వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

రైట్‌ … ‌రైట్‌ ‌విధుల్లోకి చేరుతాం!

November 25, 2019

సమ్మె విరమణను ప్రకటించిన ఆర్టీసీ జెఎసి.. నేటి నుంచి పనులకు వెళ్ళాలని కార్మికులకు పిలుపుఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. హైకోర్టులో ఊరట దక్కక పోవడం, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మె విరమణ అనివార్యంగా మారింది. దీంతో మంగళవారం నుంచి కార్మికులందరూ డ్యూటీలకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఇదే విషయమై సోమవారం డియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి కనీసం స్పందన రాలేదని అన్నారు. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించిందన్నారు. ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అధికారులు కొంతమంది ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంద న్నారు. దానిని అడ్డుకోవాలన్నారు. సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వ గెలవలేదని పేర్కొన్నారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం లేబర్‌ ‌కోర్డుకు వెళ్లాల్సి ఉందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులందరూ విధులకు హాజరవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు. సెకండ్‌ ‌షిప్ట్ ‌వాళ్లు కూడా విధులకు రావాలన్నారు. ఇన్ని రోజులు బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి డ్యూటీలకు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెను విరమిస్తున్నామన్న ఆయన.. ప్రైవేట్‌ ‌కార్మికులు విధుల నుంచి వెళ్లిపోవాలని కోరారు. ప్రభుత్వం బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం.. అలా కాని పక్షంలో మళ్ళీ తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. సమ్మె కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందుకు చింతిస్తున్నామని అన్నారు.కేవలం ఆర్టీసీని కాపాడుకోవడం కోసమే కోర్టు ద నమ్మకం ఉంచి.. సమ్మెను విరమిస్తున్నామన్నారు. అయితే గవర్నర్‌ ‌తమిళసైతో భేటీ అయిన కేసీఆర్‌.. ఆర్టీసీ సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. తమ సమ్మెపై ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. మంగళవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తుందా? సమ్మె విరమించిన కార్మికులను ఆర్టీసీ విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. గతంలో ఇకపై సమ్మె చెయ్యబోమనే రాతపూర్వక హాతో కార్మికులందరూ విధులకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రెండుసార్లు ఆఫర్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆఫర్‌ను నేతలు, కార్మికులు బేఖాతరు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను కాదని, ఇప్పుడు విధులకు హాజరవుతామంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమే. కొద్దిరోజుల క్రితమే కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధులకు హాజరయ్యేందుకు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల వద్ద బారులు తీరారు. అయితే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలు తమకు రాలేదని డిపో మేనేజర్లు కార్మికులను తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో పూర్తిగా సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందా? ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.