అరకొర కేటాయింపులతో ఆశలు నెరవేరేనా!?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను వంద రోజులలో కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే పట్టణ ప్రగతిని కాస్త పక్కన పెట్టి గ్రామీణ వికాసానికి కొంత ఊరట కలిగించినట్లు కనబడుతుంది. జాబ్‌ కేలండర్‌ ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. పటిష్టమైన ఐటీ విధానం తెస్తామనడం వల్ల కొంతమేర ఐటీ విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖకు మొత్తం మీద తగ్గింపు ఉన్నప్పటికీ ఆరోగ్య శ్రీ పథకంలో కొంత పెరుగుదల ఊరట కలిగిస్తున్నది. ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టం లేకుండా రాష్ట్ర బడ్జెట్‌ ను ప్రతిపాదించడం కొంత చర్చనీయాంశంగా మారింది. విద్యకు ఒక శాతం అదనపు కేటాయింపు చేయగా కళ్యాణ లక్ష్మికి ప్రత్యేక పద్దు లేకపోవడం కొసమెరుపు.

ఆరు గ్యారంటీలకు మరియు గ్రామీణ వికాసానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ ప్రతిపాదన కనబడుతుంది. బడ్జెట్‌ లో ఈ రెండిరటి వాటా సుమారు మూడోవంతు ఉండడం గమనార్హం. ఆరు గ్యారంటీల అమలుకు కనీసం 80 వేల కోట్లు అవసరం పడుతుండగా కేవలం 53,196 కోట్లనే ప్రతిపాదించడం శోచనీయం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం,రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఏటా 6 కోట్ల రూపాయల వ్యయం కానుండగా,రూ.500 కి గ్యాస్‌ సిలిండర్‌ అందించడానికి ఏటా రూ.2,923 కోట్ల సబ్సిడీ అవసరం పడుతుంది. కాగా ఆర్టీసీ జీరో టికెట్‌ కొరకు నెలకు రూ.300 కోట్లు కేటాయింపు చేయడం కొంత ఊరట కలిగిస్తున్నది. కాగా రైతు భరోసా పథకం కింద రైతులు,కౌలు రైతులకు ఎకరానికి ఏటా రూ.15,000 చొప్పున,వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పున ఆర్థిక సాయంతో పాటు వరి పంటకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చుటకు కనీసము 29 వేల కోట్ల రూపాయలు కేటాయించవలసిన అవసరం ఉన్నది.

ఇందిరమ్మ ఇళ్ళను భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు కావలసిన నిధుల విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేటాయింపు మాత్రం కేవలం రూ.7,740 కోట్లు ప్రతిపాదించింది. కానీ వాస్తవానికి రూ.15 వేల కోట్లు ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని ఒక అంచనా. విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు,ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు గాను యువవికాసానికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. అట్లే గృహజ్యోతికి రూ.4,164 కోట్లు,చేయూతకు రూ.21వేల కోట్లు అవసరం పడనున్నాయి. వీటన్నింటికీ సరిపడా నిధులను కేటాయించకపోవడం వల్ల పూర్తిస్థాయి అమలు కొంత ప్రశ్నార్థకమేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
గ్రామీణ వికాసానికి రూ.40,080 కోట్లు కేటాయించడం శుభ పరిణామం. గతంతో పోలిస్తే విద్యకు 1.05 శాతం అదనంగా కేటాయింపులు కొంత ఊరట కలిగిస్తున్నది. కానీ వైద్య ఆరోగ్యశాఖలో రూ.661కోట్లు తగ్గుదల కొంత నిరాశ కలిగిస్తున్నది. ఆరోగ్యశ్రీ కి అయ్యే వ్యయాన్ని పెంచడం కొంత ఆశాజనక పరిణామం. పట్టణాల అభివృద్ధికి బడ్జెట్‌ లో తక్కువ కేటాయింపులే జరిగాయి.129 మునిసి పాలిటీలు,12 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, జీతభత్యాలు, నిర్వహణ వ్యయాల కింద రూ.11,692 కోట్లు మాత్రమే కేటాయించడం కొంత నిరాశ కలిగిస్తున్నది. తాజా బడ్జెట్‌ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సంక్షేమం వైపు కొంత మొగ్గు చూపినట్లు కనపడుతుంది. సంక్షేమానికి బడ్జెట్‌ లో రూ.45,149 కోట్లు కేటాయించడం దీనికి నిదర్శనం. కాకపోతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లకు కేటాయింపులు ప్రత్యేకంగా లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. వాటికయ్యే వ్యయాన్ని సంక్షేమ శాఖల నిధుల నుంచే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లే ఈ పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీ అంశాన్ని బడ్జెట్‌ లో ప్రస్తావించకపోవడం చూస్తుంటే దాన్ని విస్మరించారనే విమర్శ వినబడుతుంది.

బడ్జెట్‌ను సమగ్రంగా పరిశీలిస్తే పన్ను ఆదాయం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా కనబడుతుంది. రెవెన్యూ రాబడులు రూ.2 లక్షల పైచిలుకు, మూలధన రాబడులు రూ.68,585 గా పేర్కొనడం చూస్తుంటే ఆశల పల్లకిలో ఊరేగినట్లు కనబడుతుంది. స్థూలంగా రెవెన్యూ రాబడులను రాబట్టడం కొరకు పన్ను వడ్డింపు భారీగా ఉండడం ఖాయమని అంచనాకు రావచ్చు. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం తగ్గడం కొంత వాస్తవ రూపాన్ని సంతరించుకుందని చెప్పవచ్చు. రాష్ట్ర వృద్ధిరేటు 14.7%నుంచి 11.3% కి క్షీణించింది. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా తగ్గింది. గతంతో పోలిస్తే ద్రవ్యలోటు అంచనాకు మించి పెంచబడిరది. జిఎస్డిపి లో 3.5% చూపెట్టడంతో ఈ మేరకు ద్రవ్య లోటు కనబడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే పన్నుల్లో వాటాను పెంచడం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ను తగ్గించడం జరిగిందని తెలుస్తుంది. గత బడ్జెట్లో ప్రతిపాదించిన రుణాల కంటే ఏకంగా 50% ఎక్కువగా ఈసారి అప్పులపద్దు చూపడం,రుణ సమీకరణ మొత్తం బడ్జెట్లో 25% కావడం గమనార్హం.
ఈ బడ్జెట్‌ తో కాంగ్రెస్‌ మోసం బయటపడిరదని,కొండంత ఆశలు రేకెత్తించి గోరంత అమలు కూడా లేని బడ్జెట్‌ గా మారిపోయిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుండగా, ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్‌ అని,సంక్షేమానికి పెద్దపీట వేసే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఎవరి వాదోపవాదనలు ఎలా ఉన్నా బడ్జెట్‌ అంచనాలు పేదవాడిని ఏ మేరకు ఆదుకుంటాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.

-భాస్కర్‌ యలకుంటి
 సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు
సెల్‌: 8919464488

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page