వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మారని మగ నైజం…

December 4, 2019

దిశ సంఘటనను యావత్‌ ‌భారతావని తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్‌ అం‌తటా రాజుకుంది. రోడ్డు మీదకు వొచ్చిన యువతే కాదు పార్లమెంట్‌లో ప్రజా ప్రతినిధులు సైతం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు వేయాలనే వాదనను బలంగా వినిపించారు. దిశపై దారుణానికి పాల్పడిన వారిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టే ప్రక్రియను పోలీసులు వేగంగానే చేసినా…అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఆ రోజు దిశ తల్లి తన బిడ్డ ఆచూకి కోసం ఆందోళనగా పోలీసులను ఆశ్రయిస్తే వారు స్పందించిన తీరు, చేసిన వెగటు వ్యాఖ్యలను అంత తేలిగ్గా క్షమించలేం. మీడియా ద్వారా పెరిగిన ఒత్తిడితో బాధ్యులైన పోలీసులపై వేటు పడినా…మొత్తంగా పోలీస్‌ ‌వ్యవస్థలో ఇటువంటి భావజాలం పూర్తిగా పోయిందని, పోతుందని అనుకోవటం భ్రమే అవుతుంది.దిశ దారుణం తెలిసిన తర్వాత ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిశాయి. ఊరు, వాడ ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీదకు రావటం చూశాం. సోషల్‌ ‌మీడియాలో మహిళల రక్షణకు సంబంధించి, దిశకు న్యాయం కావాలంటూ పోస్టింగ్‌లు పోటెత్తాయి. ఒక అమ్మాయిని నలుగురు కామాంధులు పాశవికంగా పొట్టన పెట్టుకుంటే సభ్య సమాజం బాగానే స్పందించింది, గళమెత్తింది అన్న ఊరట ఓ వైపు కలుగుతుంది. కాని ఎక్కడో ఓ పలుచటి పొర మాత్రం అలానే ఉంది. దిశ ఘటనను ఖండిస్తున్న, విచారం వొలకబోస్తున్న మగవారిలో చాలా మంది తమ చుట్టూ ఉన్న మహిళల పట్ల వంకర చూపులు చూసే ఉంటారు. చూస్తూనే ఉండి ఉంటారు. ఇంతటి దారుణానికి పాల్పడకపోవచ్చు కాని మౌలిక భావజాలం మాత్రం ఒకటే. ప్రయత్నిస్తే ఆ అమ్మాయి పడతదేమో అనుకునే వాళ్లే. వయస్సుతోను, చదువుతోనూ, స్థాయితోనూ సంబంధం లేదు. పండు ముసలి అయినా పడుచు కోసం అర్రులు చాపే సంస్కారహీనులు ఉన్నారు. తల్లి పొత్తిళ్ళలోని పసికందులోనూ కామం చూసే కామ పిశాచులు కొందరైతే తండ్రిని మించిన గురువు స్థాయిలో ఉండి విద్యాబుద్ధులు చెప్పాల్సిన చిన్నారులను చిదిమేసే మరికొందరు. శారీరక, మానసిక వికలాంగ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నికృష్టులు మరికొందరు. అరవై ఏళ్ళ ముదసలి పెద్దమ్మను చెరిచే వాడు ఒకడు, పదేళ్ళ కన్నబిడ్డపై పడి కోరికలు తీర్చుకునే మృగం మరొకడు. చదువుకుని సంస్కారవంతుల కుర్తా వేసుకునే పైత్యకారులకూ మన సమాజంలో కొదవ లేదు. కొలీగ్‌ ‌కదా అని కాస్త మాట్లాడితే…పడక వరకు ఊహించుకునే ప్రబుద్ధులూ కోకల్లలు. పొరపాటున హలో అంటే చాలు రెండు రోజు ఉదయాన్ని గుడ్‌ ‌మార్నింగ్‌, ‌రాత్రికి గుడ్‌ ‌నైట్‌ ‌మెసేజ్‌లు, మధ్యలో భోజనం అయ్యిందా? ఏం చేస్తున్నారు అంటూ ఎంక్వైరీలు. ఇక ప్రేమ పేరుతో మోసగించే వారు, పెళ్ళి చేసుకుని పిల్లలు పుట్టాక మరో అమ్మాయి వెంటపడి పోయే వారు…ఇలా ఈ చిట్టాకు అంతం లేదనేది గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా…కొంత మంది ఏకంగా ఈ అఘాయిత్యాన్ని సమర్థిస్తూ, అంత రాత్రి పూట దిశ ఒంటరిగా ఎందుకు రోడ్డెక్కటం, ఆడపిల్లల వస్త్రధారణ ఎలా ఉండాలో చెబుతూ సంస్కారం లేని పోస్టింగ్‌లు సోషల్‌ ‌మీడియాలో పెట్టడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీన్ని మించి వెన్నులో వణుకు పుట్టించే మరో వాస్తవం ఏమిటంటే దిశ రేప్‌ ‌వీడియోల కోసం గూగుల్‌లో విపరీతంగా సెర్చ్ ‌జరగటం. ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ఇబ్రహీంపూర్‌లో ఓ వ్యక్తి మహిళను చంపి ఆమె మృతదేహంతో శృంగారం చేసి దాన్ని మళ్లీ వీడియో చిత్రీకరణ చేశాడనే వార్త…తీవ్ర నిరాశ, నిస్పృహ కలుగుతాయి ఇటువంటి విషయాలను దృష్టికి వొచ్చినప్పుడు. నిర్భయ ఉదంతం తర్వాత మహిళలపై లైంగిక దాడికి పాల్పడి, ఆ నేరంలో దొరక్కుండా ఉండేందుకు బాధిత అమ్మాయిలను అంతమొందించటం వొంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీరిలో సింహ భాగం తెలిసిన వారి నుంచే హింసను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్త గణాంకాలు చూస్తే 38 నుంచి 50 శాతం మహిళల హత్యలు వారి సన్నిహితుల ద్వారా, సన్నిహితుల చేతుల్లోనే జరుగుతున్నాయి. హింస నుంచి బయటపడిన మహిళల్లోనూ 90 శాతం మంది వాటిని తాము ఎదుర్కొన్న వేదనను బయటకు చెప్పుకోవటానికి ముందుకు రావటం లేదు. జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రకార 15 నుంచి 49 ఏళ్ల వయస్సు మహిళల్లో 30 శాతం మంది 15 ఏళ్ల నుంచే శారీరక హింసను ఎదుర్కొన్నారు. ఆరు శాతం మంది మహిళలు లైంగిక హింస బాధితులే. 31 శాతం మంది భారతీయ మహిళలు భర్త నుంచే శారీరక, మానసిక, భావోద్వేగ హింసకు గురవుతున్నారు. మహిళల భద్రత, హక్కుల గురించి ఓ వైపు విస్తృతంగా చర్చ జరుగుతున్న సందర్భంలోనే మహిళలపై హింస, దాడులు నిత్యం పెరుగుతూనే ఉండటం ఆవేదన కలిగిస్తుంది. రిజిస్టర్‌ అయిన సంఖ్యే ఇలా ఉంటే…ఎక్కువ సందర్భాల్లో లైంగిక దాడుల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటానికే ముందుకు రారు. సామాజిక, కుటుంబ పరిస్థితులు దీనికి కారణం. నేషనల్‌ ‌క్రైం రికార్డస్ ‌బ్యూరో నివేదిక ప్రకారం 2017లో సుమారు 3 లక్షల 60వేల కేసులు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు స్పష్టం చేస్తున్నాయి. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 3లక్షల 39వేలు కాగా, 2015లో 3లక్షల 29వేలు.
ప్రభుత్వాలకు పట్టని మహిళల భద్రత
ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన తర్వాత మహిళల రక్షణ కోసం కేంద్రం నిర్భయ చట్టం తీసుకువొచ్చింది. అతివల భద్రత కోసం ప్రత్యేకంగా నిర్భయ ఫండ్‌ ‌కూడా ఏర్పడింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం 3,600 కోట్లతో కార్పస్‌ ‌ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ నిధిని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు భద్రత కల్పించే కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. ఏడేళ్ళు దాటిపోయినా…ఈ నిధుల్లో కనీసం 50 శాతం కూడా ఖర్చు కాలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు వన్‌ ‌స్టాప్‌ ‌స్కీం, సెంట్రల్‌ ‌విక్టిమ్‌ ‌కాంపన్సేషన్‌ ‌ఫండ్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ‌సిస్టమ్‌ ‌వంటివి ఏర్పాటు చేయవచ్చు. నిర్లక్ష్యం, నిర్లిప్తత తాండవిస్తున్న చోట్ల నిర్భయ నిధులు మురిగిపో తున్నాయి. తెలంగాణాలో షీ టీమ్స్ ఏర్పాటు వల్ల ఆకతాయిలను అడ్డుకోవటంలో కొంత వరకు ఉపయోగపడుతున్నా…ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మహిళలపై దాడులు, హింసలో 75 నుంచి 80 కేసుల్లో మద్యం, డ్రగ్స్ ‌పాత్ర ఉంటోంది. అయితే మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడ్డారు అనే వాదనను నేను ఖండిస్తాను. కళ్లు మూసుకున్న కామ నైజానికి మద్యం తోడవుతుందే కాని…అదే కారణం కాకపోవచ్చు. ఏది ఏమైనా మనుషుల భావజాలంలో మార్పు రానంత వరకు…మహిళలపై దాడులు అనే అంశం వార్తల్లో నానుతూనే ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం మహిళలు కూడా ఇంటా, బయట ప్రతిక్షణం జాగురూకతతో ఉండాల్సిందే. చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనించాలి. మనుషుల స్వభావాలను, ఉద్దేశాలను, మాటలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అడుగులు వేయాలి. తేడా వొస్తే తిరగబడాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలి.