ‌పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని మహారాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. సంఖ్యాపరంగా 145 మేజిక్‌ ‌ఫిగర్‌ ‌చేరుకోవాల్సి ఉంటుంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా..ఎన్సీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. 30 మంది బీజేపీకి ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతివ్వడంతో పార్టీ రెండుగా చీలిన్లటైంది. కానీ బీజేపీ వైపుకు ఎంత మంది వస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.