వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విపత్తులో విద్యాభారతం

September 4, 2019

నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌జయంతి – ఉపాధ్యాయ దినోత్సవం

హెచ్‌.‌సి.యు., జె,ఎన్‌.‌యు., బి.హెచ్‌.‌యు., ఐ.ఐ.టి. మద్రాస్‌, ‌ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్‌ ‌వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రజాస్వామ్య సంస్కృతిని ధ్వసం చేస్తూ, భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తున్నది. .  ప్రజాతంత్ర విద్యావ్యవస్థ మనుగడకు కావల్సిన ఉద్దీపనలు లేవు.  ఉమ్మడి విద్యావ్యవస్థ అమలు పై కనీస ప్రస్తావనే లేదు.  విద్యను వ్యాపారం చేయడం, ప్రైవేటీకరణ, కాషాయికరణ చేయడం కోసం సంఘ్‌పరివార్‌ అజెండాను రాకెట్‌ ‌వేగంతో అమలు చేస్తున్నది.  విద్యా వ్యవస్థ వైఫల్యంతో సామాజిక విలువలు పతనమవ్వడం, పారిశ్రామిక వ్యవసాయ రంగాలు కుదేలు అవుతున్న స్థితి కనిపిస్తుంది. 

బోధన అత్యుత్తమ కళల్లో ఒకటి.  ఈ కళ ద్వారా ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రాణి ఐన మానవుణ్ణి తీర్చిదిద్దుతాడు.  మనషులు మనస్సుల్ని మొదట ఆర్థ్రపరచి, ప్రకృతి స్పర్శకు, సామాజిక గమనసూత్రాలకు స్పందించేలా కృషి చేస్తాడు.  మేథోపటిమతో పాఠ్యంశాల పట్ల ప్రేమతో జ్ఞాన తృష్ణతో తమ చేతుల్లో విద్యార్థులు ఉదయభాస్కరుని వలె వికసించాలనే తపనను ఉపాధ్యాయుడు కలిగి ఉంటాడు. ఈ వెలుగులో అవిద్య, అజ్ఞానముల నుండి భారతీయ సమాజాన్ని విద్యావెలుగుల వైపు మళ్ళింపచేయడంలో దిక్సూచిగా పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులలో అగ్రగణ్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ‌దేశంలో విద్వేషం, హింస, మూఢత్వంతో బందీ అయిన నేపథ్యంలో నైతిక విలువల ప్రాతిపదికగా శాంతి స్థాపనకు విద్య చోదక శక్తిగా పనిచేస్తుందని నమ్మి ఆ మార్గంలో దారి దీపంగా పనిచేశారు. సమకాలిన ప్రపంచంలో గొప్ప తాత్వికునిగా రచయితగా స్ఫూర్తిదాయక బోధకుడిగా అలుపెరుగని ఆచార్యునిగా బహుళ రంగాలలో మానవీయ విలువల కోసం పనిచేశారు.
తత్వశాస్త్రం పట్ల అపారతృష్ణ కలిగిన సర్వేపల్లి ప్రాక్‌, ‌పశ్చిమ దర్శనాలను విసృత్త అధ్యయనం చేసి వాటిని సమకాలిన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యానించారు. తన జీవితంలో అనేక ఉన్నత స్థాయి పదవులు నిర్వహించి భారత ప్రథమ పౌరునిగా ఉన్నా కూడా తనను తాను ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు.  జీవితాంతం వసుధైక కుటుంబం భావనను నిర్విరామంగా ప్రచారం చేశారు.  అనేక దర్శనాలను, మతాలను, విలువలను తులనాత్మకంగా అధ్యయనం చేసి, ప్రావీణ్యం సంపాదించారు.  తన వసుదైక కుటుంబం స్థాపనకు విద్య, సైన్స్, ‌ప్రజాస్వామ్యం, అంతర్జాతీయతలను సాధనాలుగా ఉపకరిస్తాయని భావించి వాటిని ప్రజలలో తీసుకెళ్ళడానికి అంకిత భావంతో పనిచేశారు.  మద్రాస్‌, ‌మైసూర్‌, ‌కలకత్తా మరియు ఆక్స్‌ఫర్డ్ ‌విద్యాలయాల్లో అధ్యాపకుడుగా, బనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు.  