అది 1959, అక్టోబర్ 21, భారత్ చైనా సరిహద్దులోని లడక్ – అక్సాయ్ చిన్ ప్రాంతం. గజగజ వణకించి, గడ్డగట్టే విపరీతమైన చలి. సరిహద్దు రక్షణవిధుల్లో కేంద్ర రిజర్వు పోలీసు దళం (సి ఆర్ పి ఎఫ్)పదిమంది జవానులు సరిహద్దు రక్షణలో నిమగ్నమై ఉన్నారు. చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చారు. వారిని ఈ పది మంది పోలీసులు ధైర్యంతో ఎదిరించి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు కోల్పోయారు. దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సంఘటన అది. ఆ దుర్ఘటననేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై “అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా” నిర్ణయించారు.
పోలీసు విధి నిర్వహణ శ్రమతో కూడుకున్నది, ఇతర ఉద్యోగుల మాదిరి రోజులో కొన్ని గంటలకు మాత్రమే పరిమితం కాదు, ఇరవైనాలుగు గంటలూ ఉద్యోగంలో ఉండేది ఒక్క పోలీసు మాత్రమే! పోలీసులు లేని సమాజాన్ని ఉహించుకోలేం. ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే . ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది, ఏ పరిస్థితుల్లో నైనా అన్ని వేళలో ముందుండేది పోలీసులే. సమాజంలోని ప్రతి వ్యక్తీ, ప్రతీ అవసరానికి సాయం కోరేది పోలీసులనే! దేశాన్ని శత్రువుల దండయాత్రల నుంచి కాపాడేది సైనికులైతే, అంతర్గత శత్రువుల నుంచి అందరినీ కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, ఆస్తులకు రక్షణ కల్పించేది పోలీసులు.
శాంతిభద్రతల అదుపు, నేరగాళ్ళ నియంత్రణ పోలీసుల కర్తవ్యం. ప్రజలకు భద్రతనిచ్చే విధుల్లో పోలీసులు ప్రాణాలుకూడా అర్పిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూన్నారు. ఒకవైపు పోలీసు విభాగం ఆధునీకరణ దిశగా నూతన విధానాలు అవలంబిస్తూ పౌరులకు మెరుగైన సేవలను అందిస్తూనే, నేరాలకు పాల్పడు తున్న వ్యక్తులను గుర్తించి ఆధునిక పద్ధతులను ఉపయోగించుకుని సమర్థవంతంగా దుష్టశక్తులను అణచివేసేందుకు నిర్విరామ కృషి చేస్తోంది. ఈ పరిసిథితుల్లో పోలీసులు ప్రాణాలు లెక్క చేయ కుండా, కుటుంబ సభ్యుల భవిష్యత్తుకూడా పక్కన పెట్టి ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో జీవితలు త్యాగాలు చేసి అమరులైన పోలీసులను స్మరించుకోవడం పౌరులందరి బాధ్యత. నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. ప్రజలకు ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసు.
ఖాకీ డ్రస్ కరుకుదనం ఉన్న వెనుకాల ఉన్నది మనిషే కాబట్టి వారికి మర్యాద, గౌరవం, విలువ ఇవ్వాల్సిన కర్తవ్యం మనది. రాష్ట్ర అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్న వామపక్ష తీవ్ర వాదులతో తలపడి, మరిన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రజల భద్రత విధులు నిర్వర్తిస్తూ పోలీసులు మావోయిస్టు, ఎం.ఎల్ గ్రూపుకు నక్సలైట్ల చేతుల్లో హతులయ్యారు. త్యాగమూర్తులైన పోలీసులకందరికీ ప్రజానీకం యావత్తూ నివాళులు అర్పిస్తోంది. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి దేశప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకిత చేసిన వారందరికీ అభివందనం. భవిష్యత్‌లో పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకురాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం
—– నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్, 98481 28215