ఇం‌త తొండి నేతల్ని నేనెక్కడ చూడలే..!

  • బిల్లులు ఇవ్వడం లేదంటూ గోబెల్స్ ‌ప్రచారం
  • వారం రోజుల పనుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి…
  • రూపాయితో సహా ఇస్తాం
  • కేంద్రం నుంచి 34వేల కోట్లపై చిలుకు గ్రాంట్స్ ‌రావాలె..
  • బండి, రేవంత్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌
  • ‌మాకు సర్పంచులపై గౌరవం ఉంది…
  • బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారు: మంత్రి దయాకర్‌రావు

సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో) : బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌, ‌కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో ఫైర్‌ అయ్యారు. బండి, రేవంత్‌ ‌వంటి తొండి నేతలను తానెక్కడ కూడా చూడలేదన్నారు. బుధవారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ…రాష్ట్రంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారనీ, దాదాపుగా ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్‌ ‌చేస్తున్నామనీ, కొద్దో గొప్పో ఉంటే వారం, పది రోజుల వ్యవధిలోనే క్లియర్‌ ‌చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావల్సిన బకాయిల గురించి ఏనాడూ మాట్లాడని బిజెపి చీఫ్‌ ‌బండి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే పని పెట్టుకున్నాడన్నారు. బిల్లులు చెల్లించడం లేదంటూ రేవంత్‌, ‌బండి గోబెల్స్ ‌ప్రచారం చేస్తున్నారనీ అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు 34వేల 149కోట్ల గ్రాంట్స్ ‌రావాలనీ, తెలంగాణకు హక్కుగా రావల్సిన గ్రాంట్స్ ‌గురించి బిజెపి చీఫ్‌ ‌బండి ప్రధానమంత్రి లేఖ రాయాలనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకమనీ, దాని ఫలితాలు మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దేశంలో ఉత్తమ గ్రామాలు 20 ప్రకటిస్తే అందులో తెలంగాణ గ్రామాలు 19 ఉన్నాయంటే ఇది తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు. బండి సంజయ్‌, ‌తొండి సంజయ్‌, ‌రేవంత్‌ ‌రెడ్డి అంతా గోబెల్స్..‌బండి సంజయ్‌ ‌మీ పార్టీ 18-19 రాష్ట్రాల్లో ఉంది అక్కడ అవార్డులు ఎందుకు రావడం లేదు. రేవంత్‌ ‌రెడ్డి బాగా మాట్లడుతున్నవు. మీ రాజస్థాన్‌, ‌చత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రాలకు ఎందుకు అవార్డులు రావడం లేదన్నారు. ట్రాక్టర్‌, ‌ట్రాలీ, ట్యాంకర్‌, ‌డంపుయార్డు, వైకుంఠధామం, నర్సీలు ఉన్న గ్రామాలు ఒక్క తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడ ఉన్నయా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ‌పాలనలో కరెంటు ఉండేది కాదు.

