- పన్నీర్ సెల్వం..పళనిస్వామిల మధ్య విభేదాలు
- సర్వసభ్యమండలి సమావేశంలో పన్నీర్‌పై బాటిళ్లు
- మధ్యలోనే అనుచరులతో వెళ్లిపోయిన ఓపిఎస్
చెన్నై,జూన్23: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం’ కోసం పన్నీరుసెల్వం , పళనిస్వామి వర్గాల మధ్య జరుగుతున్న వర్గపోరు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పళనిస్వామి ఆహ్వానం మేరకు ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి హాజరైన ఒ.పన్నీర్‌సెల్వంపై పళనిస్వామి వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వాటర్ బాటిల్స్ విసిరేసి మరీ వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. పరిస్థితులన్నీ తనకు ప్రతికూలం గా మారడంతో చేసేదే లేక పన్నీరుసెల్వం , ఆయన మద్దతుదారులు సమావేశం మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఓపీఎస్ సూచించిన 23 తీర్మానాలు రద్దయ్యాయి. ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో..
సమావేశం నుంచి పన్నీరుసెల్వం మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో గురువారం చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్‌లో కీలక సమవేశం జరిగింది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. అయితే గురువారం జరిగిన సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి నాయకత్వంలో పార్టీ నడవాలనే నిర్ణయించినందున.. పళనిస్వామి క్యాంప్‌కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు.
దీంతో సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త్ పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్ చేశారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీ ఆర్. వైతిలింగంతో సహా ఓపీఎస్ మద్దతుదారులంతా టింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు తీవ్రస్థాయిలో ఓపీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపు మంచి నీళ్ల సీసాలను విసిరారు. పన్నీర్?సెల్వం కారు టైర్ల గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసింది. జూలై 11న మళ్లీ అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది.ఆ సమావేశం నుంచే.. 2016లో అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణానంతరం..
ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వ సూత్రాన్ని అనుసరిస్తోంది. అయితే పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 14న జిల్లా కార్యదర్శి సమావేశం జరిగినప్పటి నుంచి పార్టీలో ఏక నాయకత్వం కోసం చర్చ మొదలైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. గురువారం ఈ కీలక సమావేశాన్ని జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏక నాయకత్వానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదింపజేయాలని అనుకున్నారు. కానీ, తన సంతకం లేకుండా జనరల్ బాడీ తీర్మానం ఆమోదం పొందదంటూ పన్నీర్ సెల్వం సమావేశానికి ముందే వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. అయితే ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ అంతర్గత విషయమని బెంచ్ స్పష్టం చేసింది.