వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

యూరియా కోసం .. ఆగిన రైతు గుండె

September 5, 2019

-దుబ్బాకలో విషాదం
-క్యూలైన్‌లో గుండెపోటుతో మృతి…
-రైతుల ఆందోళన
-సిఎం కేసీఆర్‌ ఇలాఖాలోనూ తప్పని తిప్పలు..
-తూప్రాన్‌లో రోడ్డెక్కిన రైతులు, జగదేవ్‌పూర్‌లో యూరియా కోసం బారులు
-రూ.25లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: కాంగ్రెస్‌ ‌నేత కెవిఎన్‌ఆర్‌ ‌డిమాండ్‌

ఫోటో:దుబ్బాకలో యూరియా కొరకు రైతుల క్యూలైన్‌…( ‌క్యూలైన్‌లో ప్రాణాలు విడిచిన రైతు ఎల్లయ్య (పాత చిత్రం)

సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో విషాదం చోటుచేసుకుంది. యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణాల్ని బలితీసుకుంది. యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన రైతు  ఒకరు గుండెపోటుతో మృతిచెందాడు. యూరియా కొరకు గత మూడు రోజులుగా  క్యూలో నిలబడి రైతు ఎల్లయ్య ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. మృతుడు ఎల్లయ్య(69) అచ్చుమాయపల్లి వాసిగా గుర్తించారు. మృతి చెందిన రైతు ఎల్లయ్యకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కాగా,  ఎల్లయ్య మృతిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈఘటన గురువారం దుబ్బాకలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పిఏసిఎస్‌)‌వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపురం ఎల్లయ్య గత మూడ్రోజులుగా యూరియా కొరకు దుబ్బాకలోని పిఏసిఎస్‌ ‌వద్ద లైన్‌లో నిలుచుని ఉంటున్నాడు. రైతు ఎల్లయ్య యూరియా కొరకు క్యూలైన్‌లో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురాయ్యరు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్యూలైన్లో నిలుచున్న రైతు ఎల్లయ్య ఉన్నఫళంగా కుప్పకూలిపోవడంతో గ్రహించిన సహచర రైతులు ఎల్లయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైతు ఎల్లయ్య మృతి చెందినట్లు సంబంధిత వైద్యులు నిర్ధారించారు. యూరియా కొరకు గత మూడ్రోజులుగా దుబ్బాక పిఏసిఎస్‌ ‌వద్ద క్యూలైన్లో ఉండి…చివరకు క్యూలైన్‌లోనే ప్రాణాలొదిన రైతు ఎల్లయ్య కుటుంబానికి  న్యాయం చేయాలని, రైతు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇదిలా ఉంటే, సంఘటన స్థలానికి చేరుకుని దుబ్బాక పోలీసులు చేరుకుని ఎల్లయ్య దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే నిమిత్తం తరలించారు.  జరిగిన సంఘటనపై పూర్తిగా విచారణ జరుపుతున్నట్లు దుబ్బాక ఎస్‌ఐ ‌సుభాష్‌గౌడ్‌ ‌తెలిపారు.

యూరియా కొరకు తూప్రాన్‌లో రోడ్డెక్కిన రైతన్న…

రాష్ట్రంలో యూరియా కొరత లేదనీ, రైతులకు అవసరమైనంతగా యూరియాను అందుబాటులో ఉంచామనీ ఓ వైపున ప్రభుత్వం చెబుతున్నప్పటికీ…క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనీ చెప్పడానికి నిదర్శనమే దుబ్బాకలో రైతు ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందడం. ఇదిలా ఉంటే, యూరియా కొరకు సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని తూప్రాన్‌ ‌జాతీయ రహదారిపైన రైతులు గురువారం రోడ్డెక్కారు. రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి, ఆందోళన చేశారు. ఓ వైపు రైతులకు క్యూ లైన్‌ ‌లేకుండా ఇంటికే యూరియా బస్తాలు పంపిస్తామనీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ, ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో తాజా పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు రైతు మృతి, తూప్రాన్‌లో రైతుల ఆందోళనను చూస్తే ప్రత్యేకించి వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా రైతులకు కావల్సినంత యూరియాను అందుబాటులో ఉంచాలనీ రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లోనూ యూరియా కొరకు రైతులు బారులు తీరారు. జగదేవ్‌పూర్‌లోని హనుమాన్‌ ‌ఫర్టిలైజర్‌ ‌దుకాణం వద్ద రైతులు యూరియా కొరకు క్యూలైన్‌ ‌కట్టగా..ఒక్కోక్కరికి కేవలం 2 సంచులు మాత్రమే అందించడంతో చాలామంది రైతులకు యూరియా దొరకక వెనుదిరిగారు. యూరియా కొరకు తూప్రాన్‌లో రైతులు రోడ్డెక్కడం…జగదేవ్‌పూర్‌లో బారులు తీరడం చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోనూ యూరియా కొరకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రూ.25)క్షల నష్టపరిహారం ఇవ్వాలి : కాంగ్రెస్‌ ‌నేత కెవిఎన్‌ఆర్‌ ‌డిమాండు

రైతు ఎల్లయ్య ముమ్మాటికీ యూరియా కొరకు క్యూ లైన్‌లో ఉండే ప్రాణాలొదినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ దుబ్బాక నియోజకవర్గ నాయకుడు, పిసిసి ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ ‌నర్సింహారెడ్డి(కెవిఎన్‌ఆర్‌) ‌డిమాండు చేశారు. గురువారం దుబ్బాకలో రైతు ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వెంకట్‌ ‌నర్సింహారెడ్డి మాట్లాడుతూ…యూరియా కొరకు లైన్‌లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారనీ, యూరియ కొరకు గత మూడ్రోజులుగా రైతులు దుబ్బాకలో క్యూలైన్‌లో నిలబడుతున్నారనీ, ఈ క్యూలైన్‌లో ఉండగానే రైతు ఎల్లయ్య ఉన్నఫలంగా కుప్పకూలిపోయారనీ అన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో వచ్చిన ఈ ఆరేండ్లలో రైతుల గురించి ఆలోచించిన పాపానపోలేదన్నారు. రైతు రుణమాఫీ మాటలకే పరిమితమైందన్నారు. స్థానికంగా ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం ఫోటోలకు ఫోజులివ్వడానికే పరిమితమయ్యారనీ ఆరోపించారు. వెంటనే యూరియా కొరత లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. తనవంతుగా రైతు ఎల్లయ్య కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు వెంకట నర్సింహారెడ్డి తెలిపారు. ఆయన వెంట స్థానిక నేతలు ఆస ముత్యం, మచ్చ శ్రీనివాస్‌, ఇస్తారిగల్ల ఎల్లం, అందె రాజిరెడ్డి, కమలాకర్‌ ‌తదితరులు ఉన్నారు.