ఎండా కాలం వొస్తే మహిళలు బోరింగ్‌ ‌లు కొట్టి, కొట్టి చెతులు నెప్పులు పుట్టేవి. నీళ్లు బాయిల కాడ నుండి మోసి భుజాలు కాయలు కాసేవి. కరెంటు సమస్య లేదు, చెత్త కనపడం లేదు, 70 ఏళ్లుగా కాని పనిని రెండు మూడేళ్లలో ఈ కార్యక్రమం ద్వారా చేసుకున్నామనీ, ఓర్వలేక మాట్లాడుతున్నరనీ, తెలంగాణలో పల్లెలు మునపటి లెక్కన ఉన్నయా?అని ప్రశ్నించారు. ఇవాళ బిల్లులు ఇవ్వలేదని గోబెల్స్ ‌ప్రచారాన్ని బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీల నేతలు చేస్తున్నారన్నారు. ఇవ్వనిది బిజెపి ప్రభుత్వం. ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్‌- ‌మే నెలల్లో వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద 700 కోట్ల చెల్లింపులు జరిగాయనీ, కేవలం వారం రోజుల పనులవే పెండింగ్‌ ఉన్నాయన్నారు. వాస్తవానికి కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన 1200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, బండి సంజయ్‌ ‌లేఖ రాయాల్సింది కేంద్ర ఆర్థిక మంత్రికి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాయాలి. మా సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన 1200 కోట్లు విడుదల చేయమని ఉత్తరం రాయాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన 1200 కోట్లు తెచ్చి మాట్లాడాలన్నారు. కేంద్రం నుండి 8995 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన బకాయి ఉంది. ఇందులో ఎక్కువ గ్రామ పంచాయతీలకు, మండలాకు వెళ్లే పైసలే ఉన్నాయనీ, కేంద్ర నుంచి తెప్పించాలన్నారు. 13వ ఆర్థిక సంఘం డబ్బులు 1129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం డబ్బులు 817 కోట్లు,15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన1103 కోట్లు, బీఆర్జీఎఫ్‌ ‌కింద 1350 కోట్లు, సిఎస్‌ఎస్‌ ‌డబ్బులు ఆంధప్రదేశ్‌కు తప్పుగా పంపిన డబ్బులు 450 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, జిఎస్‌టి కింద 4142కోట్లు రావల్సి ఉన్నా రాలేదన్నారు. ఈ విషయంపై కేంద్రానికి బండి లేఖ రాయాలనీ, రాజ్యాంగం ప్రకారం హక్కుగా రావాల్సిన డబ్బు 8995 కోట్లు అని, ఢిల్లీకి పో…ప్రధానికి లేఖ రాయి. ఎందుకు ఇవ్వరు.. ఇవి మా హక్కు కాదా.. ఇవి వస్తే..మా పల్లెలు అభివృద్ధి చెందవా..మీరు ఇవ్వకపోయినా 13, 14 ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకున్నా… రాష్ట్ర ఖజానాలోని డబ్బులతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసిందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు.

వివిధ సిఫారసుల ద్వారా రూ.34,149 కోట్లు రావాలె…సర్పంచులెవరూ బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతల ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి
నీతి ఆయోగ్‌ ‌మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ 24,205కోట్లు ఇవ్వమంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం సెక్టార్‌ ‌స్పెసిఫిక్‌ ‌కింద 3024 కోట్లు, స్టేట్‌ ‌స్పెసిఫిక్‌ ‌గ్రాంట్‌ ‌కింద 2350 కోట్లు ఇవ్వమని సిఫారసు చేసింది. ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 817 కోట్లు గ్రామాలకు, పట్టణాలకు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచిస్తే ఎగబెట్టారు. ఇవి మేం చెప్పలేదు. 13,14,15వ ఆర్థిక సంఘాలు, నీతి ఆయోగ్‌ ‌చెప్పిందన్నారు. 34 వేల 100 కోట్లు విడుదల చేయించండి. ప్రధాన మంత్రి, అమిత్‌ ‌షా వచ్చి తిట్టిపోయిండ్రు తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఆర్థిక సంఘం సిఫారసు చేస్తే చేయకుండా ఎప్పుడైనా ఉందా ఇలా.. ఇదివరకు ఇలా జరిగిందా దేశంలో ఎప్పుడైనా.. ఈ డబ్బులు వస్తే మా రాష్ట్రం, పల్లెలు, గ్రామాలు బాగుపడేవన్నారు. ముందు రాష్ట్రానికి రావల్సిన ఇవ్వండి. ఇవ్వాల్సినవి ఇవ్వరు. మీది తొండాట. అడ్డం పడుతుంది మీరు. 700కోట్లు ఈ రెండు నెలల్లో మేం ఇచ్చినం. వారం పది రోజుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయనీ, అవి కూడా రూపాయితో సహా ఇస్తామన్నారు. బిజెపి, కాంగ్రెస్‌ ‌గొబెల్స్ ‌ప్రచారానికి పాల్పడుతున్నారనీ, తెలంగాణలో ఉన్నట్లు ట్రాక్టర్‌, ‌ట్రాలీ, ట్యాంకర్‌, ‌వైకుంఠథామం, డంపుయార్డు ఏ రాష్ట్రంలో ఉందా…జర్నలిస్టులను తీసుకెళ్దాం ఏ రాష్ట్రంలో అయినా ఇలా ఉందా అని నిలదీశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద ఇప్పటి వరకు 11,711కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందనీ, గత ఆర్థిక సంవత్సరం 4 వేల 619 కోట్లు ఖర్చు చేశామనీ, ఏం జరగలేదు.. ఏం ఇవ్వలేదన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఓడీఫ్‌ ‌ప్లస్‌ ‌గ్రామాలను కేంద్రం ప్రకటించింది. 99.98 శాతం ఓడీఫ్‌ ‌ప్లస్‌ ‌గ్రామాలు. దేశంలో ఏ రాష్ట్రం దరిదాపుల్లో లేదు. 50 శాతం దాటిన బీజేపీ పాలిత రాష్ట్రం దాటిందా..దాటితే ఆ రాష్ట్రం పేరు చెప్పండన్నారు. 12769 గ్రామ పంచాయతీలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా.. రాష్ట్రం ఏర్పడినపుడు 6వేలు మాత్రమే. ఎక్కువ పంచాయతీలు ఉండాలి, ఎక్కువ మంది గ్రామ సర్పంచ్‌లు ఉండాలని 12769 ఏర్పాటు చేశాం.

