ఇం‌కా సవాళ్లు అనేకం .. !

దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మువన్నెల జెండా రెపరెపలాడింది. ఆకాశాన్ని ముదాడుతుందా అన్న రీతిలో త్రివర్ణ పతకాలు ఎగురవేశారు. ప్రజలంతా తమవంతుగా దేశభక్తిని చాటారు. నేతలు కూడా జెండాలు ఆవిష్కరించారు. ఊరేవాడా త్రివర్ణపతాకం ఎగిరింది. ప్రజలు ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటారు. మనమంతా ఒక్కటే అని చాటారు. ఇదే సందర్భంలో మనం మనదేశ పురోగతిపై మననం చేసుకోవాలి. నెహ్రూ నుంచి నేటి వరకు మన స్వతంత్ర భారతావనిలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పటికీ ఎదురవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఉగ్రవాదం, నిరుద్యోగం,మాదకద్రవ్యాల వాడకం పెచ్చురాయి. ఉగ్రవాదులు విదేశీ గడ్డపై నుంచి సవాళ్లు విసురుతున్నారు. దేశ విభజనతో ప్రత్యేక దేశంగా ఏర్పడ్డ పాకిస్తాన్‌ ‌తన కుత్సిత బుద్దితే తన దేశంలో ఉగ్రవాద ఫ్యాక్టరీని పెట్టి సవాళ్లు విసరుతోంది. దీంతో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతు న్నారు. సరిహద్దుల రక్షణలో జవాన్లు అమరులవుతున్నారు. ఈ సవాళ్లను అధిగమించేలా ప్రజలను చైతన్యం చేసేలా పాలకులు సంకల్పం తీసుకోవాలి. ప్రధానంగా రాజకీయ అవినీతి ప్రజాస్వామ్యానికి పట్టిన చీడగా గుర్తించాలి. పాలకులు ప్రజాస్వామ్యాన్ని ప్రైవేట్‌ ‌వ్యాపారంగా మార్చారు. ఇడి కేసులంటే వేధింపు లుగా చూపుతూ తమ డొల్లతనాన్ని చాటుకుంటున్నారు. విచారణలను రాజకీయ కక్షలుగా చూపుతున్నారు. ఇటీవల బెంగాల్లో మంత్రి పార్థాఛటర్జీ కేసు తీసుకుంటే అవినీతి ఎంతగా వేళ్లూనుకుందో గుర్తించాలి. నీతులు వల్లించే మమతా బెనర్జీ, శరద్‌ ‌పవార్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల లాంటి వారు అవినీతికి కొమ్ముకాశారు. ఆకలి, దరిద్రం, మందుల కొరత, ఆహరాధాన్యాల ధరలు, ప్రజలను పట్టిపీడిస్తున్నా..పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలు నడుపుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని అసలైన శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ప్రపంచానికి భారత్‌ ‌తోడ్పాటును అందించి సత్తా చాటుతున్న వేళ దేశంలో ఉన్న సమస్యలను గుర్తించాలి.

అణగారిన వర్గాలు, పేదలు, అవసరాల్లో ఉన్నవారి పట్ల దయార్ధ• హృదయంతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ దేశ సంపద ఏ కొందరిదో కాకుండా..అందరిదీ అన్న సంకల్పం చాటాలి. ఆర్థిక సంస్కరణలతోపాటు వినూత్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశం ముందడుగు వేస్తోందని చెప్పుకుంటున్న పాలకుల అవి ఏ మేరకు ప్రజలకు మేలు చేస్తున్నాయో విశ్లేషంచుకోవాల్సి ఉంది. సమున్నతంగా ఎదుగు తున్న నూతన భారత్‌ను ప్రపంచం కీర్తిస్తోంది. దీనిని కాదనలేం. కానీ ఇదే సందర్భంలో దేశాన్ని పట్టి పీడుస్తున్న అనేకానేక సమస్యల పై పోరాటంలో పాలకుల్లో చిత్తశుద్ది లోపించింది. కొరోనా  మహమ్మారి తర్వాత ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కొరోనా  సృష్టించిన విషవలయంలో చిక్కుకున్న ప్రజలు అనేకానేక సమస్యలతో సతమతమవుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తున్నది. ప్రజా స్వామ్యం వర్థిల్లుతోంది… దినదిన ప్రవర్థమానమవుతోంది… అని ప్రకటించుకోవడం కాదు..ప్రజలు ఏ మేరకు దానిని పొందగలుగుతున్నారన్నదే ముఖ్యం. దేశ భద్రత, ప్రగతి, సౌభాగ్యం కోసం ప్రజలు సర్వశక్తులూ ధారపోస్తున్నారు. అయితే  ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతోపాటు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పాలకులు తీసుకుంటున్న చర్యలు అంతగా ప్రతిఫలించడం లేదు. కొరోనా  మహమ్మారిపై భారత్‌ ‌సాగించిన పోరాటాన్ని ప్రపంచమంతా హర్షించింది. మానవ చరిత్రలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని మనం చేపట్టాం.కొరోనా  టీకాలను దేశీయంగానే తయారు చేసుకున్నాం. టీకా డోసుల పంపిణీలో 200 కోట్ల మార్కును గత నెలలోనే దాటేశాం. మహమ్మారిని నియంత్రించే విషయంలో అభివృద్ధి చెందిన కొన్ని దేశాల కంటే భారత్‌ ‌గొప్ప విజయాలు సాధించింది. అలాగే వ్యాక్సిన్‌ను పేద దేశాలకు కూడా పంపిణీ చేశాం. కాదనలేం.

