వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మౌనం వీడని ప్రభుత్వం..విధుల్లో చేరని సిబ్బంది

November 23, 2019

హైకోర్టు తీర్పుతో ఆర్టీసీ కార్మికుల సమ్మె అశనిపాతంగా మారింది. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన వీరికిప్పుడు దారులన్నీ మూసుకుపోయాయి. న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా వొస్తుందనుకున్న వారికి కార్మిక న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కార్మికులంతా డీలాపడిపోయారు. మీరంతా ముందు నడువండి, మీవెనుక మేమున్నామని నిన్నటివరకు వారిని వెన్నుతట్టి నడిపించిన రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నాయి. భూమి గుండ్రంగా ఉందన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్నే అర్థించాల్సి వొచ్చింది. ఇలాంటి సమయంలో షరతులు లేకుండా తమను తిరిగి విధుల్లో చేర్చుకోవాలన్న కార్మికుల షరతును ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. యాభై రోజులుగా కార్మికుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ, రెండు రోజుల కిందనే దాదాపు సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. కాని, ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన కనిపించక పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కొద్దిరోజులే సమ్మె చేసినప్పటికీ తమ డిమాండ్లలో కొన్నిటినైనా వారు సాధించు కోగలిగారు. కాని, ఆర్టీసి చరిత్రలోనే మొదటిసారిగా ఇంత సుదీర్ఘ కాలం సమ్మె చేసి కూడా ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా కార్మికులు సాధించుకోలేక పోయారు. పైగా ఈ సమ్మె మొదటికే ముప్పుతెచ్చిపెట్టేదిగా తయారైంది. కార్మికులు మొదటి నుండీ భయపడుతున్నట్లుగానే వారి ఉద్యోగాలకే ఎసరు వచ్చేట్లుగా కనిపిస్తున్నది. యాభై రోజుల సమ్మెగాని, సమ్మెపై హైకోర్టులో సుదీర్ఘంగా జరిగిన విచారణలోగాని ఏ ఒక్క సన్నివేశమూ కార్మికులకు అనుకూలం కాలేకపోయింది. ఇప్పుడు కేసు విచారణ కార్మిక న్యాయస్థానానికి చేరింది. ఇక్కడ కూడా విచారణ ఎంతకాలం సాగుతుందో తెలియని పరిస్థితి. సమ్మె ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఆరుగురు ఆర్టీసి కార్మికులు అకాల మరణమో, ఆత్మహత్య చేసుకోవడంతోనో మృత్యువాతపడ్డారు. మూడు నెలలుగా వేతనాలు లేక కార్మిక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుండడం లాంటి కారణాలతో సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించిన కార్మిక సంఘాల జేఏసి, అంతలోనే మనస్సు మార్చుకుని సమ్మెను ఇంకా కొనసాగిస్తున్నామంటూ మరో ప్రకటన చేయడంతో కార్మికుల పరిస్థితి అయోమయంలో పడింది. సమ్మె విరమించినట్లు ప్రకటించినా ప్రభుత్వం కార్మికులను విధుల్లో చేరేందుకు ఆహ్వానించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఏసీ చెబుతోంది. విధుల్లో చేరేందుకు ఆ సంస్థ డిపోల వద్దకు చేరుకున్న కార్మికులకు నిరాశే ఎదురైంది. వారిని విధుల్లోకి తీసుకోవాలన్న ఉత్తర్వులేవీ తమకు రాలేందుటు ఆర్టీసి అధికారులు తమ అశక్తతను తెలుపడమే ఇందుకు కారణం. రెండు రోజులుగా కార్మికులు డిపోల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభించడంతో కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అందుకు కార్మికులెవరూ ధైర్యాన్ని కోల్పోకుండా సమ్మెను కొనసాగించాలంటూ పిలుపునిచ్చిన జెఏసి సేవ్‌ ఆర్టీసి పేరున తిరిగి సమ్మెకు ఉపక్రమించింది. సమ్మె విరమిస్తున్న విషయాన్ని కార్మికులు ప్రకటించడం, ప్రభుత్వ ఆలోచనకు తగినట్లుగా 5100 రూట్లను ప్రైవేటీకరించే విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ మంతనాలు చేస్తున్నప్పటికీ, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందన్న మాట మాత్రం ఎక్కడా వినిపించడంలేదు. పైగా సమ్మెలో పాల్గొన్న దాదాపు నలభై ఎనిమిది వేల మంది కార్మికులు తిరిగి తమ ఉద్యోగాలను పొందుతారోలేదో కూడా తెలియని పరిస్థితి. ఒక వేళ తీసుకున్నా అందరినీ తీసుకుంటారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. కేసును ఇప్పుడు లేబర్‌ ‌కోర్టుకు బదిలీ చేయడంతో ఆ తీర్పు వొచ్చేవరకు వీరిని నివారిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. కాగా, తాను ఎంత నచ్చజెప్పినా సమ్మెబాట పట్టారన్న ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి షరతులు పెట్టకుండా తీసుకుంటాడని అనుకోలేము. మొదటి నుండీ యూనియన్‌ల మాయాజాలంలో పడకండని, రెచ్చకొడుతున్న ప్రతిపక్షాల మాటలను నమ్మి సమ్మెబాట పట్టవొద్దంటూ కార్మికులను హెచ్చరించిన సిఎం కెసిఆర్‌ ‌సమ్మెకాలానికి సంబంధించిన వేతనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆయోమయంలో కూడా కార్మికులున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ షరతులతో విధుల్లో చేరినవారికి మంచి ప్యాకేజీతో విఆర్‌ఎస్‌ ‌ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా వార్తలు వొస్తున్నాయి. ఒక పక్క ఆర్టీసీని కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే, సేవ్‌ ఆర్టీసి అన్న మరోనినాదంతో కార్మిక సంఘాలు ఇంకా సమ్మె కొనసాగింపుకే ముందుకు వెళుతున్నాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం కావడంతో, ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై ఎప్పుడు మౌనం వీడుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.