వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు బలం ఉంది

May 8, 2019

ఫలితాల తర్వాత రాష్ట్రపతికి
విపక్షాల అసాధారణ లేఖ
అవకాశం ఇవ్వాలని కోరనున్న 21 ఎన్‌డిఏ వ్యతిరేక పార్టీలు
బీజేపీని వ్యతిరేకిస్తున్న 21 రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే రాష్ట్రపతికి ఒక లేఖ రాసేందుకు యత్నిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం తమకు ఉందని నిరూపించే విధంగా లేఖలను రాష్ట్రపతికి సమర్పించాలనుకుంటున్నాయి. లోక్‌ ‌సభ ఎన్నికలకు ఇంకా రెండు దశల పోలింగ్‌ ‌జరగాల్సి ఉంది. ఎన్నికల అనంతరం ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రాకపోతే ఏకైక పెద్ద పార్టీ నాయకుణ్ణి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవద్దనీ, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం తమకు ఉందని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈ 21 పార్టీలు ఒక లేఖ ద్వారా కోరనున్నాయి. ఏకైక పెద్ద పార్టీకి రాష్ట్రపతి అవకాశం ఇవ్వకుండా చూడటం కోసం ప్రతిపక్షాలు అసాధారణంగా ఈ లేఖ రాయాలని యత్నిస్తున్నాయి. ఒక వేళ అతి పెద్ద పార్టీకి తొలి అవకాశం ఇస్తే, ప్రాంతీయ ప్రార్టీలను చీల్చే ప్రమాదం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లోక సభలో మొత్తం 543 మంది సభ్యులు. కాగా, సాధారణ మెజారిటీకి అవసరమైన సంఖ్య 272. 2014 ఎన్నికల్లో బీజేపీ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా లోక్‌ ‌సభలో పూర్తి మెజారిటీ 282 సీట్లు సంపాదించింది. మిత్ర పక్షాలను కలుపుకుని ఎన్‌డిఏ కూటమి మొత్తం బలం 336.
1998లో అప్పటి రాష్ట్రపతి కెఆర్‌ ‌నారాయణన్‌ అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయిని మద్దతుదారుల లేఖలను సమర్పించాలని పట్టుపట్టారు. ప్రభుత్వం ఏర్పాటుకు వాజ్‌ ‌పేయిని ఆహ్వానించేందుకు ముందు ఆయన మద్దతు దారుల లేఖలను కోరారు. అప్పట్లో బీజేపీ 178 సీట్లు గెల్చుకుంది. కూటమి బలం, బయటి నుంచి మద్దతు ఉన్నప్పటికీ బొటాబొటీ మెజారిటీ. ప్రభుత్వం 20 మాసాల్లో కూలి పోయింది. విశ్వాస పరీక్షలో ఒక వోటు తేడాతో ప్రభుత్వం పడిపోయింది. గడిచిన ఐదేళ్ళలో రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో వివాదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మణిపూర్‌, ‌గోవాలలోనూ, ఇటీవల కర్నాటకలోనూ, ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి ఏర్పడితే అవకాశం ఇవ్వచ్చా అనే దానిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఏకైక పెద్ద పార్టీని ముందుగా ఆహ్వానించాలని బీజేపీ పట్టుబట్టింది. కర్నాటకలో 37 సీట్లు మాత్రమే వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్‌కి కాంగ్రెస్‌ ‌మద్దతు ప్రకటించింది. ఆ రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమికి గవర్నర్‌ అవకాశం ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యెడ్యూరప్ప తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు. అసెంబ్లీలో మెజారిటీని రుజువు చేస్తామని అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్‌, ‌జెడీఎస్‌ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు బిజేపీ ప్రయత్నించింది. దీనిపై రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. లోక్‌ ‌సభ
ఎన్నికలలో లాంఛనంగా కూటమి ఏదీ ఏర్పడలేదు. బీజేపీని వ్యతిరేకించే 21 పార్టీలు తమను తాము కూటమిగా ప్రకటించుకుంటున్నాయి. ఇతర సమీకరణాలకు కూడా యత్నాలు సాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఏర్పాటు గురించి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోక్‌ ‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ‌మే 19వ తేదీన జరగనుంది. వోట్ల లెక్కింపు మే 23వ తేదీన జరగనుంది.