వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘‌తిక్క’ లెక్క తప్పుతున్నది..!

December 4, 2019

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ ‌కల్యాణ్‌ ఎప్పుడేం మాట్లడాతారో ఆయనకే తెలియదు. ఆయన కోపం అంతా ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌పైనే. ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని పదే పదే చెప్పుకునే పవన్‌ ‌తెలుగు దేశం హయాంలో ఒక్క ప్రజాసమస్యపై కూడా స్పందించలేదు. అందుకే, ఆయనను తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దత్త పుత్రుడంటూ వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన విమర్శల అస్త్రం హిందూ నాయకుల వైపు తిరిగింది. అది ఉద్దేశ్య పూర్వకమో, యాథాలాపమో తెలియదు కానీ, ఆయన తాజాగా హిందూ నాయకుల వల్లనే హిందు తీవ్రవాదం పెరిగిపోతోందంటూ బాంబు పేల్చారు. హిందూ తీవ్రవాదం అనే మాటలను ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ హోం, ఆర్థిక శాఖల మంత్రి చిదంబరం కనుగొన్న పదం. రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకులపై విమర్శలు చేసేందుకు ఆయన హిందూ తీవ్రవాదులనే పదాన్ని తరచూ ఉపయోగించేవారు. అయితే ఆయన ఆ పదాన్ని ఉపయోగించిన సందర్భం వేరు. ఆయన మాలేగావ్‌ ‌పేలుళ్ళ నేపథ్యంలో సాధ్వీప్రజ్ఞా సింగ్‌, ‌పురోహిత్‌ ‌వంటి వారిని ఉద్దేశించి ఆ పదాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు పవన్‌ ‌కల్యాణ్‌కు అటువంటి వారు ఎవరు కనిపించారో తెలియదు కానీ, అలాంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, హైదరాబాద్‌లో గతంలో జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మతపరమైన అంశాలను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్‌ని బద్నామ్‌ ‌చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ నాయకులు తిరుపతిలో క్రైస్తవ ప్రచారం జరుగుతోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం గురించి జగన్‌ ‌ముఖ్యమంత్రి కాక ముందు కూడా ఆరోపణలు వొచ్చేవి. ఇప్పుడు ఆయనను విమర్శించడానికి అదో అస్త్రంగా తీసుకున్నారు. పవన్‌ ‌కల్యాణ్‌ ‌బీజేపీ నాయకుడు కాదు, కనీసం ఆ భావజాలానికి దగ్గరైన వారు కూడా కాదు. ఆయన ఉన్నపళంగా ఈ ఆరోపణ చేయడం వెనక వ్యూహం ఏదైనా ఉందా లేక కేంద్రంలో బీజేపీ నాయకులే ఆయన చేత ఆ ఆరోపణలు చేయిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. 2104 ఎన్నికల్లో పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రధాని మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. ఆయన కేంద్రంలో బీజేపీ నాయకులకు బాగా సన్నిహితమనే ప్రచారం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని రాష్ట్రానికి మంచి జరిగేందుకు ఉపయోగించాలి. ఆయన గడిచిన ఐదేళ్ళలో అలాంటి పని చేసినట్టు లేదు. అలా చేసి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క నియోజకవర్గం నుంచైనా గెలుపొందేవారు. ఆయనకు సొంత అజెండా లేకపోవడం వల్ల ఏదో ఒక పార్టీ అజెండాని భుజానికి ఎత్తుకుంటు న్నారేమోననిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కోసం ఇసుక కొరత, రాజధాని నగరం అంశాలపై జగన్‌ ‌మీద బురద జల్లాలని చూశారు. అవేమీ పని చేయలేదు. ఇప్పుడు ఉల్లిపాయల కొరత సమస్యను తలకెత్తుకున్నారు. అది దేశమంతటా ఉన్నదే. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం మార్కెటింగ్‌ ‌శాఖ ద్వారా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేసి కిలో 25 రూపాయిలకు అందిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వాటిని తగ్గించేందుకే జగన్‌ ఒక నిధిని ఏర్పాటు చేశారు. అది నిత్యం జరిగే వ్యవహారమే. ఉల్లిపాయల గురించి మాట్లాడుతూనే జనసేనాని ఇప్పుడు మతం గురించి అస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలకు తెలంగాణలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ‌తీవ్రంగా స్పందించారు. జనసేనాని తెలిసి మాట్లాడుతున్నారో ఎవరో చెప్పింది అందిపుచ్చుకున్నారో తెలియదు కానీ, ఇంత వరకూ ఆయనను ఒక సినీనటునిగా గౌరవించాం, ఇలాంటి తెలిసీ తెలియని మాటలు మాట్లాడితే ఆయన ఏ భాషను ప్రయోగించారో ఆ భాషలోనే సమాధానమివ్వాల్సి వొస్తుందంటూ రాజాసింగ్‌ ‌ఘాటుగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ నాయకుల అజెండా గురించి అందరికీ తెలుసు. పైగా ఆ సంస్థలకు తెలంగాణలో కొద్ది ప్రాంతాల్లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఆదరణ లేదు. ఆ సంస్థలపై ఆరోపణలు చేయడం ద్వారా వాటికి ప్రాధాన్యం కల్పించేందుకు పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన ప్రసంగాలు కూడా ముక్కలు ముక్కలుగా ఉంటాయే తప్ప ధారాళంగా ఉండవు. తాను చెప్పదల్చుకున్నదేదో సూటిగా చెబుతున్నట్టు అనిపించదు. జగన్‌పై చేసే విమర్శలూ, ఆరోపణలకు వైసీపీ నాయకులూ, మంత్రులూ అదే స్థాయిలో సమాధానాలిస్తున్నారు. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. హిందూ మత నాయకులపై విమర్శలు చేస్తే మతపరమైన వివాదాలు చెలరేగే ప్రమాదం ఉంది. ఉల్లిపాయల గురించి మాట్లాడుతూ, జగన్‌కి పరిపాలించే శక్తి లేకపోతే ఎన్నికలు పెట్టాలని సలహా ఇచ్చారు. ఎన్నికలను నిర్వహించాల్సింది కేంద్రం, రాష్ట్రంలో పరిస్థితులు దారి తిప్పితే కేంద్రం జోక్యం చేసుకుని మధ్యంతర ఎన్నికలను జరిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హామీపై జగన్‌ ‌దృష్టిని కేంద్రీకరించిన విషయాన్ని కేంద్ర నాయకులూ గ్రహించారు. అందువల్ల అలాంటి సూచనలు చేయడం ద్వారా పవన్‌ ‌తన అవగాహనా లోపాన్ని బయటపెట్టుకున్నారు.