వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వాడిగా వేడిగా…

November 18, 2019

విపక్షాల నినాదాల మధ్య..
లోక్‌సభ సమావేశాలు
370 పై కాంగ్రెస్‌ ‌వాయిదా తీర్మానం

సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. డిసెంబర్‌ 23 ‌వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు అటు అధికార బీజేపీ ఇటు ప్రతి పక్షాలకు అనేక బిల్లులకు సంబంధించిన అంశాలపై మాటల యుద్ధం జరగనుంది. ఇక పని దినాలు మినహాయిస్తే మొత్తం 23 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ సారి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, కశ్మీర్‌ ‌తదితర అంశాలను పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లేవనేత్తనున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లో 35 బిల్లులను పెట్టిన కేంద్ర ప్రభుత్వం,అత్యంత కీలక బిల్లు అయినా పౌరసత్వ బిల్లును లోక్‌ ‌సభలో, ఇటు రాజ్యసభలోనూ ఆమోదించుకోవాలని చూస్తున్న కేంద్రం దానికై అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. అదేవిధంగా ఆదాయ పన్ను చట్టం, ఈ సిగరెట్ల విధానాన్ని రద్దు చేస్తూ సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌తీసుకువచ్చింది. వాటికి చట్ట రూపం తీసుకొచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లోనే చేయనున్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో అత్యంత కీలక బిల్లులైన త్రిపుల్‌ ‌తలాక్‌, ‌కశ్మీరు స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 ‌రద్దు బిల్లులను పార్లమెంట్‌లో పాస్‌ ‌చేసిన కేంద్ర ప్రభుత్వం అదే వూపులో ఈ సారి కూడా వ్యవహరించాలని చూస్తోంది.
విపక్షాల నినాదాల మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. అదేవిధంగా మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటపై శివసేన సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫరూక్‌ అబ్దుల్లా విడుదలకు సంబంధించి టీఎంసీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోక్‌సభలో విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. పలు అంశాలపై చర్చకు పట్టబట్టాయి. విపక్షాల నినాదాల మధ్యే స్పీకర్‌ ఓం ‌బిర్లా సభను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం‌బిర్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు రాజ్యసభలో ఇటీవల మృతి చెందిన పార్లమెంటు సభ్యులకు సంతాపం తెలిపారు. అరుణ్‌ ‌జైట్లీ, జగన్నాథ్‌ ‌మిశ్రా, సుష్మా స్వరాజ్‌ ‌సహా ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. ఇదిలాఉంటే ప్రశ్నోత్తరాల నుంచి శివసేన సభ్యుల వాకౌట్‌ ‌చేశారు.