వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‌రాష్ట్ర అధ్యక్షుల వేటలో జాతీయ పార్టీలు

November 20, 2019

రెండు జాతీయ పార్టీ)కు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులెవరన్నది గత కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. ఈ రెండు పార్టీల్లో కూడా రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం స్థానిక నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలోని నాయకులకు సహజంగానే స్వతంత్రం ఎక్కువ కాబట్టి అధ్యక్ష స్థానంకోసం పలువురు నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇంచుమించుగా ఆ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులందరికీ ఆ పదవిని అధిరోహించాలన్న కోర్కే తీవ్రంగా ఉంది. ఆ విషయంలో వారు బాహాటంగానే ప్రకటనలు చేస్తుండటం, గల్లీ నుండి ఢిల్లీ వరకు తమ అనుకూల వర్గంతో మంతనాలు చేయడమన్నది ఆ పార్టీకి సహజగుణమనేచెప్పాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడానికే సరిపోయింది కాని, ఆమేరకు ప్రజల నుండి మద్దతుగాని, ఎన్నికల్లో లాభపడిందిగాని ఏమీలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండీ రెండు సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. పైగా గుడ్డిలో మెల్లగా గెలిచిన కొన్ని స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఏకమొత్తంగా శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపుకు పాల్పడుతున్నా వారిని నిరోధించి, కాపాడుకోలేకపోయింది. తాజాగా తమ సిట్టింగ్‌ ‌సీటుగా ఉన్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూడాల్సివచ్చింది. ఈ పరిస్థితిలో అప్పటివరకు అధ్యక్ష స్థానంలో భీష్మించుకుని కూర్చున్న ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి, ఇక ఎంతమాత్రం తాను ఆ పదవిలో కొనసాగేదిలేదని అధిష్టానానికి ఖచ్చితంగా చెప్పడంతో ఇప్పుడీస్థానాన్ని అధిరోహించే విషయంలో నాయకులు పోటీపడుతున్నారు. రెండుమూడు దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకున్న నాయకులు మొదలు, ఇటీవల ఇతర పార్టీల నుండి వలసవచ్చినవారు కూడా ఆ పదవికోసం ఆరాటపడుతున్నారు. త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీ మరింత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని ఆధిష్టానం ఆలోచనగా ఉంది. అందుకు ఉత్తమ్‌నే• ఈ ఎన్నికలవరకు కొనసాగించాలని అధిష్టానం నిశ్చయించుకున్నట్లు తెలుస్తున్నది. ఇదీలా ఉంటే మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతాపార్టీ కూడా అధ్యక్షుడి వేటలో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌పదవీకాలం పూర్తి కావస్తుండడంతో అధిష్టానం కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందా, అతన్నే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండీ లక్ష్మణ్‌ ‌తన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడన్న అభిప్రాయాలు ఆపార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో రెండు సార్లు జరుగిన శాసనసభ ఎన్నికల్లో ఆపార్టీ పెద్దగా పుంజుకోలేకపోయినా, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా నాలుగు స్థానాలను గెలుచుకోవడం ఆయనకు ప్లస్‌పాయింట్‌గా మారింది. అందులో అధికార పార్టీకి చెందిన అతి ప్రధానమైన స్థానాలను కైవసం చేసుకోవడం కూడా ఆయన పదవికి వన్నె తెచ్చినట్లైంది. వాస్తవంగా గత ఎన్నికలకు ముందు నుండే ఇక్కడ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెబుతూ వస్తున్న ఆ పార్టీ నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడంతో వారి ఉత్సాహం ఇనుమడించినట్లైంది. అదే దూకుడును రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించడంతో పాటుగా, వొచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీ క్యాడర్‌ను మరింత పటిష్టవంతగా తయారు చేయాలన్నది ఆపార్టీ సంకల్పం. దానికి అనుగుణంగా అధికార పార్టీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపడంలో పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ ‌సమర్థవంతమైన పాత్ర పోషించాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిసి సామాజిక వర్గానికి చెందినవాడవడం కూడా ఆయనకు మరో అర్హతగా కలిసి వచ్చింది. తాజాగా టిఎస్‌ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో లక్ష్మణ్‌ ‌ప్రధాన భూమికను పోషించారు. విపక్షాల సమావేశాలన్నీ దాదాపుగా ఆయన అధ్వర్యంలోనే జరుగడం, ఆర్టీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని, గాయపడడం, రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలాంటి పనులతో ఆయన తన బాధ్యతను క్రీయాశీలంగా నిర్వహిస్తున్నాడనేందుకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇంటర్‌ ‌విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో లక్ష్మణ్‌ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం, నేరుగా రాష్ట్రపతి దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్ళడం లాంటి చర్యలతో ఆయన అటు పార్టీలోనే కాకుండా ఇటు ప్రజల మన్నలను కూడా పొందాడని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన అధ్య••• పదవీ కాలంలో వివిధ పార్టీల నుండి ముఖ్యనాయకులు బిజెపిలో చేరడం కూడా సమర్థ నాయకుడిగా ఆయనకు గుర్తింపును తెచ్చింది. కాంగ్రెస్‌ ‌నుండి మాజీ మంత్రి డికె అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీనుండి రాజ్యపభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తో పాటు పలువురు ముఖ్యనాయకులు ఆయన సారథ్యంలో చేరడంతో పార్టీలో ఆయన ప్రతిష ్టమరింత పెరిగింది. దీనికితోడు పార్టీలో సీనియర్లంతా వివిధ పదవులు నిర్వహిస్తుండడం, కాంగ్రెస్‌లో మాదిరి కాకుండా, బిజెపి మొదటి నుండీ క్రమశిక్షణగల పార్టీగా పేరుండడంతో ఆ పదవికి పెద్దగా ఎవరూ పోటీ పడకపోవడం కూడా ఆయనకు కలిసివస్తున్న అవకాశంగా మారింది. వీటన్నిటి దృష్ట్యా లక్ష్మణ్‌నే తిరిగి అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు నెక్కువగా• కనిపిస్తున్నాయనుకుంటున్నారు.