ఈ క్రమంలో భారతీయ విద్యావ్యవస్థ పటిష్టతకై తపించాడు. అంతర్జాతీయ విద్యా ధోరణులకు అనుగుణంగా భారత్‌ ‌విద్యారంగం లేదని గ్రహించాడు.  విద్యను ప్రజాస్వామీకరించడంతో పాటు మరింత లోతుగా నాణ్యముగా అందించాలని భావించాడు.  విద్య నైపుణ్యాలు లక్ష్యరహితంగా, గమ్యరహితంగా ఉంటే మానవ జీవితం నిస్సారం అవుతుంది. ప్రేరణ, లక్ష్యాలు లేని విద్య సాంస్కృతిక విలువల్ని హరింపచేస్తుంది. సాంస్కృతిక సాగు స్వభావాన్ని విద్య సంతరించుకున్నపుడే విద్యార్థులు అంకిత భావంతో జాతి నిర్మాణంలో పాల్గొంటారని సూత్రీకరించారు. శారీరక శ్రమ నుండి మానసిక శ్రమను వేరు చేయడం సరికాదు, విద్యను శ్రమతో జోడించాలని, విద్య వివేకాన్ని, మంచి చెడులను గుర్తించే విచక్షణ, సమత్యులతను ఇచ్చేదిగా ఉండాలని అన్నారు.  ఆధునిక సమాజంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, శాస్త్రసాంకేతిక, సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకొని, తమ ఆసక్తులకు అనువైన కోర్సులను ఎంచుకోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చేవారు. పరిశోధన ఫలితాల, ప్రమాణాల, ఆధారాల, శకలాల ప్రవాహంతో జ్ఞానం నిర్మితం అవుతుందని అది ఖచ్ఛితంగా విజ్ఞతను, విచక్షనణను కల్గిస్తుందన్నారు. వీటి సాధనకు మానవ జాతి సమిష్టి సంపదకు నిక్షేపాలు, చైతన్యానికి అక్షర రూపాలైన పుస్తకాలను అధ్యయనం, ఆచరణలో నిమగ్నమైన ఉపాధ్యాయులతో సంభాషణ సహచర్యం అలవర్చుకోవాలని సూచించారు.

భారత్‌కు ఉన్న ఆధ్యాత్మిక వారసత్వం పట్ల మహాదానందం వ్యక్తం చేస్తూనే, అదే సమయంలో అంధ విశ్వాసాలకు, బలహీనతలకు బందీ కావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.  మానవ వనరులు, గొప్ప సంప్రదాయాలు, పుష్కల ప్రకృతి వనరులు ఉన్నప్పటికీ మన దేశం  జీవన ప్రమాణాలల్లో దారుణంగా వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేసేవారు.  72 యేండ్ల తరువాత కూడా సర్వేపల్లి ఆవేదన ఇంకా అంతే ప్రాసంగికతను కలిగి ఉంది.  యునెస్కో 2018 విద్యా సూచికలో 168వ స్థానం, యు.యన్‌.‌డి.పి. మానవాభివృద్ధి 2018 సూచికలో 130వ స్థానం మన దేశపు విద్యారంగ సంక్షోభాన్ని తెలియజేస్తున్నాయి.
నిత్య జీవిత అనుభవాలు, పరిశీలనలను వైజ్ఞానిక దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. ఇది మేథో సమర్థతను, నైతిక నిబద్ధతను సానుకూల ఉద్వేగాలను కలిగిస్తూ పక్షపాత దృష్టిని త్యజించడానికి తోడ్పడి, లక్ష్ష్యాల సాధనకు ఉపకరిస్తుందని తెలియచేశారు.  సైన్స్‌ను మానవ సంక్షేమం కోసం, మతాన్ని మానవత్వం కోసం ఉపయోగించాలి, సర్వ శాస్త్ర ప్రయోజనం ఆత్మ దర్శనం అని భావించారు.
భారత రాష్ట్రపతిగా పనిచేస్తున్న సమయంలో ప్రజాస్వామ్య విలువల భావనల వ్యాప్తికి విశేష కృషి చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య సయోధ్యా, సామరస్యాలను నెలకొల్పాలని బోధించారు. ప్రజాస్వామ్యం అంటే భిన్నభిప్రాయాల సహనం అని అసమ్మతిని స్వీకరించే గొప్ప గుణమని, వైరుధ్యాలను శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కరించి, సహజీవనం సమభావం  ద్వారా సమాజాన్ని నడిపించాలని కోరారు.