కొరోనా ను తరిమికొట్టడంలో ఎవరికి వారు కృషి చేశారు. కొత్తగా ఎదురైన సవాళ్లను అధిగమించాం. ఇందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ ‌సిబ్బంది, వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కొరోనా  వైరస్‌ ఎం‌దరో జీవితాలను బలితీసుకుంది.ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. అలాగే మన ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయ్యింది. ఈ సంక్షోభం వల్ల తలెత్తిన పరిణామాలతో ఎన్నో దేశాలు సతమతమయ్యాయి.  భారత్‌ ‌వేగంగా కోలుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ‌కూడా ఒకటిగా ఉందన్న కితాబులతో ఉప్పొంగి పోకుండా క్షేత్రస్థాయి పరిశీలనలతో ప్రజల సమస్య లను పరిష్కరించే సత్తా చూపాల్సిన బాధ్యత పాలకులదే. అప్పుడే మన మనుగడకు అర్థం కలుగుతుంది. మన దేశంలో స్టార్టప్‌ ‌కంపెనీలు మంచి విజయం సాధిస్తున్నా.. యూనికార్న్ ‌కంపెనీల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా..ఉపాధి, ఉద్యోగ రంగాల్లో దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇది దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యగా చూడాలి. మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి స్టార్టప్‌ ‌కంపెనీలు దోహదపడు తున్నాయని చెప్పుకుంటున్నా..ఉద్యోగ కల్పన మాత్రం కానరావడం లేదు.

మనం సాధిస్తున్న అభివృద్ధి ఖచ్చింతంగా పేదలకు చేరాలి. అప్పుడే మనం అభివృద్ది సాధించినట్లు చెప్పుకోవాలి. దీర్ఘకాలంలో ఉపయోగ పడేలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. విధాన నిర్ణయాలు అమలు చేయాలి. ఆర్థిక విజయం ప్రజల జీవితాలను సులభతరం చేసేలా ఉండాలి. పేదలకు సొంతిల్లు అనేది  ఇంకా కలగానే మిగిలి పోయింది. స్వత్రంత్రగా ఇల్లు కట్టుకునే పరిస్తితి లేదు. పెరిగిన ధరలు సామాన్యులను, మధ్యతరగతి ప్రజల ను సొంతింటి కలకు దూరం చేస్తోంది.మనం స్వేచ్ఛగా జీవించేందుకు ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారిని స్మరించుకోవాల్సిన సందర్భం ఇది. వారి త్యాగాలను కేవలం కొందరే అనుభవిం చడం అభివృద్ది కాదు. ముఖ్యంగా మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నా..వారికి రక్షణ లేకుండా పోయింది. నిర్భయంగా వారు బజారులో తిరిగే పరిస్థితి లేదు. ఈ సమస్యలను ఆకళింపు చేసుకుని విధానాలు రూపొందించి చిత్తశుద్దితో అమలు చేస్తూ పోతేనే మనం సమగ్రాభివృద్ది సాధించగలం. మన భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లగలదు. పేదల ఈతిబాధలు తొలగిపోగలవు. ఇందుకోసం పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాల్సి ఉంది.
-ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page