అంగ వైకల్యాన్ని జయించిన బొల్లం శ్రీకాంత్‌

 నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 100 కోట్లకు పైగా దివ్యాంగులు (ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం) ఉన్నారని తెలుస్తున్నది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం, వారి ఆర్థిక/రాజకీయ/ సాంస్కృతిక/సామాజిక శ్రేయస్సుకు కార్యాచరణ అమలు చేయడం, వారికి సహానుభూతిని ప్రకటించడం, అవసర చేయూతను స్వచ్ఛందంగా అందించడం లాంటి పలు అంశాలను చర్చించడానికి 1992 నుంచి ప్రపంచవ్యాప్తంగా 03 డిసెంబర్‌న ‘‘అంతర్జాతీయ దివ్యాంగుల దినం’’ పాటించుట ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినం-2023 నినాదంగా ‘‘ఐక్య కార్యాచరణతో దివ్యాంగుల సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు’’ అనబడే అంశాన్ని తీసుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద మైనారిటీ వర్గంగా అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారు. అంగవైకల్యంతో బాధ పడుతున్న వ్యక్తుల్లో అనారోగ్యం, పేదరికం, అవిద్య లాంటి సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. దివ్యాంగులకు విద్య, వైద్య వసతులు కలిపించడం తక్షణావసరం అని భావించాలి.

 అంధ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త బొల్లం శ్రీకాంత్‌
 హైదరాబాదులో బొల్లంట్‌ పరిశ్రమలను స్థాపించిన దివ్యాంగుడు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త బొల్లం శ్రీకాంత్‌ పుట్టుక నుంచే అంధత్వ చీకట్లను ఎదుర్కొన్నారు. 07 జూలై 1991న సీతారాంపురం, మచిలీపట్నంలోకి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్‌ తన 6వ ఏటనే సమీప పాఠశాలకు 4-5 కిమీ కాలి నడకన వెళ్లి అక్షర యాత్ర ప్రారంభించారు. తోటి విద్యార్థుల నుంచి నిర్లక్ష్యం, నిరాదరణ అనుభవిస్తూనే హైదరాబాదులోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. అనంతరం ఇంటర్నీడియట్లో సైన్స్‌ గ్రూపులో ప్రవేశానికి ప్రభుత్వం నిరాకరించగా కోర్టు ద్వారా ప్రవేశం పొంది చిన్మయా దివ్యాంగ అంధుల విద్యాలయం నుంచి 98 శాతం మార్కులతో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. యన్‌ఐటిలో అడ్మిషన్‌ పొంగడానికి ప్రయత్నించగా వారు నిరాకరించారు. ఇంజనీరు కావాలనే కాంక్ష, పట్టుదల పెరిగి అమెరికాలోని ప్రతిష్టాత్మక మాచెస్ట్యూట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యంఐటీలో ప్రథమ అంతర్జాతీయ అంధ విద్యార్థిగా మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ కోర్స్‌ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. అమెరికాలో పలు కంపెనీల ఉద్యోగాలు వచ్చినా దేశ సేవ చేయాలనే విలక్షణ లక్ష్యంతో ఇండియాకు వచ్చారు. 2012లో హైదరాబాదు చేరి ‘బొల్లంట్‌ పరిశ్రమ’ను స్థాపించి లాభాల బాటన నడుపుతున్నారు. పరిశ్రమను పరుగులెత్తిస్తున్న బొల్లం ఈదడం, చెస్‌ ఆడడం, క్రికెట్‌ క్రీడల్లో రాణించారు.

48 మిలియన్‌ పౌండ్ల పరిశ్రమకు సిఈఓ
 శ్రీకాంత్‌ ప్రతిభను గుర్తించిన నవ సమాజం పలు పురస్కారాలను అందజేయడం జరుగుతోంది. ఏ పి జె అబ్దుల్‌ కలాం, ఆచార్య సుదర్శన్‌ ద్వయంతో కలిసి ‘లీడ్‌ ఇండియా-2020’లో విశిష్ట సేవలను అందిస్తున్నారు. 2011లో దివ్యాంగులకు సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీకాంత్‌ ఆలోచనల ఫలితంగా బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రారంభిమైంది. రతన్‌ టాటా సహకారంతో స్థాపించిన బొల్లంట్‌ ఇండస్ట్రీస్‌ ద్వారా వందల దివ్యాంగులకు ఉద్యోగాలు కలిపించారు. పర్యావరణ హిత దిశగా రీసైకిల్డ్‌ క్రాఫ్ట్‌ పేపర్‌, వ్యర్థాల నుంచి ప్యాకేజ్‌ ఉత్పత్తులు, సహజ ఆకుల నుంచి పేపర్‌, వ్యర్థ ప్లాస్టిక్‌ నుంచి ఉత్పత్తులను చేస్తున్న కంపెనీ సిఈఓగా 48 మిలియన్‌ పౌండ్ల టర్నోవర్‌ కలిగిన పరిశ్రమగా మలచగలిగారు. 2016లో సర్జ్‌ ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ స్థాపించి సుస్థిరాభివృద్ధి లక్ష్యం-2030 దిశగా అడుగులు వేస్తున్నారు.

వరించిన పురస్కారాల పంట
2017లో ఆసియాలోనే 30 మంది ప్రతిభావంతుల ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. యంగ్‌ సర్వీస్‌, యూత్‌ ఎక్సలెన్స్‌, ఎంటర్‌ప్య్రూనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, యంగ్‌ చెంజ్‌ మేకర్‌, ఎమర్జింగ్‌ లీడర్‌షిప్‌, ఎమర్జింగ్‌ ఎంటర్‌ ప్య్రూనర్‌, నవ నక్షత్ర సన్మాన్‌, గ్లోబల్‌ ఫోరమ్‌ యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌-2021 లాంటి పలు అవార్డులు పొందిన బొల్లం శ్రీకాంత్‌ నేటి సభ్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బొల్లం శ్రీకాంత్‌ అసాధారణ జీవితం నేటి యువతకు, ముఖ్యంగా దివ్యాంగులకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్‌ ఆక్టర్‌ రాజ్‌కుమార్‌రావు బయోపిక్‌ తీయడానికి పూనుకోవడం ముదావహం. అబ్దల్‌ కలాం అభిమానాన్ని చూరగొన్న శ్రీకాంత్‌ జీవిత లక్ష్యం దేశ రాష్ట్రపతి కావాలనే ప్రగాఢ వాంఛ తీరాలని కోరుకుందాం. అంధత్వాన్ని సవాళుగా తీసుకొని చీకట్లను చిదిమేస్తూ విజయ ఆకాశాన్ని ముద్దాడుతున్న బొల్లం జీవితం మనందరికీ ఆదర్శం, అనుసరణీయం, అభినందనీయం.


-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి  
 కరీంనగర్‌, 9949700037          

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page