1948 జనవరి 16న న్యూఢిల్లీలో జరిగిన భారత విద్యా సదస్సులో ఆధునిక భారత నిర్మాత ప్రధాని నెహ్రు మాట్లాడుతూ దేశం పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందడానికి అనువైన విద్యారంగాన్ని రూపొందించడానికి సూచనలు చేయవల్సిందిగా కోరుతూ సర్వేపల్లి అధ్యక్షతన మొదటి విశ్వవిద్యాలయ కమిషన్‌ను ఏర్పాటు చేసారు. విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలుగా విలసిల్లాలని, విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని విద్యపై వ్యయాన్ని ప్రజల ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావించాలని సర్వేపల్లి సూచించారు. ఈ విధంగా ప్రజాతంత్ర విద్యా నిర్మాతగా నిలిచిపోయారు.
ప్రస్తుతం జాతీయోద్య ఆకాంక్షలకు, రాజ్యాంగ తాత్వికతకు భిన్నమైన అస్తవ్యస్థ ధోరణులు విద్యారంగంలో, సామాజిక రంగంలో కొనసాగుతున్నాయి.  ‘‘ఈ దేశంలో మైనార్టీలు, దళితులు, ఆదివాసులు అందరు మెజార్టీ మతానికి విధేయులై ఉండి నివసించాలని, వారు ఏమి హక్కులు కోరరాదని, ప్రాధ్యానతను ఆశించరాదని, చివరకు విద్యాహక్కులకు కూడా’’ అని సంఘ్‌చాలక్‌ ‌గోల్వాల్కర్‌ ‌ప్రవచించిన ఆలోచన గుచ్ఛమును ఆచరిస్తున్న శక్తులు గత 6 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నాయి. 2014 నుండి 2019 వరకు విద్యారంగానికి జి.డి.పి.లో 6 శాతం కేటాయించాల్సిందిగా ఉండగా, వరుసగా 0.71 శాతం, 0.67 శాతం, 0.50 శాతం, 0.48 శాతం, 0.47 శాతం, 0.45 శాతం మాత్రమే కేటాయించి ప్రజా విద్యావ్యవస్థను విధ్వంసపు అంచులకు నెట్టివేసారు. హిందుత్వ ప్రాతిపదికగా చరిత్రను వక్రీకరిస్తూ వైషమ్యాలు పెంచే విధంగా తిరుగ రాస్తున్నారు.  దీని ప్రచారం కోసం ఇండియన్‌ ‌హిస్టరీ కాంగ్రెస్‌ను వేదికగా, అలాగే విజ్ఞానం సాంకేతికతలు వెల్లివిరిసే సైన్స్ ‌కాంగ్రెసులను సూడో సైన్స్ ‌ప్రచారాలకు ఉపయోగించుకుంటున్నాయి.  నిధుల కోతతో మౌళిక సౌకర్యాలలేమితో  ఉపాధ్యాయ నియమాకాలు లేకపోవడంతో గత 6 సంవత్సరాలలో రెండు లక్షల ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.   లక్షన్నర బడులు ఏకోపాధ్యాయున్ని కలిగి ఉన్నాయి. అనేక ఉన్నత విద్యాసంస్థలకు నిధులను తగ్గించి, స్వయంప్రతిపత్తి సంస్థలుగా నడుపడానికి అనుమతినిచ్చాయి.  ఈ సంస్థలు వనరులు సమకూర్చడం కోసం భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.  ఫలితంగా బహుజన వర్గాలకు ఉన్నత విద్య భారంగా మారుతున్నది.  హెచ్‌.‌సి.యు., జె,ఎన్‌.‌యు., బి.హెచ్‌.‌యు., ఐ.ఐ.టి. మద్రాస్‌, ‌ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్‌ ‌వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రజాస్వామ్య సంస్కృతిని ధ్వసం చేస్తూ, భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తున్నది.  