ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనాధల సంక్షేమం కోసం గత 20 ఏళ్ళుగా పాటుపడుతున్న తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షులు బొక్క వెంకటయ్య సేవలను కొనియాడుతూ సోమవారం బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జాగృతి రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ కొండా పరమేశ్వర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అనాధల సంక్షేమం కోసం వెంకటయ్య ప్రాణలకు తెగించి నిరాహార దీక్షలు చేసి ఇప్పటికే ఎన్నో జీవోలు 47, 28, 124, 254 లను తీయించారని అన్నారు. మంత్రులకు, చీఫ్ సెక్రటరీలకు, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అనాధల సమస్యలు డిమాండ్లపై అనేక వినతి పత్రాలు సమర్పించారని అన్నారు. వెంకటయ్య చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టూ డోర్ తిరిగి అనాధల వివరాలు సేకరించే కార్యక్రమం మొదలు పెట్టిందని, ఇది శుభ పరిణామం అన్నారు. అనాధల సంస్థ అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడుతూ ప్రస్తుతం మిషన్ వత్సల్య కింద 6 వేల మంది మాత్రమే లబ్ది పొందుతున్నారని, ఇప్పుడు ప్రభుత్వం చేయిస్తున్న సర్వే ద్వారా 20 వేల మందికిపైగా లబ్ది పొందే అవకాశం ఉందన్నారు. అనాధల సంక్షేమానికి కట్టుబడి సబ్ కమిటీ వేసిన సందర్బంగా సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, ఇతర బిఆర్ఎస్ పార్టీ నేతలకు అనాధలు ఋణపడి ఉంటారని అన్నారు. అనాధల సంక్షేమం కోసం ఎన్ని ఉద్యమలు చేయడానికైనా సిద్ధం అన్నారు. అనాధలకు మద్దతుగా నిలబడిన ఎమ్మార్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, ఎం.ఎస్.పి, వికలాంగుల సంఘం నేతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ కులసంఘాలు, అన్ని పార్టీల నాయకులు, ఎన్.జి.వోలు వారి పరిధిలో ఉన్న అనాధలను తమ వంతు బాధ్యతగా ఆన్ లైన్ చేయించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు అధ్యక్షులు కొండా సుదర్శన్ గౌడ్, వార్డు అధ్యక్షులు డి.పెంటయ్య, చంటి, దామోదర్, కె.నగేష్ గౌడ్, ఎం.మణిచందర్ గౌడ్, ఎం.రాముగౌడ్, చిన్నా, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ వార్డు సభ్యులు వెంకటయ్య కృషిని అభినందనందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.