ఆత్మస్థైర్యంతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: అంగవైకల్యంతో కుమిలిపోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు చదువులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కల్పిస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకొని  అభివృద్ధి చెందాలన్నారు.  అంగవైకల్యంతో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మీలో దాగి ఉన్న శక్తిని వెలికి తీసి అన్ని రంగాలలో నైపుణ్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఇకముందు   దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా సదరం క్యాంపులను వికారాబాద్ తాండూర్లలో నిర్వహించి అర్హులైన వారందరికీ సర్టిఫికెట్లు అందించడం జరుగుతుందన్నారు. పరిగి శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉత్తమ మాజీ పార్లమెంటేరియన్ జయపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వపరంగా లబ్ధి చేకోరే అన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందని, రాబోవు రోజులలో స్థానిక శాసనసభ్యులు ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించి సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.  అర్హులైన దివ్యాంగులందరికీ సదరం క్యాంపు ల ద్వారా సులువుగా సర్టిఫికెట్లు అందే విధంగా చూస్తామన్నారు.  ప్రస్తుత సమస్యలపై  వినతి పత్రం అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.    తాండూర్ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరించడం జరుగుతుందని తెలియజేశారు.  దివ్యాంగులమని మానసికంగా కృంగిపోకుండా
 అందరితో సమానంగా సమాజంలో పోటీపడుతూ అన్ని రంగాలలో  అభివృద్ధి చెందాలని అన్నారు.  అర్హత మేరకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందించడం జరుగుతుందని  తెలియజేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ల్యాప్ టాప్ లు, ట్రై సైకిల్ లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగినది.  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన దివ్యాంగులకు మెమొంటో, ప్రశంసా పత్రాలను అందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ కౌన్సిలర్లు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page