జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో
తరలివచ్చిన ప్రజానికం ఆత్మీయ స్వాగతాలు
ప్రతిపక్షాలను నమ్మితే మోసపోతం
కష్టాల్లో అక్కరకురాని వాళ్ళను తరిమికొట్టండి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు అధికారం అప్పగిస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కి అవినీతి అరాచకం రాజ్యమేలిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిన్నారం మండల పరిధిలోని దువ్వగుంట, మాదారం, కొడకంచి, మంత్రి కుంట, కొర్లకుంట, నల్తూరు, లక్ష్మీపతి గూడెం, చౌదరి గూడెం, వావిలాల, గడ్డపోతారం, అల్లి నగర్,కిష్టాయ్య పల్లి, కాజిపల్లి తదితర కాలనీలలో టిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సంక్షేమంతో ప్రతి గ్రామం అభివృద్ధితో కలకలలాడుతోందని తెలిపారు. ప్రతి రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆసరా పెన్షన్లను ఐదు వేల రూపాయలకు పెంచడంతోపాటు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టబోతున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.అస్థిరత పాలనకు చిరునామాగా నిలిచే కాంగ్రెస్ పార్టీని, మతోన్మాదంతో ఉరకలెత్తుతున్న బిజెపి పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జిన్నారం మండలంలో ప్రతి గ్రామానికి ఇచ్చిన హామీని పూర్తి చేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.