వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రక్తమోడుతున్న రహదారులు ..!

November 30, 2019

రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా యువకులు మృత్యుబారిన పడుతున్నారు. ట్రాఫిక్‌ ‌నిబంధనల ఉల్లంఘనల్లో మెజారిటీ విద్యావంతులే కావున కాలేజీల్లో, విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో కౌన్సిలింగ్‌లతో ప్రమాదాల తగ్గుదలకు పాటుపడాలి. ప్రజా ప్రతినిధుల వాహనాలు రోడ్లపై రాగానే ట్రాఫిక్‌ ‌పోలీసువారు, రక్షక భటులు, అనుయాయుల వాహనాలు ఎలాంటి ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటించకుండా మనదేశంలోని గరిష్ట వేగమైన 80 కి।।మీ।।లకు మించి వెళ్తున్నది నిజం కాదా ! వారిని పంపుతున్న వివిధ శాఖలకు నిబంధనలు వర్తించవా !

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను నిర్మిస్తున్నప్పటికీ అంతే స్థాయిలో సాంకేతికంగా మోటారు వాహనాల యంత్రాలు, సి.సి.లు పెంచుకొని భద్రతా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కంపెనీలు చెప్పుతున్నప్పటికీ అంతకంతకు రహదారులపై ప్రమాద• ఘంటికలు పెట్రేగి రోడ్లపై వాహనాలు నడిపే మనుషులు సుఖమయ ప్రయాణం చేయలేక  కష్టాలపాలవుచున్నారు.
రోడ్డు రవాణా వ్యవస్థీకృతలోపమో, మన తప్పిదమో, విధి వైపరీత్య శాపమో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి. బాధితుల శోకం అక్షరీకరించలేనిదై అనాథలు, విగతజీవులై బతుకులు నరకంగా మారుతున్నాయి. ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై కష్టంగా బతుకులు నెట్టుకొస్తున్నారు. దీనికంతటికి ప్రధాన కారణం తగినంత రవాణా సదుపాయాలు లేకపోవడం, నిబంధనలు పాటించక పోవడం, రోడ్డు ప్రమాదాలు అరికట్టాల్సిన విభాగాలు నిర్లక్ష్యానికి తోడౌతున్నాయి. నాణ్యత తగ్గి గుంతలమయమైన రహదారులు, వాటిపై కనిపించని సూచనల బోర్డులు, ఉన్నా పట్టించుకోని వాహనదారులు మరియు మద్యపానం సేవించి వాహనాలను నడపడం వలన జరుగుతున్నట్లు తెలుస్తుంది. మనస్సులను కలిచివేసే హృదయ విదారక ప్రమాద ఘటనలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా అడ్డూ అదుపు లేకుండా అతివేగంగా ట్రాఫిక్‌ ‌నిబంధనలను తుంగలోతొక్కి పలువురు ప్రయాణికులు, వాహనదారులు వ్యవహరించడం మూలంగా రోడ్డు ప్రమాదాలు, దుర్మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో నమోదైన రోడ్డు ప్రమాదాలు వరుసగా 2017 లో 22,811 ప్రమాదాలు జరుగగా, 7,219 మంది మృతిచెందారు. 24,217 మంది క్షతగాత్రులైనారు. 2018లో 22,484 ప్రమాదాలు జరుగగా అందులో 6,596 మంది మృతి చెందినారు. 24,017 మంది క్షతగాత్రులైనారు. 2019లో ప్రమాదాలు 11,302 జరుగగా అందులో మృతులు 5,024 కాగా, 11,715 క్షతగాత్రులైనారు. ప్రతి 86 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా దేశవ్యాప్తంగా 4,80,652 ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ 2016లో ఇచ్చిన నివేదిక చెప్పింది. ఈ ప్రమాదాలలో 68% మితిమీరిన వేగం వల్లేనని తెలిసింది. ఈ మరణాల్లో మన తెలంగాణ రాష్ట్ర వాటా 5,000లకు పైగానే ఉంది. ఇలా ట్రాఫిక్‌ ‌నిబంధనలను ఉల్లంఘించడం, అతి వేగం కారణాల వల్ల రోజుకు 16 మంది మృత్యువాత పడుతున్నారు.

మన దేశంలో గాని, రాష్ట్రంలో గాని మద్యాన్ని అందుబాటులో ఉంచడం పాలకులు చేస్తున్న తప్పిదం కాదా! ప్రభుత్వాలకు ప్రధానంగా ఆదాయం మద్యం ద్వారానే వస్తుంది నిజం కాదా ! రాష్ట్రంలోని హైవేలకు ఇరువైపులా మద్యం షాపులు స్వాగతం చెపుతుంటే ? రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అనేది తెలియందా…. ట్రాఫిక్‌ ‌నియంత్రణ, అబ్కారి, ఆర్‌టిఓ, పోలీస్‌ ‌శాఖల మధ్య సమన్వయం ఏర్పరిచి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు పూనుకోవాలి. వాహనదారులు ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలి. పౌరులుగా మనం స్వీయనియంత్రణ చేసుకుంటూ ప్రయాణించాలనే కనీస బాధ్యతలను మరువరాదు. మనుషులుగా మానవత్వాన్ని ప్రదర్శించాలి కానీ, మరణాలను కొని తెచ్చుకోరాదు. ప్రయాణ సమయంలో వేగం కన్నా నిదానంగా గమ్యాన్ని క్షేమంగా చేరుకోవాలి. మనదేశంలో ఉన్న రోడ్ల పరిస్థితుల ఆధారంగా ఏ వాహనానికైనా గరిష్టంగా వేగ పరిమితి కేవలం 80 కి.మీ. మాత్రమే, అంతకు మించి వెళ్లరాదు. కాని ఇక్కడ కార్లు ఇతర వాహనాలు 120 కి.మీ.లు దాటిన వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. మరియు ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్లు ధరించాలి. కార్లు, జీపుల్లో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవాలి. భారీ వాహనాలతో సుదీర్ఘప్రయాణం చేసే డ్రైవర్లు తగినంత నిద్ర ఉండేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. మొన్న గచ్చిబౌలి మైండ్‌ ‌స్పేస్‌ ‌వద్ద జరిగిన ప్రమాదంలో కారు ప్లైఓవర్‌ ‌పైనుంచి పడేందుకు ప్రాథ•మిక కారణం మితిమీరిన వేగం ఒకటైతే, ఫ్లైఓవర్‌నిర్మాణంలో డిజైన్‌ ‌లోపమని భావిస్తున్నారు. తెల్లారి హైదరాబాద్‌ ‌సిటీలో ఒక్కరోజే ఐదు ప్రమాదాలలో ముగ్గురి మరణం చెందినారు మరియు ముగ్గురు క్షతగాత్రులైనారు.

గత ఏడాది కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో ఏకంగా 63 మంది మృతిచెందారు. ఏదైనా దుర్ఘటన జరుగగానే అధికారులు కొంత హడావిడిచేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ఆటోలు, ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు వివిధ రకాల వాహనాలు, గూడ్సు వస్తు రవాణాకు వాడే వాహనాలతో ప్రజలను తరలించడం జరుగుతుంది. మనషులను తరలించే వాహనాలు నిబంధనలను అతిక్రమించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణిస్తున్నాయి. గతంలో అనేకమార్లు ప్రమాదాలు సంభవించిన సంఘటనల నుండి అప్రమత్తతను ఆచరణలో చూపడం లేదు. రహదారిపై ప్రయాణించే రెండు ఎదురెదురుగా వొచ్చే వాహనా దారులు ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరుగవు. గమ్యాలకు క్షేమంగా చేరుకోగలమనే వాస్తవాన్ని మరువరాదు. ‘‘చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్టు’’ గా కాకుండా రోడ్డు ప్రయాణాల్లో, ప్రమాదాలు జరగకుండా వాహనదారుల స్వీయనియంత్రణ ఎంతో అవసరం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ శాఖలు కఠినంగా వ్యవహరించాలి. ఈ మధ్యకాలంలో పోలీసు శాఖవారు డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ను అరికట్టడం వల్ల కొంత మెరుగైనప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాము.
రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా యువకులు మృత్యుబారిన పడుతున్నారు. ట్రాఫిక్‌ ‌నిబంధనల ఉల్లంఘనల్లో మెజారిటీ విద్యావంతులే కావున కాలేజీల్లో, విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో కౌన్సిలింగ్‌లతో ప్రమాదాల తగ్గుదలకు పాటుపడాలి. ప్రజా ప్రతినిధుల వాహనాలు రోడ్లపై రాగానే ట్రాఫిక్‌ ‌పోలీసువారు, రక్షక భటులు, అనుయాయుల వాహనాలు ఎలాంటి ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటించకుండా మనదేశంలోని గరిష్ట వేగమైన 80 కి।।మీ।।లకు మించి వెళ్తున్నది నిజం కాదా ! వారిని పంపుతున్న వివిధ శాఖలకు నిబంధనలు వర్తించవా ! ఇలా ప్రజా ప్రతినిధుల వాహనాలు అతివేగంగా దూసుకెళుతుంటే ప్రయాణదారులు చోద్యం చూస్తూ వారు వెళ్లేదాకా ఆగాల్సివస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనే నిబంధనలు వీరికి అతీతం ఎలా అవుతుంది.

మాన్యుడైనా, సామాన్యుడైనా ట్రాఫిక్‌ ‌నిబంధనలు పాటిస్తూ నియమిత వేగంతో ప్రయాణిస్తూ ఇతరుల ప్రాణాలకు హాని జరగకుండా చూడాలి. రోడ్డు ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోవాలని ఎవరూ అనుకోరు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారి వల్ల అనేక కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోవుచున్నాయి. రహదారుల నాణ్యత కూడా రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుచున్నాయి. నాణ్యతలోపించిన రహదారులకు వెంటనే పునర్నిర్మాణం చేయాలి. చిన్న చిన్న ప్యాచ్‌ ‌వర్క్‌లను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన రాత్రి వేళల్లో కనిపించక చాలా ప్రమాదాలు జరుగుచున్నవి. రోడ్డు నిర్మాణ(గుత్తే)దారులు ధనదాహానికి తోడు ఇంజనీరింగ్‌ ‌శాఖ నిర్లక్ష్యం వలన రోడ్డు నాణ్యతలోపించి ప్రమాదాలు పెరిగిపోవుచున్నాయి. రోడ్డు పైకెక్కిన ప్రయాణ వాహనదారుల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందంటే ? అంబులెన్సు వస్తుంటే దారి ఇవ్వలేని అమానవీయతతో కాలం వెళ్ళదీస్తున్నారు. అదే మంత్రులు, ప్రజాపతినిధులు రోడ్డు మార్గాన వెళ్లేలా దారులను (క్లియర్‌) అడ్డు తొలగిస్తున్న విధానం ఏ విలువలకు పట్టం కడుతున్నట్లు భావించాలి. అంబులెన్స్‌ల్లో కొన ఊపిరితో కొట్టుకుంటున్న విగత జీవికన్నా వీరి ప్రయాణం మిన్నా… ప్రయాణదారులంతా క్షేమంగా గమ్యాన్ని చేరే, చేర్చే పరిస్థితులను సంఘటితంగా, సంబంధిత శాఖల సమన్వయంతో సాధించుకుందాం… మానవాళి జీవన ప్రమాణాన్ని పెంచుకుందాం…
– మేకిరి దామోదర్‌
‌వరంగల్‌, ‌సెల్‌: 9573666650