పరిపాలన దగ్గర అయిందన్నారు. తండాలను, గ్రామ పంచాయతీలు చేస్తామనీ కాంగ్రెస్‌ ‌రెండు సార్లు మాట తప్పింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మా తండాలను మేమే పరిపాలించుకుంటామన్న నినాదం నిజం చేసింది ప్రభుత్వమన్నారు. పంచాయతీరాజ్‌ ‌శాఖలో ఖాళీలు లేకుండా నియమించాం. పంచాయతీ సెక్రటరీలను నియమించాం. ఎంపిడివోలను నియమించాం. ఒక్క ఖాళీ లేకుండా నియమకాలు చేసి పంచాయతీ రాజ్‌ ‌శాఖను సిఎం కేసీఆర్‌ ‌బలోపేతం చేశారన్నారు. అవార్డులంటే తెలంగాణే. స్వచ్ఛ అవార్డు. సంసద్‌ ఆదర్శ అవార్లా ఇలా ఏ అవార్డు ప్రకటించినా అది తెలంగాణకే వస్తోందన్నారు. చాలా చక్కగా సర్పంచ్‌ ‌లు పని చేస్తున్నారు. సర్పంచులంటే మాకు ఎంతో గౌరవం ఉందన్నారు. సర్పంచులను బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారనీ, తప్పుడు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని ఎత్తుకున్నారన్నారు. గతంలో ఖమ్మం, ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లో డయేరియా, విషజర్వారలతో పల్లెలు వణికిపోయేవి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇంటింటికి మిషన్‌ ‌భగీరథ కింద మంచి నీరు ప్రతీ ఇంటికి ఇస్తున్నామనీ, సోషల్‌ ‌మీడియా ద్వారా కాంగ్రెస్‌, ‌బిజెపిలు అభివృద్ధి నిరోధకులుగా మారారనీ వీటిని అడ్డుకుందామన్నారు. సర్పంచ్‌లు చేసిన ప్రతీ పనికి బిల్లులు చెల్లిస్తున్నామనీ, సర్పంచులెవరూ బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతల ట్రాప్‌లో పడొద్దన్నారు. ఒక పథకం ప్రకారం బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీల నేతలు చేస్తోన్న దుష్ప్రచారమనీ, ఈ అభివృధ్ధిని కొనసాగిస్తామనీ, ఈ విడత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రులు హరీష్‌రావు, దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page