తెలుగు రాష్ట్రాల విభజనాంశాలు మరోసారి వివాదగ్రస్తంగా మారుతున్నాయి. ఈ విభజనలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా, దీనిపై వివాదం చేస్తే మీ భూభాగాన్ని మేము డిమాండ్ చేస్తామని ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. తాజాగా చర్చనీయాంశంగా మారిన ఆవేశపూరిత ప్రకటనలకు వరుణదేవుడి విశ్వరూపం కారణంగా మారింది. గత వంద సంవత్సరాల్లో ఏనాడు ఈ మాసంలో చూడనంతగా గోదావరిలో వరదలు ముంచుకురావడం దీనికి నాంది అయింది. వరదల కారణంగా అటు ఏపిలోనూ, ఇటు తెలంగాణలోనూ పంటలకు, జనజీవనానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
దశాబ్ధాలుగా జరుగుతున్న ఈ నష్టాన్ని నివారించి గోదావరి నీటిని బహుళార్థకంగా వినియోగించుకోవడానికి పోలవరం ప్రాజెక్టు రూపకల్పనచేశారు. 2004లో డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా 8వేల 200 కోట్లతో శంఖుస్థాపనకు పునరుజ్జీవనం చేశారు. 2014లో తెలుగురాష్ట్రాన్ని రెండుగా విడదీసినప్పుడు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు మండలాలను ఏపిలో కలపడం ఇప్పుడు తెలంగాణకు ముప్పుగా వాటిల్లింది. వాస్తవంగా మొదటి నుండి తెలంగాణపైన పెత్తనం సాగించిన ఏపి పాలకుల దృష్టి అంతా హైదరాబాద్ నగరంపైన ఉండడంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దాన్ని బూచిగా చూపించి ఏడు మండలాలను ఇచ్చే విధంగా ఆనాటి ఉద్య మకారులను ఒప్పించింది. దానిపై ఉద్యమకారులెవరూ ఆనాడు గట్టిగా పట్టుపట్టకపోవడం ఇప్పుడు కొంపముంచుతోంది. గోదావరి ప్రవాహం పెరిగినప్పుడల్లా భద్రాచలం దేవాలయంతోపాటు పట్టణమంతా నీట మునుగుతున్నది . చుట్టుపట్ల గ్రామాలు మునుగుతున్నాయి. ఈ నష్టనివారణకు తెలంగాణ కోల్పోయిన ఏడు మండలాల్లో కనీసం అయిదు ఊళ్ళు ఇచ్చినా చాలని ఇప్పుడు తెలంగాణ అర్థిస్తోంది. దానికి ఏపి ససేమిరా అంటోంది. ఈ అంశమే ఇప్పుడు వివాదగ్రస్తంగా ఉన్న విభజనాంశాలను కెలుకుతున్నది. గోదావరి వరద తాకిడికి అడ్డుకట్ట వేయాలంటే చుట్టూ కరకట్టల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కరకట్టల నిర్మాణం చేయాలంటే ఏపికి ధారాదత్తం చేసిన ఏడు మండలాల్లో కనీసం అయిదు గ్రామాలను కలుపుకుని చేయాల్సి ఉంటుంది.
అదే విషయాన్ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెరపైకి తీసుకువొ చ్చారు. సహజంగానే తెలంగాణకు ఏలాంటి లాభం జరగడానికి ఇష్టపడని ఏపి నాయకత్వం తీవ్రంగా విరుచుకుపడుతున్నది. ఒకరి వెనుక ఒకరు అన్నట్లుగా ఏపి క్యాబినెట్‌కు చెందిన పలువురు మంత్రులు మూకుమ్మడిగా దాడిచేసినంత పనిచేస్తున్నారు.
మేము అయిదూళ్ళు ఇస్తే మాకు హైదరాబాద్ పట్టణమిస్తారా అని ఒకరు, అసలు భద్రాచలమే మాదంటే ఏం చేస్తారని మరొకరు, విలీన గ్రామాలను తెలంగాణలో కలపడంకాదు, ఏపినే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తామని ఇంకొకరు ఇలా ఒకరికిమించి ఒకరు తమ వాగ్ధాటినంతా తెలంగాణపై ప్రయోగించడంలో ఏమాత్రం వెనుకాడటంలేదు. విభజన సమయంలోనే భద్రచలం ఏపికే చెందుతుందని ఆనాడే పలు ఆధారాలు చూపే ప్రయత్నం చేసింది ఏపి నాయకత్వం. కాగా, అసలు పోలవరం ప్రాజెక్టు కేంద్రం పరిధిలో నిర్మాణం జరుగుతుంటే కేంద్రాన్ని యాచించాల్సిందిపోయి తమను అడగటమేంటని అక్కడి రాజకీయ ఉద్దండులు వేస్తున్న ప్రశ్న. విచిత్రమేమంటే ఒక పక్క గత వారం తీవ్రంగా పడిన వర్షాలవల్ల గతంలో ఏనాడు జూలై మాసంలో కనీవినీ ఎరుగనంతగా వరదలు వొచ్చాయని చెబుతున్నారు. అయితే ఏపిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఇక భద్రాచలమంతా నీటితో ఎల్లప్పుడు మునిగి పోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో దాని ఎత్తును తగ్గించాలన్నది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్. నిపుణులుకూడా అదే అంశాన్ని చాలాకాలంగా చెబుతున్నప్పటికీ కేంద్రంగాని, రాష్ట్ర ప్రభుత్వాలుగాని దాన్ని పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి.
తమ భూభాగాన్ని ఎట్టిపరిస్థితిలో తెలంగాణకు ఇచ్చేదేలేదంటూ ఏపి నాయకత్వమంతా ఒకటవుతుంటే.. తెలంగాణలో రాజకీయ పార్టీవర్గాలు మాత్రం ఒకరిమీద ఒకరు విమర్శనాస్త్రాలను సంధించు కుంటున్నాయి. ఆ రోజున ఏడు మండలాలను ఏపిలో కలుపుతుంటే తెరాస నాయకులు ఏంచేశారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా, ఏడు మండలాలు ఏపికి పోయినా ఫరవాలేదు.. వందకోట్లతో భద్రచలాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి గడచిన ఎనిమిదేళ్ళలో ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలేమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును మూడు మీటర్ల ఎత్తు పెంచితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అసెంబ్లీలో చేసిన తీర్మానం ఏమైందని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అంటుండగా, ఇంతకు సిఎం చెప్పిన క్లౌడ్ బరస్ట్ వల్ల వొస్తున్న వరదలా.. ప్రకృతి వైఫరీత్యంవల్ల వొచ్చినవా చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద గోదావరి వరదలు విభజనాంశాలపైకి మళ్ళడంతో ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం మొదలయింది.