వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రాజ్యాంగస్ఫూర్తిని మరిచిపోవద్దు

November 25, 2019

స్వతంత్ర భారత పురోగమనం అనేక దేశాలలోని విముక్తి ఉద్యమాల కు ప్రేరణ,స్పూర్తి. ఈ దేశ స్వరాజ్యం బ్రిటిష్‌ ‌వారు ఇచ్చిన భిక్ష కాదు.అది భారత ప్రజల పోరాటాలతో వేలాదిమంది త్యాగాలతో దక్కిన ఆకాంక్ష. ఇక్కడి రాజ్యాంగ సభ సుదీర్ఘ చర్చల అనంతరం గత కాలపు జీవిత అనుభవాలను,వర్తమానపు ఆకాంక్ష లను,భవిష్యత్‌ ‌కాలపు మార్గ నిర్థేశనాలను మిళితం చేసుకొని విభిన్న సాంస్కృతిక వారసత్వాలకు ఏకత్వంగా ఉధ్బవించిన సంవిధానం భారత రాజ్యాంగం. రాజకీయ, సామాజిక ప్రజాస్వామ్యం కలిసి నడవాలన్నదే రాజ్యాంగ లక్ష్యమని భారత రాజ్యాంగ పిత డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌ప్రకటించారు.ఆ వైపుగా పాలకులు,పాలితులు కూడా నడవాలనేది భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యం.ఇదే దారిలో న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి ని కాపాడుకుంటూ రాజ్యాంగ కాపలాదారునిగా వుండాలని పత్రికా స్వాతంత్య్రం,వ్యక్తి స్వాతంత్య్రం అత్యున్నతంగా భావించి వాటికి రాజ్యాంగ రక్షణ కల్పించారు భారత రాజ్యాంగ నిర్మాతలు.సాంఘికంగా వ్యక్తుల మధ్య,పరిపాలనపరంగా పాలకులలో నియంతృత్వ ధోరణులను తొలగించాలని రాజ్యంగం లక్ష్యం గా పెట్టుకుంది.భారత సమాజం యొక్క నిర్మాణాత్మక దృక్పథంతో ఘననీయంగా కలిగిన మార్పులకు 70 ఏండ్ల రాజ్యాంగం సాక్షి గా నిలబడింది.అఖండ భారతావని కొరకు కొన్ని అవిచ్చినకర శక్తులు ఈ దేశ లౌకిక ఐక్యతను చెదరగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికి భారత రాజ్యాంగ విలువల ముందు అవి ఏమి నెరవేరలేదు.ఈ దేశ రాజ్యంగం ప్రసాదించిన హక్కులు భాధ్యతల పట్ల సామాన్యుడు సైతం అవగాహన కలిగివుండడమనేది రాజ్యాంగ వ్యవస్థ సాధించిన ఒక ప్రగతి. సామాన్యులు సైతం జాతీయ నిర్మాణం లో తమ పాత్ర గురించి, తమ ఓటు హక్కు విశిష్టత ను తెలుసుకొనే స్థాయికి రావడమనేది ఒక రకమైన ప్రజాస్వామిక చైతన్యం.70 ఏండ్ల కాలంలో దేశం ఆర్థికంగా ,పారిశ్రామికంగా, అభివృద్ధి వైపు అడుగులు వేసిందనేది కొంతమంది నాయకుల వాదన.అభివృద్ధి జరిగిందనేది కొంత మేరకు వాస్తవమే కావొచ్చు.కాని ఎంత మేరకు రాజ్యంగ విలువలకు,రాజ్యంగ లక్ష్యాలకు,ఆశయాలకు ప్రాముఖ్యతనిచ్చిందనేదే ప్రశ్న.వీరు చెప్పే అభివృద్ధి ద్వారా సామాన్యుల జీవితాలలో ఏమైనా మార్పులు వచ్చాయా..! సంపన్న వర్గాలకు,సామాన్యులకు మధ్య అసమానతలు తొలగిపోయాయా..! రాజ్యంగ ప్రవేశికలోని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ సంపూర్ణంగా అమలవుతుందా..! అనేది నేటి పౌరసమాజం ,చైతన్య వంతమైన ప్రజానీకం అలోచించాల్సి వున్నది. ఈ దేశ అత్యున్నత శాసన వ్యవస్థ రుపొందించిన శాసనాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, రాజ్యంగాన్ని రక్షిస్తామని ప్రమాణం చేసిన పాలకులు దళితుల ఆత్మగౌరవం కోసం రూపొందించిన చట్టాలు పాలకులు అమలుచేయకపోవడంలో దేనికి సంకేతం.?వారి పై జరుగుతున్న దాడులకు బాధ్యులు ఎవరు..? అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసులను నిరాశ్రయతకు గురి చేయడంలో ఎవరి ప్రయోజనాలు దాగి వున్నాయి.? ఆటవీ చట్టాలను నీరుగార్చడం,మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు తొక్కిపెట్టడంలో రాజ్యంగ విలువలకు గౌరవం ఎక్కడ.? మహిళల పై అత్యాచారాలు,మైనార్టీ ల పై దాడులు,సమాఖ్య వ్యవస్థ పై దాడి,రాష్ట్రాల హక్కులను దిగజార్చడం,దేశమంతా హిందిని రుద్దాలనుకోవడం భారత రాజ్యాంగ ఆశయమా..! రాజ్యంగాన్ని సమీక్షించుకోవాలనే శక్తులు వున్న రాజకీయ వ్యవస్థ లో రిజర్వేషన్ల వ్యవస్థ తొలగించుకోవాలనే కుటిల యత్నాలు, పార్లమెంట్‌ ‌వ్యవస్థ ను నీరుగార్చి అధ్యక్ష తరహా పాలన కోసం తహతహలాడటం,మతసామరస్యం బదులు ఏకస్వామ్యం ,ఏకమతాధిపత్యం ఉండాలనే భావన పుట్టడం ఏడుపదుల భారత గణతంత్ర జీవనానికి తూట్లు పొడవడం కాదా.! ఇంకొక వైపు ఆర్డినెన్స్ ‌రూపంలో అడ్డదారులలో అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చి ప్రశ్నించే గొంతుకల పై ప్రయోగించి ప్రజా చట్టాలనడం ప్రజాస్వామిక ఆకాంక్ష లకు విరుద్దం కాదా..! పాలకుల స్వార్థపూరిత అలోచనలను చట్టాలకు అన్వయించడం ప్రజాస్వామిక ఆలోచనలు ఎట్లా అవుతాయనేవే పౌర సమాజం వాదన..శాసన వ్యవస్థ చేసిన శాసనాలపై సమీక్ష చేయాల్సిన న్యాయవ్యవస్థ మౌనం వహించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదానికి గురికాబోతుందనే అనుమానం ప్రజలలో రేకేత్తుతుంది.
70 ఏండ్ల గణతంత్ర భారతావనిలో కండ్లముందరి మానని గాయాలకు,మానవీయ ప్రజాస్వామ్య కోణంలో చికిత్స చేయాల్సి వుంది.ఈ వైపుగా ప్రజాస్వామికవాదుల నిరంతర జాగరత అవసరం.లేనట్లయితే ఆశించిన రాజ్యాంగ ఆకాంక్షలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి వుంది.భారత రాజ్యాంగ విలువలను,రాజ్యాంగం స్ఫూర్తిని ప్రజల ఆకాంక్షల ఆశయాల వెలుగులో అమలుపర్చడమే రాజ్యాంగ రూపకర్తల లక్ష్యం. ఆ తోవలోనే రాజ్యాంగ పరిరక్షణ కోసం సకలజనులు సబ్బండ వర్గాలు భాగస్వాములు కావాలనేదే తెలంగాణ విద్యావంతుల వేదిక అలోచన.రాజ్యాంగ రూపు ఒక విజయం,దాని అమలుపర్చుకోవడం మరో ఉదయం కోసమంటూ రాజ్యంగ పరిరక్షణ పట్ల నిరంతర అప్రమత్తత,అమలు భాధ్యత, ప్రజలదేనని తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తున్నది..
పి. సైదులు, బి.హరికృష్ణ
తెలంగాణ విద్యావంతుల వేదిక