వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మునిసిపల్‌ ఎన్నికలకు రాజకీయ పార్టీల వ్యూహాలు

December 4, 2019

అస్త్రశస్త్రాలకు పదును
మునిసిపాలిటీ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. పాలకపక్షం, విపక్షాలు ఎన్నికల అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. స్థానికసంస్థల ఎన్నికల్లో 12785 గ్రామ పంచాయతీల్లో 9వేలకు పై చిలుకు గ్రామపంచాయతీలను, 33 జిల్లాపరిషత్తులను, 70 శాతం మండలాలను కైవసం చేసుకొని టీఆర్‌ఎస్‌ ‌విజయపరంపరలో ముందువరుసలో ఉంది. అయితే టీఆర్‌ఎస్‌ ‌కారుకు బ్రేకులు వేయాలనే ఎత్తుగడలతో ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలను అల్లుతున్నాయి. ఆర్‌టీసీ కార్మికులు 56 రోజులపాటు అవిశ్రాంతంగా, చావో రేవో తేల్చుకోవాలన్న తీవ్ర స్థాయిలో సమ్మె చేశారు. అయితే ప్రతిపక్షాల శిబిరంలో నుంచి ఆర్‌టీసీ కార్మికులను తన శిబిరంలోకి తెచ్చుకోవాలనే ఎత్తుగడతోనే ఆర్‌టీసీ కార్మికులను ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చి, బుజ్జగించి తాయిలాలు పంచారని బీజేపీ, కాంగ్రెస్‌, ‌తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపీఎం నాయుకులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో సీఎం కేసీఆర్‌ ‌ప్రతిష్ట చాలావరకు దిగజారిపోయిందని, ఆ ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకే ప్రగతిభవన్‌ ‌విందుభోజనమని బీజేపీ నాయుకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌డిసెంబర్‌ 1‌న ప్రగతిభవన్‌లో చేసిన ప్రకటనలను ఒక పదిహేనురోజుల ముందు చేసినా, పదిహేను ప్రాణాలు దక్కేవని బుధవారం ఎం.పి ఆర్వింద్‌ ‌లోకసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరుగుతున్న సంఘటలను బీజేపీ చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకపోగలుగుతున్నది. 2023 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న అంచనాలతో బీజేపీ పావులు కదుపుతున్నది. జాతీయస్థాయి నాయకులు ఇస్తున్న ఆదేశాలతో రాష్ట్ర నాయకులు కార్యాచరణను రూపొందించి ఆందోళనలను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సహజంగానే బీజేపీకి ప్రజల్లో కొంత సానుభూతి ఉన్నది. ఈ సానుభూతిని, నిరంతరం చేస్తున్న ఆందోళనలు బీజేపీకి కలిసివచ్చే అంశాలు. ఈ అంచనాలతోనే మెజార్టీ మునిసిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ సిద్ధమవుతున్నది. ఇక కాంగ్రెస్‌కు సంప్రదాయ వోట్లు కలిసి వొచ్చే అంశం. ప్రతీ ఎన్నికల్లో 15 శాతం కు వోట్లు కాంగ్రెస్‌కు పోల్‌ అవుతన్నాయి. అయితే పాలకపక్షంపై ప్రజలకు ఉండే వ్యతిరేకతను ఆసరా చేసుకొని మునిసిపాలిటీలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వోట్లు పడటంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో కొత్తఉత్సాహం పెరుగుతున్నది. ఆర్‌టీసీ సమ్మెతో పాటు దిశ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమ య్యింది. తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేదని జాతీయ స్థాయిలో సామాజిక సంస్థలన్నీ హోరెత్తించాయి. వాస్తవానికి రాజకీయ పార్టీలకన్నా, స్వచ్ఛందసంస్థలు, మహిళాసంస్థలు ఎక్కువగా ఆందోళనలు వ్యక్తం చేశాయి. సారాంశంలో తెలంగాణలోని భద్రత డొల్లతనాన్ని ఈ సంఘటన జాతీయ స్థాయిలో తెరమీదికి తెచ్చింది. ఈ సంఘటనలను వచ్చే మునిసిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ ప్రధాన అంశంగా చేసుకునే అవకాశం ఉంది. కాగా ‘కారు, సారు, పదహారు ’ నినాదంతో లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ ‌తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొద్దిగా శ్రమిస్తే మెజార్టీ మునిసిపాలిటీల్లో విజయం సాధించవచ్చునని బీజేపీ, కాంగ్రెస్‌ ‌వంటి రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. ఈ ఆలోచనలతోనే తమ శ్రేణులను కదిలిస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ ‌జిల్లాల్లో బలంగా ఉన్న సీపీఐ మునిసిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడుగానే కాక, నిరంతర హక్కుల పోరాట యోధుడుగా వాసికెక్కిన కొదండరాం మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలిచి తన వాదనలను బలంగా ప్రజల్లోకి తీసుకపోవాలనే ప్రయత్నంతో కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. అయితే మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 9వరకు పౌరుల నుంచి అభ్యంతరాలను తీసుకోనున్నారు. ఈ నెల 17న వార్డుల విభజన తుదినోటిఫికేషన్‌ ‌విడుదల చేస్తారు.ఈ పూర్వరంగాన్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి.