వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాజ్యాంగం పవిత్ర గ్రంథం

November 26, 2019

ఫోటో:రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ.
ఫోటో:రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోడీ.

కోట్లమంది కలిసి ఉండడానికి కారణం
పార్లమెంట్‌ ఉభయసభల ప్రత్యేక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ
మాతృభాషను గౌరవించాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
గైర్హాజరుతో విపక్షాల నిరసన

రాజ్యాంగమే మన పవిత్ర గంథమని, కోట్ల మంది భారతీయులు కలిసి మెలిసి ఉండటానికి డా. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌రచించిన రాజ్యాంగమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం భారత దేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 70ఏళ్లు నిండిన సందర్భంగా పార్లమెంట్‌లో ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోకసభ స్పీకర్‌ ఓం ‌బిర్లా సహా కేంద్ర మంత్రులు, ఉభయ సభల సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ జ్ఞానానికి మహా కేంద్రంగా పార్లమెంట్‌ ‌విలసిల్లుతోందన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది పార్లమెంట్‌లో చరిత్రాత్మక దినమన్నారు. మన రాజ్యాంగమే మనకు పవిత్ర గ్రంథమన్నారు. ఆ గ్రంథమే మన జీవితాలను, మన సమాజాన్ని, మన సాంప్రదాయాలను, నమ్మకాలను ప్రస్పుటిస్తుందన్నారు. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను కూడా ఆ గ్రంథం పరిష్కరిస్తుందన్నారు. రాజ్యాంగంలో పౌరుల హక్కులు, బాధ్యతలు ఉంటాయని, ఇదే మన రాజ్యాంగ విశిష్టత అని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన బాధ్యతలను మనం ఎలా నెరవేర్చాలన్నదానిపై దృష్టిపెట్టాలన్నారు. మన బాధ్యతలను సంపూర్ణంగా, సక్రమంగా నిర్వర్తించడమే మన హక్కు అని గాంధీజీ అన్నట్లు మోదీ గుర్తు చేశారు. ప్రపంచం అంతా హక్కుల గురించి మాట్లాడుతుంటే, గాంధీజీ మాత్రం ఓ అడుగు ముందుకేసి పౌరుల బాధ్యతలను గుర్తుచేశారని అన్నారు. ఈ సందర్భంగా 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడిలో చనిపోయినవారికి ప్రధాని మోదీ తన ప్రసంగంలో నివాళి అర్పించారు.
మాతృభాషను ప్రతిఒక్కరూ గౌరవించాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అమ్మ భాష కళ్లలాంటిదని.. ఇతర భాషలు కళ్లజోడులాంటివని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పార్లమెంటులో తెలుగులో వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ మాతృభాషను గౌరవించాలని..దాని పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత మాతృభాష, తరవాత ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన పార్లమెంటులో జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడారు. అలాగే రాజ్యాంగ విశిష్టతను వివరించారు. అససరానికి అనుగుణంగా మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని పదిలపరచుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 103సార్లు సవరించిన విషయాన్ని గుర్తుచేశారు. సుదీర్ఘ మథనం ద్వారా అంబేడ్కర్‌ ‌రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారన్నారు. మన రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా ఉండాలని అంబేడ్కర్‌ ఆశించారన్నారు. పరిపాలనలోనూ అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. మన పనులు, జీవితంలో సృజనాత్మకత భాగంగా ఉండాలని వెంకయ్య సూచించారు.
విపక్షాలు దూరంగా..
కాగా.. పార్లమెంట్‌లో జరుగుతున్న రాజ్యాంగ దినోత్సవానికి విపక్షాలు దూరంగా ఉన్నాయి. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా నిరసనకు దిగాయి. ’రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అని ప్లకార్డులు చేతబట్టి పార్లమెంట్‌ ‌ప్రాంగణంలోని అంబేడ్కర్‌ ‌విగ్రహం ముందు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యాంగాన్ని చదువుతూ నిరసన వ్యక్తం చేశారు.