రాజ్యాంగ చట్రంలో సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ‌సుధాభరద్వాజ్‌, ఆనంద్‌ ‌తేల్‌తుంబ్డే వంటి వాళ్ళ పై కుట్ర కేసులను మోపుతున్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం విడుదల చేసిన కస్తూరి రంగన్‌ ‌రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదా ఒక డొల్లగా నిరూపితమైనది. ప్రజాతంత్ర విద్యావ్యవస్థ మనుగడకు కావల్సిన ఉద్దీపనలు లేవు. ఉమ్మడి విద్యావ్యవస్థ అమలుపై కనీస ప్రస్తావనే లేదు. విద్యను వ్యాపారం చేయడం, ప్రైవేటీకరణ, కాషాయికరణ చేయడం కోసం సంఘ్‌పరివార్‌ అజెండాను రాకెట్‌ ‌వేగంతో అమలు చేస్తున్నది.  విద్యా వ్యవస్థ వైఫల్యంతో సామాజిక విలువలు పతనమవ్వడం, పారిశ్రామిక వ్యవసాయ రంగాలు కుదేలు అవుతున్న స్థితి కనిపిస్తుంది.  స్వతంత్ర భారత చరిత్రలో గరిష్ఠ నిరుద్యోగ రేటు 6 శాతం కనిష్ఠ జిడిపి 5 శాతం నమోదు అయ్యి సంక్షోభం తీవ్రతరం అవుతున్నది. శాస్త్ర విజ్ఞానానికి సాంకేతిక నైపుణ్యతకు ప్రాధ్యానతను ఇవ్వకుండా అభివృద్ధి తిరోగమన పునరుద్దరణ వాదానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ స్థితి దాపురిస్తున్నది.
సర్వవ్యాప్త సంక్షోభం నెలకొన్న విపత్కర పరిస్థితులలో నిర్మాత, తత్వవేత్త సర్వేపల్లి భావనల అమలుకు  మరింత సమకాలీనత, ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ప్రజలందరికి జ్ఞానార్జన ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని ఆయా సమాజాలు సంక్షేమ బాటను పడుతాయి అని చెప్పిన సర్వేపల్లి తాత్విక వెలుగులో ప్రజా తంత్ర ఉద్యమాన్ని నడుపాల్సిన అవసరం ఉన్నది. 21వ శతాబ్దంలో ప్రపంచ విద్యపై యునెస్కో 1996లో జాక్వస్‌ ‌డేలర్‌ ‌ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా కమీషన్‌ ‘‘‌ది ట్రెజర్‌ ‌వితిన్‌ – ‌లెర్నింగ్‌’’ ‌శీర్షికతో నివేదికను రూపొందించింది.  దీనిని అమోదించిన దేశాలలో భారత్‌ ‌కూడా ఉంది. ఇది విద్యకు ఉండాల్సిన నాలుగు మూలస్థంబాలను ప్రస్తావించింది. తెలుసుకోవడం కోసం, పనులు చేయడం కోసం, కలిసిమెలసి జీవించడం కోసం, ఎందుకు జీవించాలో తెలుసుకోవడం కోసం విద్యా లక్ష్యాలుగా ఉండాలని పేర్కొంది. ఇంకా ఆర్థిక, వికాస భావజాలాల పట్ల, స్థానిక, ప్రపంచ విషయాలపట్ల, వైయుక్తిక, సార్వత్రిక విషయాలపట్ల, సంప్రదాయ, ఆధునిక విషయాలపట్ల, ఆధాత్మిక, భౌతిక విషయాల మధ్య ఉండే ఆగాథాలను, ఉద్రికత్తను, ఒత్తిడిని తగ్గించడానికి విద్య సాధనంగా పనిచేయాలని ఈ వెలుగులో ప్రపంచ దేశాలు తగు కార్యాచరణ చేపట్టాలని యునెస్కో పిలుపునిచ్చింది. గత 6 సంవత్సరాలుగా నరేంద్రమోడీ విద్యావిధానాలు యునెస్కో స్పూర్తికి భిన్నంగా విద్యా ప్రతిఘాతుక విప్లవాన్ని అమలు చేస్తున్నాయి. మేధావులుగా సమాజంపై ప్రభావం కలిగించే ఉపాధ్యాయ లోకం పౌరసమాజంతో కలిసి యుద్ధప్రాతిపదికగా విపత్తులో ఉన్న విద్యా భారతాన్ని ప్రజతంత్ర జ్ఞాన స్వర్ణ మేధినిగా మార్చే చారిత్రక కర్తవ్యాన్ని చేపట్టాలి.
అస్నాల శ్రీనివాస్‌,
‌తెలంగాణ  గెజిటెడ్‌ అధికారుల  సంఘం